•పథకాలన్నీ పట్టాదారులకే
•పంటలపై ఎల్ నినో ఎఫెక్ట్
•పంట పండేదెట్ట అప్పు కట్టేదెట్టా
•ప్రభుత్వం ఆదుకోవాలంటూ పడిగాపులు
నవతెలంగాణ – మర్రిగూడ
అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏదైనా రైతుకు వ్యవసాయమే జీవనాధారం. అందులో లాభం వచ్చినా.. నష్టం వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా సుదీర్ఘంగా తన వ్యవసాయ ప్రయాణంలో అలా సాగిపోతూ ఉంటాడు. అతనికి పంట చేలే ప్రపంచం. పశువులు, పక్షులే స్నేహితులు. మండలంలోని 18 గ్రామపంచాయతీలలో ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం మండలంలో 24369 ఎకరాలలో పత్తి, 2900 ఎకరాల్లో వరి, 120 ఎకరాల్లో కంది, 20 ఎకరాలలో జొన్న,150 ఎకరాలలో కూరగాయల తోటలను సాగు చేశారు. అయితే ఇందులో దాదాపు 80 శాతం రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కౌలు రైతులే ఉన్నారు.
శాపంగా మారిన అగ్రికల్చర్ యాప్ లు
గతంలో పంట సాగుకు యూరియా అవసరం కోసం ఏం రైతులైన ఆధార్ ప్రాతిపదికన యూరియాను తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం అగ్రికల్చర్ యాప్ ల ద్వారా కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. యూరియా, అడుగు మందులను అగ్రికల్చర్ యాప్ ఓటిపిల ద్వారా బుక్ చేసుకోవడం, దానికి కూడా భూమి పాస్ పుస్తకం తప్పనిసరి కావడంతో కౌలు రైతులు చేసేదేమీ లేక ఎక్కువ ధరలకు షాపుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఇక పండిన పంటలు అమ్ముకోవాలన్న భూముల వివరాలు తప్పనిసరి కావడంతో కౌలు రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరలకు పంటలను అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు.
బ్యాంకు రుణం నోచుకోని కౌలు రైతు
ప్రస్తుతం వ్యవసాయం కూడా కత్తి మీది సాముల మారింది. లేబర్ ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పంట పండాలంటే పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. చేసేదేమీ లేక పంట పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద డిమాండ్ కొద్ది అధిక వడ్డీతో రుణాలు తెచ్చుకుంటుండగా.. మరి కొంతమంది బ్యాంకులలో తమ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు. అటు చేనికి కౌలు కట్టలేక, తెచ్చిన రుణాలు తీర్చలేక కౌలు రైతు రోజుకు అప్పుల కొలిమిలో మునిగిపోతున్నాడు.
ఆవిరైపోతున్న రైతు ఆశలు
యాప్ ల తో తలలు పట్టుకున్న రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ మరింత శాపంగా మారింది. వాతావరణంలో ఎల్ నినో ప్రభావంతో పంట వేసిన నాటు నుండి సరైన స్థాయిలో వర్షాలు కురవక మండలంలోని అన్ని గ్రామాలలో పంటలు 90 శాతం ఎండిపోతున్నాయి. పంటలు వేసి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు మండలంలో ఒక్క వాన గట్టిగా పడలేదు. మబ్బు పట్టడం ఆ క్షణమే మాయమైపోవడటం, విపరీతమైన ఎండలకు కళ్ళముందే పంటలు మాడిపోతుంటే రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ శూన్యం
మండలంలో అధిక శాతం రైతులు నిరక్షరాస్యలే ఉన్నారు. వారికి క్షుణ్ణంగా వివరిస్తే తప్ప ఒక అంశం పూర్తిస్థాయిలో అర్థం కాదు. అలాంటిది ఎల్ నినో ప్రభావం వ్యవసాయంపై ఏ విధంగా ఉంటుంది, దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలను సాగు చేసుకోవాలని పేపర్లలో, టీవీలలో చెప్పడమే తప్ప మండల వ్యవసాయ అధికారు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలలో తిరిగి రైతులకు అవగాహన కల్పించడం లేదంటూ కొన్ని గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతులకు ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకువస్తుంది, పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాలనే అంశాలను అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.
ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి
వ్యవసాయపరంగా ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందని కౌలు రైతులను ప్రభుత్వాలు వారి సమస్యలను తెలుసుకొని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని మండలంలోని కౌవులు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం కౌలు రైతుల ఆర్థిక బలోపేతానికి కొన్ని ప్రత్యేక స్కీములు కేటాయించి వ్యవసాయం చేసుకోవడానికి ధీమా కల్పించాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి : మార్నేని అంతయ్య, కౌలు రైతు కమ్మగూడ
నేను 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి వేసాను. ఇప్పటికే లక్ష 50 వేల పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. బ్యాంకులో కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులకు కూడా కొన్ని స్కీములు పెట్టి ఆర్థికంగా ఆదుకోవాలి.
వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి: జిల్లా కిషోర్, కౌలు రైతు, దామెర భీమనపల్లి
నేను 18 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి వేసాను. ఇప్పటివరకు 3 లక్షల 40 వేల పెట్టుబడి వచ్చింది. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు పెట్టుబడి కష్టంగా ఉంది. ప్రభుత్వం మమ్ములను ఆదుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పంట సాగుపై, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి.
సమస్యను పై అధికారులకు తెలియజేస్తా : మండల వ్యవసాయ అధికారి సాహస్
మండలంలో కౌలు రైతుల ఎదుర్కొంటున్న సమస్యను పై అధికారులు తెలియజేస్తాను. ప్రస్తుతం కౌలు రైతులకు ప్రభుత్వపరంగా ఎలాంటి స్కీములు లేవు. రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఇంకా మెరుగ్గా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతాం.



