Tuesday, August 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు గుండె చప్పుడు ఆగింది

రైతు గుండె చప్పుడు ఆగింది

- Advertisement -

సీపీఐ(ఎం) సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి ఇకలేరు
ఉద్యమ నేతను కోల్పోయిన అన్నదాతలు..ఎల్‌‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి కార్నియా, ఉస్మానియా ఆస్పత్రికి చర్మదానం
వైద్య పరిశోధనల నిమిత్తం నేడు గాంధీ మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం..ప్రజల సందర్శనార్థం నేడు ఎంబీ భవన్‌‌కు
12 గంటలకు గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర..హాజరుకానున్న సీపీఐ(ఎం), ఏఐకేఎస్‌ జాతీయ నేతలు


సారంపల్లి మల్లారెడ్డి…ఆయనో విజ్ఞాన గని. నడిచే గ్రంధాలయం. భారత రైతాంగ సమస్యలు మొదలు, పట్టణాల్లో కాలుష్య భూతం వరకు అన్ని సమస్యల పరిష్కారాలకు ఆయన దగ్గర ప్రత్యామ్నాయాలు ఉంటాయి. పార్టీ, ప్రజాసంఘాలకు ఏవైనా ధర్మ సందేహాలు వస్తే, ఆయన చిటికెలో వాటి పరిష్కారాలను సూచించేవారు. చివరివరకు కాలినడకనే ఆయన ప్రయాణం. దారిలో ఎవరైనా ఆయన్ని గుర్తుపట్టి సార్‌…నేను బండిపై దింపేస్తా రండి అని పిలిస్తే, ఎందుకులే…దగ్గరేగా నడిచి వెళ్లిపోతా అని సున్నితంగా తిరస్కరించేవారు. ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి మొదలు ఇప్పటి కేసీఆర్‌, రేవంత్‌‌రెడ్డి వరకు అందరూ ఆయన దగ్గర వ్యవసాయ పాఠాలు నేర్చుకున్నవారే. అనేక పత్రికల్లో అనేక అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు ఆయా రంగాల వారికి దిక్సూచిగా ఉపయోగపడేవి. ఎక్కడెక్కడి సమాచారన్నో పోగేసి, దాన్ని విశ్లేషించి, సహేతుకమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ఆయనకు ఆయనే సాటి. ‘‘నేను కమ్యూనిస్టుని. సమస్యల పట్ల అధ్యయనం, పరిష్కారమార్గం చూపాల్సిన బాధ్యత నాది. బూర్జువా పార్టీల నేతలకు అంత తీరుబడి, చిత్తశుద్ధి ఎక్కడుంటుంది. అందుకే ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారాలు కూడా చూపితే, వాటిని వెంటనే వారు ఆమోదిస్తారు. తద్వారా ప్రజాపోరాటాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది’’ అని ఆయన తరచూ చెప్పే మాట…విప్లవోద్యమ స్ఫూర్తి బాట. అలాంటి సారంపల్లి సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళి.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతు కోసం నిరంతరం తపించే గుండె చప్పుడు ఆగింది. కోపమనేది తెలియకుండా చిరునవ్వుతో సమాధానమిచ్చే నోటి మాట ఆగిపోయింది. తమ కోసం కొట్లాడే నేత సారంపల్లి మల్లారెడ్డి ఇక లేరనే విషయాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. ఏ అంశంపై సమాచారమడిగినా అలవోకగా విడమర్చి చెప్పే ఎన్‌‌సైక్లోపీడియా లాంటి సమాచార గనిని మీడియా రంగం కోల్పోయింది. రైతు ఉద్యమ నేత, సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత సారంపల్లి మల్లారెడ్డి(89) కన్నుమూశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో శ్వాసకోశ, యూరినల్‌ ఇన్ఫెక్షన్‌, ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున 3:00 గంటలకు తుదిశ్వాస విడిశారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వయోభారంరీత్యా ఆయన శరీరం సహకరించలేదు. సారంపల్లి మల్లారెడ్డి మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌‌బాబు, బాబూరావు తదితరులు నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మిని, కుటుంబసభ్యులను ఓదార్చారు. మార్చురీలో భద్రపరిచిన మల్లారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రైతు కమిషన్‌ ‌చైర్మెన్‌ ‌కోదండరెడ్డి నిమ్స్‌ ‌ఆస్పత్రికెళ్లి మల్లారెడ్డి మృతదేహాని కి నివాళులు అర్పించారు. మల్లారెడ్డి నిజాయితీ గల రైతు నాయకులనీ, ఆయన సంబంధించిన పనులు చూశారు. మల్లారెడ్డి కార్నియాను ఎల్‌‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి, చర్మాన్ని ఉస్మానియాలోని చర్మబ్యాంకుకు అప్పగించారు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్‌‌రెడ్డి, ఇద్దరు కుమార్తెలు అనిత, సునీత. కాగా పెద్ద కుమార్తె అనిత ఇటీవల క్యాన్సర్‌‌తో మరణించారు. వాసుదేవరెడ్డి సీపీఐ (ఎం) వరంగల్‌ ‌జిల్లా కార్యదర్శిగా పని చేశారు.

​ఉద్యమ ప్రస్థానం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో 
కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారు. రైతు సంఘం నర్సంపేట డివిజన్ కార్యదర్శిగా 1973లో బాధ్యతలు చేపట్టారు. సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా 
మారారు. 1981లో ఆ సంఘం వరంగల్‌ ‌జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1978 జూన్ 25న హైదరాబాద్ మహాసభలో రాష్ట్ర రైతు సంఘం నాయకత్వంలోకి వచ్చారు. 1999 ఫిబ్రవరి 17న జరిగిన వరంగల్ మహాసభలో రాష్ట్ర రైతు సంఘంఅధ్యక్షుడిగా, 2003 ఫిబ్రవరి 21న కర్నూలు మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2003 మార్చి 9న అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తిమ్మంపేట సర్పంచ్‌గా (1981 – 1988) పనిచేశారు. 
సింగిల్ విండో అధ్యక్షులుగా గ్రామ అభివృద్ధికి, పేదల 
భూముల పరిరక్షణకు కృషి చేశారు. ఓంకార్‌ ‌సీపీఐ(ఎం) లో 
ఉన్న సమయంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

డాక్టర్లకూ పాఠం…
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మల్లారెడ్డికి చికిత్స అందించేందుకు వచ్చిన డాక్టర్లతో రష్యా విప్లవం, అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష, తాజా అంతర్జాతీయ పరిణామాలు, సమసమాజ స్థాపన, రైతు సంఘం జాతీయ మహాసభల సన్నద్ధం వంటి అంశాలపై ఆయన మాట్లాడటాన్ని చూసి వైద్యులే విస్తుపోయారని రైతు సంఘం నేతలు తెలిపారు. వైద్యం చేస్తుంటే అలా స్పందించడం ఆయనకున్న అపార జ్ఞానానికి నిదర్శనం.

మహాసభల పనుంది…ఇంటికెళ్దాం…
‘నాకు రైతు సంఘం జాతీయ మహాసభల పనుంది. నోట్స్‌ ‌తయారు చేసుకోవాలి. త్వరగా ఇంటికి తీసుకెళ్లండి. ఇక్కడ బంధించారేంటి?..’ అంటూ కుటుంబ సభ్యులు, రైతు సంఘం నేతల వద్ద సారంపల్లి మల్లారెడ్డి అన్నారంటేనే చివరి శ్వాస వరకు రైతు సంక్షేమం గురించీ, ఉద్యమ నిర్మాణం గురించీ ఎంత పరితపించారో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోనూ మల్లారెడ్డికీ, ఆయన సతీమణి భాగ్యలక్ష్మికి పాజిటివ్‌ అని తేలింది. ‘ఆ సమయంలోనూ నాకేమవుతుంది? మళ్లీ తిరిగొస్తా’ అంటూ రైతు సంఘం నేతలకే ధైర్యం చెప్పి చికిత్స పొంది కోలుకుని తిరిగొచ్చిన నేత సారంపల్లి మల్లారెడ్డి.

​​కూతురు మరణంతో…
మూడు నెలల క్రితం సారంపల్లి మల్లారెడ్డి పెద్ద కూతురు అనిత క్యాన్సర్‌ ‌తో మరణించింది. అప్పటి నుంచి మానసికంగా ఆయన కొంత కుంగిపోయారు. వయోభారమూ వెన్నాడింది. అయితే, వాటిని నుంచి బయటపడేందుకు ఆయన చాలా ప్రయత్నం చేశారు. వారం కిందట వరంగల్‌ ‌జిల్లా సీపీఐ(ఎం) నేత, అత్యంత సన్నిహితుడు చంద్రారెడ్డి మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం వరంగల్‌ వెళ్లొచ్చారు. ‌చంద్రారెడ్డి మరణం కూడా ఆయన్ను కలిచివేసింది. హైదరాబాద్‌‌కు తిరిగొచ్చాక ఒకటెండ్రు రోజులకు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.

​​సమాచార గని సారంపల్లి
సాగునీటి రంగం, రెవెన్యూ, బడ్జెట్‌, పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థ ఇలా ఏ అంశంపై సందేహం వచ్చినా జర్నలిస్టులు ఎక్కువగా సంప్రదించే నేత సారంపల్లి మల్లారెడ్డి. కొందరు జర్నలిస్టులు ఆయన్ను ఎన్‌‌సైక్లోపీడియా అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. నిరంతర అధ్యయనం, అందరికీ అర్థమయ్యే భాషలో వివరించడం, గణాంకాలతో సహా డేటా అందించడం ఆయనకు ఈ పేరు తెచ్చిపెట్టింది. రైతాంగ సమస్యలు, సాగునీటి రంగంపై బైట్‌‌లు కావాలన్నా, పత్రికలకు సమాచారం అవసరమున్నా, చర్చావేదికలో పాల్గొనే వ్యక్తులు కావాలన్నా, ‌మీడియాకు టక్కున గుర్తొచ్చే రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి. సాగునీటిరంగంపైనా, వ్యవసాయ రంగంపైనా చర్చావేదికల్లో అనర్గళంగా మాట్లాడేవారు. డిబేట్‌‌లలో ఆయన ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. రాజకీయ పార్టీల నాయకులను ఏనాడూ తిట్టలేదు. సమస్య…దాని మూలాలు…పరిష్కార మార్గాలు చూపుతూ చర్చలు అర్థవంతంగా జరిగేలా చూడటంలో మల్లారెడ్డి దిట్ట అనే గౌరవం మీడియాలో ఉంది. నవతెలంగాణ, ప్రజాశక్తి పత్రికల్లో ఆయన రెగ్యులర్‌‌గా వ్యాసాలు రాసేవారు.

అనుభవాల నుంచి 20 పుస్తకాలు…
సారంపల్లి మల్లారెడ్డి చదివింది పదో తరగతే. కానీ, క్షేత్ర స్థాయిలో ప్రజా జీవితాలను జీవితాంతం చదివారు. అన్నదాతల సాదకబాధకాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకే పాఠాలు చెప్పగలిగే విజ్ఞాన బాండాగారాన్ని రూపొందించుకున్నారు. పంట ఏదైనా, ప్రాజెక్ట్ ఏదైనా వేళ్ళమీద లెక్కగట్టి దాని లోతుపాతులు చెప్పగలిగిన నేర్పరి. స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలను దానివెనుక ఉన్న దోపిడీ దారుల నిజస్వరూపాన్ని విడమరచి వివరించగల విశ్లేషకుడు. సాగుభూమి మొదలూ సామ్రాజ్యవాదం దాకా ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే అరుదైన మేధావి. పోలీసు పటేల్ జీవితాన్ని వదిలేసి పీడితుల విముక్తి కోసం కాలికి బలపం కట్టుకొని గ్రామ గ్రామాన్ని కలియ తిరిగిన నిక్కార్సైన నాయకుడు. 80 పదుల నిండు వయసులోనూ కంప్యూటర్ తో కుస్తీ పడుతూ యువతరానికి తన జ్ఞానాన్ని పంచేందుకు యాతన పడిన రైతాంగ ఉద్యమ నేత. పండితులకు అర్థం కాని విషయాలను కూడా సాధారణ జనానికి సైతం అర్థమయ్యే భాషలో పుస్తకాలు రచించారు. రైతు ఉద్యమ చరిత్ర 1947-2007 (2008), బడుగు రైతుల వెతలు (2008), కమిషన్లు రెకమండేషన్లు (2014), కార్పొరేట్ దిశగా వ్యవసాయం (2013), రాష్ట్రంలో నదీజలాలు – ప్రాజెక్టులు – వివాదాలు (2013), తెలంగాణలో సాగునీటి వనరులు -అవకాశాలు (2015), తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు (2016), వ్యవసాయ సంక్షోభంతో రైతుల దివాళా- అత్యంత ధనిక రాష్ట్ర జపం (2018), సహకార రుణాలు (2003), భారత రైతాంగ పోరాటాలు (2020) లాంటి 20కి పైగా పుస్తకాలను రచించారు.

​ఇంగ్లీష్‌‌పై అపార పట్టు..అరుదైన మేధావి
సీపీఐ(ఎం), రైతు సంఘం కేంద్ర కమిటీల నుంచి ఇంగ్లీషులో వచ్చే డ్యాకుమెంట్లను అధ్యయనం చేసి ప్రజలకు విడమర్చి చెప్పలేని పరిస్థితిలో ఉండకూడదనుకున్నాడు. ఇంగ్లీషు పత్రికలను, డాక్యుమెంట్లను నిరంతరం అధ్యయనం చేసి సారాంశాన్ని క్రోడీకరించడంలో పట్టు సాధించారు. ఏ అంశంపైనా సేకరించిన సమాచారాన్ని పదిలంగా పెట్టుకునేవారు. ఏ అంశంపై సమాచారం కావాలన్నా మల్లారెడ్డి దగ్గర దొరుకుతుంది…పార్టీ లైన్‌‌కు అనుగుణంగా సమాచార విశ్లేషణ ఉంటుందనే నమ్మకాన్ని పొందారు. ఆయన నిరంతర అధ్యయనమే ఆయన్ను ఉన్నతస్థాయిలో నిలబెట్టిందనేది కాదనలేని సత్యం.

నిరాడంబర జీవనం ..అందరికీ ఆదర్శమయం
సామాన్య రైతు దగ్గర నుంచి సీఎం దాకా చూడగానే లేచి పలుకరించి గౌరవం పొందే వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ పనిచేశారు. అంత పెద్ద పేరున్న మల్లారెడ్డి ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్డు సమీపంలోని జవహర్‌‌నగర్‌‌లో రెండు చిన్న రూములు+కిచెన్‌(అంతా కలిపితే 20 ఫీట్లు లేని ఇల్లు) గల అద్దె ఇంట్లో జీవితాంతం అతి సాధారణ జీవితాన్ని గడిపారు. తన పనులను ఇతరులతో చేయించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి. గౌరవంతో ఎవరైనా ఇంటి దగ్గర దింపుతాం సార్‌ అంటే..‘పర్లేదయ్యా..నడిస్తే ఆరోగ్యానికి మంచిదయ్యా’ చిరునవ్వుతోనే సమాధానం చెప్పేవారు. చనిపోయే మూడు రోజుల ముందటి వరకు కూడా పార్టీ, రైతాంగ ఉద్యమ నిర్మాణం కోసమే పరితపించారు.

​జలయజ్ఞం, రైతాంగ ఉద్యమాలు, 
ఎస్ఆర్‌ఎస్‌‌పీలో కీలక పాత్ర
వైఎస్‌ ‌రాజశేఖర్‌‌రెడ్డి సీఎం అయ్యాక సాగునీటిరంగంలో అపారమైన జ్ఞానమున్న సారంపల్లి మల్లారెడ్డిని పిలిపించుకుని సాగునీటి పారుదల రంగం విస్తరణపై విస్తృతంగా చర్చించారు. జలయజ్ఞంలో పలు ప్రాజెక్టుల రూపకల్పనలో మల్లారెడ్డి సూచనలు, సలహాలు తీసుకున్నారు. వరంగల్‌ ‌జిల్లాలోని పలు ప్రాంతాలకు నీళ్లందించే ఎస్‌ఎఆర్‌ఎస్‌‌పీ కాల్వల విస్తరణ పనులు చేయించేందుకు మల్లారెడ్డి మొదలుపెట్టిన ఉద్యమం అన్ని పార్టీల ఎజెండాగా మారింది. తదనంతర కాలంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆ పనులకు నిధులు కేటాయిస్తామని స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని దించడంలో రైతు సంఘం చేపట్టిన ఉద్యమం కీలక పాత్ర పోషించిందనే చర్చ కూడా ఉంది.

​సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిక్సూచిలా…
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన ఏయే అంశాలను లేవనెత్తాలి? వాటి మూలాలేంటి? పరిష్కారంలో ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి? పరిష్కార మార్గాలేంటి? అనే అంశాలపై అసెంబ్లీలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సారంపల్లి మల్లారెడ్డి రాసిచ్చేవారనే పేరుంది. బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టిన వెంటనే దాంట్లోని లోతుపాతులను విడమర్చి చెప్పడంలో మల్లారెడ్డి దిట్ట. ఆయన రాసిచ్చిన సమాచారం చట్టసభల్లో తమకు ఎంతగానో దోహదపడిందని సీపీఐ(ఎం) నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు గుర్తుచేసిన సందర్భాలున్నాయి. సీపీఐ(ఎం) నేతలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ వారిని తీర్చిదిద్దడంతో మల్లారెడ్డి చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. ​​

జీవిత భాగస్వామి సహకారం మరువలేనిది
​చేసే ప్రతి పనిలో జీవిత సహచరణి సహకారం, తోడ్పాటు ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఇట్టే సాధించొచ్చు. అలాంటి సహకారమే సారంపల్లి మల్లారెడ్డికి తన జీవిత భాగ్యస్వామి భాగ్యలక్ష్మి నుంచి లభించింది. మల్లారెడ్డి జీవితమంతా ప్రజా క్షేత్రంలోనే. రైతుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలోనే ఉండేవారు. అలా ఉండాలంటే ఆరోగ్యం అత్యంత కీలకం. మల్లారెడ్డి ఆరోగ్య విజయ రహస్యం భాగ్యలక్ష్మి అనీ, ఆయనకు చిన్నపిల్లాడి మాదిరిగా సేవలందించేదని రైతు సంఘం నేతలు గుర్తు చేస్తుంటారు. ప్రతిరోజూ ఆయనతోపాటు ఉదయం నాలుగున్నరకే లేవడం, ఆయనకు కావాల్సిన టిఫిన్స్‌ ‌చేసిపెట్టడం, సరైన సమయంలో మెడిసిన్‌ ‌వేసుకునేలా చూడటం వంటి పనులతో ఆమె మల్లారెడ్డిని కంటికిరెప్పలా కాపాడుకునేవారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన దగ్గర నుంచి తుదిశ్వాస విడిచే వరకూ ఆయన్ను బతికించుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నించారు.

నోట్స్‌ ‌తయారు చేసుకోవడం… సొంతంగా కంపోజ్‌ ‌చేసుకోవడం
సారంపల్లి మల్లారెడ్డి నిరంతర అధ్యయనశీలి. ఉదయం నాలుగున్నర గంటకే లేచి రెడీ అయ్యేవారు. ఉదయం 5:30 గంటల నుంచి 6 : 00 గంటల లోపే టిఫిన్‌ ‌పూర్తిచేసేవారు. ఆ తర్వాత ప్రజాశక్తి, నవతెలంగాణతో పాటు అన్ని తెలుగు పత్రికలను, ఒకటెండ్రు ఇంగ్లీష్‌ ‌పత్రికలను దినం తప్పకుండా చదివేవారు. దాన్ని అక్కడితో వదిలివేయకుండా అందరికంటే ముందే సీపీఐ(ఎం) ఆఫీస్‌‌కు చేరుకుని తాను చదివిన వ్యాసాలు, వార్తలు, తాజా రాజకీయ అంశాలను సబ్జెక్టులవారీగా నోట్స్‌ ‌తయారీ చేసుకునేవారు. ‌కాలక్రమంలో కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ ‌కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత సొంతంగా ఆఫీసులో సిస్టమ్‌‌లో కంపోజ్‌ ‌చేసి డేటాను నిక్షిప్తం చేసేవారు. మరీ ముఖ్యమైన సమాచారమైతే ప్రింట్‌ ‌తీసుకుని సబ్జెక్టులవారీగా భద్రపరిచేవారు. ఆయన రూమ్‌‌కెళ్లి ఎవరైనా సమాచారం అడిగితే వెంటనే టక్కున అది తీసి ఇచ్చేవారు.

మరణానంతరమూ నలుగురికి ఉపయోగపడేలా
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన మల్లారెడ్డి మరణించాక కూడా నలుగురికీ ఆదర్శంగా ఉండే పనిచేశారు. మరణాంతరం తన మృతదేహాన్ని విద్యార్థుల పరిశోధనల నిమిత్తం వైద్యకళాశాలకు ఇచ్చేటట్టు బతికుండగానే అంగీకారపత్రం రాసిచ్చారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మల్లారెడ్డి మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్‌ ‌కాలేజీకి అప్పగించనున్నారు. మరొకరి జీవితంలో వెలుగులు నింపేందుకు మల్లారెడ్డి కార్నియాను ఎల్‌‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి అప్పగించారు. అదే సమయంలో మల్లారెడ్డి చర్మాన్ని కూడా చర్మబ్యాంకుకు తరలించారు. కాలిన గాయాలతో సతమతం అవుతున్న వారికి శస్ర్తచికిత్స ద్వారా అమర్చేందుకు ఆ చర్మాన్ని ఉపయోగించనున్నారు.

నేడు అంతిమ యాత్ర
సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయమైన ఎంబీ భవన్‌‌కు తీసుకొస్తారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతారు. అనంతరం ఎంబీ భవన్‌ ‌నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆస్పత్రి వరకు సారంపల్లి మల్లారెడ్డి అంతిమయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మల్లారెడ్డి భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, రైతు సంఘం జాతీయ నాయకులు కృష్ణ ప్రసాద్, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వివిధ రాష్ర్టాల నుంచి పార్టీ ప్రతినిధులు, వామపక్ష పార్టీల నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారు. అంతిమయాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ పిలుపునిచ్చారు.

సీపీఐ(ఎం)లో..
నర్సంపేట డివిజన్‌‌లో 1973 నుంచి సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1981 అక్టోబర్ 11న నల్లబెల్లి మహాసభలో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1985లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, 1991లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005 జనవరి 28న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా బాధ్యతల్లోకి వచ్చారు. 2015 వరకు ఆ విధుల్లో ఉన్నారు. 2015లో సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కుటుంబ నేపథ్యం
వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం తిమ్మంపేటలో 25 ఆగస్టు 1939న మల్లారెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణారెడ్డి, రాధమ్మ. వరంగల్‌లోని మహబూబియా హైస్కూల్, వేయిస్తంభాల గుడి పాఠశాల, ఏబీవీ హైస్కూల్‌లో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1953లో వివాహం జరిగింది. 1964 నుంచి 1971 వరకు తిమ్మంపేట పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1971 ఆగస్టు 6న తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకుల దాడి జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -