Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలు

వికలాంగులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలు

- Advertisement -

స్టే ఉత్తర్వులను సవరించిన
 హైకోర్టు
సంక్షేమ పథకాలతో
 ఎమ్మెల్యేలకూ సంబంధమేంటంటూ ప్రభుత్వానికి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వికలాంగ బాలికలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆర్థిక సాయం అందించే జీవో నాలుగుపై విధించిన మధ్యంతర నిలుపుదలను హైకోర్టు తొలగించింది. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు ఉన్నందున వారికి ఉద్దేశించిన సాయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదన్న కారణంగా గత స్టే ఆదేశాలను సవరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ప్రజాప్రతినిధుల పాత్రకు సంబంధించి స్పష్టమైన చట్టపరమైన ఆధారం ఏంటో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ప్రజాధనం పంపిణీ చేసే ప్రక్రియలో ఎమ్మెల్యేలు ఎందుకు భాగస్వాములు కావాలనుకుంటున్నారో హైకోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారులను గుర్తించడం, అర్హతలను పరిశీలించడం, ప్రభుత్వ సాయం అందించడం వంటి బాధ్యతలను అధికార యంత్రాంగం నిర్వర్తించాలని చెప్పింది. నిబంధనలు ఇలా ఉంటే ఎమ్మెల్యేలకు ఆ నిధులను పంపిణీ చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన ఎనిమిది జీవోల చట్టబద్ధతను సవాలు చేస్తూ అడ్వకేట్‌ విజయ్‌ గోపాల్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారించారు. ఈ కేసులో తమను కూడా ప్రతివాదులుగా చేర్చాలని మలక్‌పేట, నాంపల్లి ఎమ్మెల్యేలు అహ్మద్‌ బి‌న్‌ అబ్దుల్లా బలాల, మాజీద్‌ హుస్సే‌న్‌ వేసిన మధ్యవర్తిత్వ పిటిషన్లను అనుమతించాలని వాళ్ల లాయర్లు కోరారు. తమ నియోజకవర్గాల్లో ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నందున, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సంతకం ఉండాలని జీవో 25లో స్పష్టంగా ఉందని వారు కోర్టుకు వివరించారు. ఆ నిబంధనను ఇప్పటివరకు ఏ న్యాయస్థానమూ రద్దు చేయలేద‌నీ, అందువల్ల ఎమ్మెల్యేలను ఈ కేసులో భాగస్వాములను చేయాలని అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ జీవోలో ఏం ఉందన్నది కాకుండా, అలాంటి నిబంధనను రూపొందించడానికి ప్రభుత్వం ఏ చట్టం ఆధారంగా వ్యవహరించిందో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సమాజంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న అనాథ బాలలు, మహిళలు, నిరాశ్రయులు, ఇతర అర్హులైన పేదలు ఎంతోమంది ఉన్నారని వివరించారు. కొందరికి కనీసం ఆధార్‌ వంటి గుర్తింపు పత్రాలు కూడా లేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అయితే పేదలకు సాయం చేయడం ఒక అంశమైతే, ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి చట్టపరమైన ఆధారం ఉండటం మరో కీలక అంశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించే ప్రతి రూపాయికీ చట్టబద్ధమైన లేదా శాసనపరమైన మద్దతు అవసరమని సూచించారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఇతర బకాయిలను పెండింగ్‌లో ఉంచుతున్న సమయంలో సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో నిధులు ఎలా కేటాయిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితి, భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని గతంలో ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ ఎందుకు సమర్పించలేదని అడిగారు. భూములు కోల్పోయిన బాధితులు ఎనిమిది నెలలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారనీ, అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములు ఇచ్చిన వారికి ముందుగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ ఖా‌న్‌ స్పందిస్తూ పరిహారం చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందాల్సి ఉంద‌నీ, రెండు వారాల్లో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించిన ఏడు జీవోల అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది.
ఈ పథకాలను సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదనీ, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదనీ, సింగిల్‌ జడ్జి ఈ అంశాన్ని విచారించే పరిధి కూడా లేదని ప్రభుత్వం అప్పీలులో పేర్కొంది. రాజ్యాంగంలోని 162వ అధికరణ కింద ప్రభుత్వానికి జీవోలు జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఈ అప్పీలుపై డివిజన్‌ బెంచ్‌ విచారణ చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -