ఆధార్‌ కేంద్రాల సంఖ్యను తక్షణమే పెంచాలి

ఆధార్‌ కేంద్రాల సంఖ్యను తక్షణమే పెంచాలి– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర అవసరాలకు, ‘అభయహస్తం’ పథకానికి అధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయడంతో మీసేవా కేంద్రాల వద్ద విపరీతంగా రద్దీ పెరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ తెలిపింది. గడువులోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసుకునేందుకు ప్రజలు తీవ్రఅవస్థలు పడ్డారని పేర్కొంది. అందువల్ల ఆధార్‌ కేంద్రాల సంఖ్యను పెంచి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కెవైసీ అనుసంధానం, అడ్రస్‌ మార్పు, పేరులో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రజలు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తగిన అవగాహన లేకపోవడంతోపాటు సాంకేతిక సమస్యలతో సవరణలు చేసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. గతంలో వేలసంఖ్యలో ఉన్న ఆధార్‌ కేంద్రాలు భారీగా తగ్గి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 350 మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నదని వివరించారు. ప్రధానంగా జిల్లాలలో సరిపడా కేంద్రాలు లేకపోవడంతో గత 15 రోజుల నుంచి ప్రజలు పనులు మానుకుని టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు పడుతున్నారని తెలిపారు. వృద్ధులు, మహిళలు చిన్నారులతో క్యూలైన్లలో ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ప్రజలు విసుగుచెంది ఆధార్‌ ఆపరేటర్లపై తిరగబడుతున్నారని తెలిపారు. మరికొన్నిచోట్ల పెద్దఎత్తున తోపులాటలు జరిగి పోలీసులు జోక్యం చేసుకునేవరకూ వచ్చిందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో అవసరమైనన్ని ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Spread the love