- పేటలో కోలాహలంగా విగ్రహాల ఏర్పాటు
- బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి భూమిపూజ
- 16 కు చేరిన విగ్రహాల సంఖ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో విగ్రహాల ఏర్పాటు జోరుగా సాగుతోంది. ఒకపక్క కొత్త విగ్రహాల నిర్మాణాలు కొనసాగుతుండగానే.. మరోపక్క పూర్తయిన విగ్రహాలను అంగరంగ వైభవంగా ఆవిష్కరిస్తున్నారు.ఆయా కుల, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పట్టణంలో సందడి నెలకొంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కార్యక్రమాలకు హాజరవుతుండటంతో రాజకీయ, సామాజిక వాతావరణం వేడెక్కుతోంది. ఆగస్టు 15 న పునర్నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ విగ్రహాల ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ పరంపర కొనసాగుతోంది. కొమరం భీం విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆవిష్కరించారు. వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కలిసి ఆదివారం ఆవిష్కరించారు.
జగ్జీవన్‌రామ్ విగ్రహానికి భూమిపూజ:
సోమవారం మాదిగ సామాజిక నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని, దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.మరోవైపు చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన ప్లెక్సీలు వెలిశాయి. పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలను పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే పట్టణంలో స్వామి వివేకానంద, వైఎస్ రాజశేఖరరెడ్డి, నందమూరి తారకరామారావు, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. తాజాగా జరుగుతున్న ఏర్పాట్లతో విగ్రహాల సంఖ్య 16 కు చేరింది. ఇంకా ఎన్ని విగ్రహాలు కొలువుదీరనున్నాయో వేచి చూడాల్సిందే.



