Tuesday, August 25, 2026
E-PAPER
Homeక్రైమ్విశాఖపట్నం టూ ఢిల్లీకిగంజాయి రవాణా

విశాఖపట్నం టూ ఢిల్లీకిగంజాయి రవాణా

- Advertisement -

హైదరాబాద్‌‌లో అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
రూ. 24.50 లక్షల విలువైన 48 కిలోల 
గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

​విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసి న్యూఢిల్లీకి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని హైదరాబాద్‌‌లోని అబిడ్స్‌ పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి స్టేషన్ రోడ్డులోని సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 48 కిలోల పొడి గంజాయి (24 సీల్డ్ ప్యాకెట్లను బ్రౌన్ టేప్‌తో చుట్టి, 2 ఎయిర్ క్యారీ బ్యాగులు, 2 పెద్ద బ్రీఫ్‌ కేసులలో దాచారు), మొబైల్‌ ‌ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్స్‌ ‌డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన ఇంటర్మీడియట్ వరకు చదివిన బాలుడు గంజాయి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చిన్ననాటి మిత్రుడు అంకిత్ కుమార్ అలియాస్ శివతో చేతులు కలిపాడు. అంకిత్ ఆ బాలున్ని న్యూఢిల్లీకి చెందిన బండియాకు పరిచయం చేశాడు. బండియా సూచనల మేరకు అంకిత్, మైనర్‌ విశాఖపట్నం వెళ్లి నౌషాద్, రాజేష్‌ నుంచి 48 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని 24 ప్యాకెట్లుగా చేసి బ్యాగుల్లో పెట్టారు. గత శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో నాంపల్లికి బయలుదేరగా, మార్గమధ్యంలో ఢిల్లీ రైలు వేళలు కనుక్కుంటానని చెప్పి అంకిత్ ఆటో దిగిపోయాడు. మైనర్‌ను సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద వేచి చూడమని చెప్పాడు. అంకిత్ కోసం వేచి చూస్తున్న సమయంలో ముందస్తు సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్, అబిడ్స్‌ పోలీసులు దాడి చేసి బాలున్ని పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ సుమారు రూ.24,50,000 ఉంటుంది. ఈ ఆపరేషన్‌‌లో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌‌స్పెక్టర్ పి. రాఘవేందర్, అబిడ్స్‌ డిటెక్టివ్ ఇన్‌‌స్పెక్టర్‌ కె. ప్రసాద్ రావు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జి. శ్రీకాంత్, అబిడ్స్‌ ఎస్సై పి. శ్రీకాంత్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. పరారీలో ఉన్న న్యూఢిల్లీకి చెందిన బండియా (రైడర్/అమ్మకందారుడు), విశాఖపట్నానికి చెందిన నౌషాద్ అలియాస్ సునీల్ (గంజాయి సరఫరాదారుడు), రాజేష్ (గంజాయి సరఫరాదారుడు), బీహార్‌‌కు చెందిన అంకిత్ కుమార్ అలియాస్ శివ (గంజాయి రవాణాదారుడు) కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -