Friday, August 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి ?

ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి ?

- Advertisement -

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు తీవ్రతరం
టీజీఈజేఏసీ మహాధర్నాలో నేతలు వ్యతిరేకత మూటగట్టుకోవద్దంటూ సర్కారుకు హితవు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పోరాటాలను తీవ్రతరం చేస్తామని పలువురు నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, ఉద్యోగ ఆరోగ్య కార్డుల పూర్తి స్థాయి అమలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, జీవో నెం. 25 సవరణ, జీవో నెం.190 అమలుపై తక్షణమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేనీ (ముజీబ్), టీజీవోస్ ప్రధాన కార్యదర్శి బి.శ్యాం తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు.తమ ప్రధాన డిమాండ్ల గురించి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. ఉద్యోగులతో శతృత్వం పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం పెండింగులో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకోక తప్పదన్నారు.ఏలూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా చలనం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ధర్నాలు ఒక హెచ్చరికగా తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో తమ పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ప్రజాప్రభుత్వం గా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల్లో భాగమైన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా తాత్సార్యం తగదని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న గౌరవంతోనే ఇంతకాలం ఓపిక పట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీని, నవీన్ మిట్టల్ నేతృత్వంలోని అధికారుల కమిటీని, మంత్రులను ఎన్నో సార్లు కలిసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
మహాధర్నాకు జేఏసీ హైదరాబాద్ సిటీ చైర్మెన్ కట్కూరి శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా చైర్మెన్ విక్రమ్, రంగారెడ్డి జిల్లా చైర్మెన్ వూటు యశ్వంత్, హైదరాబాద్ సిటీ కన్వీనర్ గండూరి వెంకటేష్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ కృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ రామారావు సమన్వయం, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. ధర్నాలో వివిధ సంఘాల నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు. సత్యనారాయణ గౌడ్, సహదేవ్, డాక్టర్ హరికృష్ణ, శ్రీరామ్ రెడ్డి, వెంకటరమణ, ఖాదర్, మంజులా రెడ్డి, శైలజ, ఉమా రెడ్డి, వరలక్ష్మి, స్వరూప లక్ష్మి. అపరంజిత. అమరేందర్. నరసింహస్వామి. రాజు, అవినాష్, విజయ్, మహేష్ గౌడ్. రాజ్ కుమార్ కుతాడి శ్రీనివాస్. డి నరేందర్, కొండల్ రెడ్డి. బాల్ రాజు. ఆశన్న, మల్లికార్జున్ రెడ్డి, పూనం పేరయ్య, గౌస్, డాక్టర్ జోషి, సత్యనారాయణ, దేవేంద్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

​అదొక్కటి తప్ప ఏదీ అమలు కాలేదు : చావ రవి
ధర్నాలో పాల్గొన్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ మే రెండున ముఖ్యమంత్రి స్వయంగా చర్చించినా ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. ప్రభుత్వానికి రెండున్నరేండ్లు సమయమిచ్చినా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ప్రతి నెల మొదటి తేదీన జీతం ఇవ్వడం తప్ప మరే హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్తు పోరాటాలను నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్చల పేరుతో మభ్యపెట్టాలని ప్రయత్నించినా మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి (ట్రెసా), సదానంద్ గౌడ్ (ఎస్టీయూ), మధుసూదన్ రెడ్డి, (టీజీఎల్ఏ), దాస్య నాయక్ (క్లాస్ -4 ఎంప్లాయీస్), ఎం. సత్యనారాయణ గౌడ్, సోమన్న, కృష్ణమూర్తి (పెన్షనర్స్ అసోసియేషన్), హైదరాబాద్ జేఏసీ లీడర్ ఎంబి.క్రిష్ణ యాదవ్ తదితరులు మహాధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద గురువారం చేపట్టిన ధర్నాలు విజయవంతమైనట్టు నాయకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -