Saturday, August 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహిళల పేరిటే ఉచిత రిజిస్ట్రేషన్

మహిళల పేరిటే ఉచిత రిజిస్ట్రేషన్

- Advertisement -

పదేండ్ల తర్వాత పూర్తి యాజమాన్య హక్కులు
హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో పేదలకు ఆత్మగౌరవ ఇండ్లు
రాజకీయాలకతీతంగా లాటరీ విధానంలో 480 ఇందిరమ్మ
ఫ్లాట్ల కేటాయింపు :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నాంపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల లాటరీ ప్రక్రియ

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు గౌరవప్రదమైన గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లి వెట్స్ గార్డెన్‌లో ‘హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్’ (క్యూర్‌) ప్రాజెక్ట్ కింద నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 480 ఎల్‌ఐజీ/ఎంఐజీ ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫ్లాట్ల కేటాయింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, లబ్దిదారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించామని, దీనిని ప్రత్యక్ష ప్రసారమూ చేశామని తెలిపారు. 480 ఫ్లాట్లకు గాను మొత్తం 600 మంది పేర్లను లాటరీ ద్వారా డ్రా తీశామన్నారు. ఇందులో 480 మందిని కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోగా, మరో 120 మందిని వెయిట్‌లిస్ట్‌లో ఉంచినట్టు వెల్లడించారు. ఎంపికైన వారి అర్హతలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం తుది ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని, ఎవరైనా అనర్హులుగా తేలితే వెయిట్‌లిస్ట్‌లోని వారికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

రూ. 50 నుంచి 60 లక్షల ఆస్తి
హైదరాబాద్ క్యూర్‌ పరిధిలో సొంత ఇల్లు కొనలేని నిరుపేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే విలువైన భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు (లిఫ్ట్ సౌకర్యంతో) నిర్మించి ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో పాటు, 17 నుంచి 20 చదరపు గజాల అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్‌) కలిగి ఉంటుందన్నారు. లబ్దిదారులైన మహిళల పేరిటే ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. 10 ఏండ్ల అనంతరం లబ్దిదారులు ఈ ఆస్తిని విక్రయించుకోవడానికి లేదా పిల్లల చదువులు, పెండ్లీల కోసం రుణాలు పొందేందుకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే పూర్తి హక్కులు లభిస్తాయన్నారు. మార్కెట్‌లో సుమారు రూ. 50 నుంచి 60 లక్షల విలువైన ఆస్తి పేదలకు దక్కుతుందని మంత్రి తెలిపారు.

​20 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్
హైదరాబాద్ ‌క్యూర్‌ పరిధిలో నియోజకవర్గాల వారీగా లక్ష ఇండ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాలను ఎంపిక చేసి, ఒక్కో నియోజక వర్గంలో 480 ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో భూమిని గుర్తించి టెండర్లు ఖరారు చేశామని, మరో 4 నియోజకవర్గాల్లో ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

​ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ప్రశంసలు
నాంపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపాదన వచ్చిన కేవలం 3 నెలల్లోనే లబ్దిదారుల ఎంపిక వరకు తీసుకువచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో గజం రూ. 3 లక్షల విలువైన అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే వందల కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ ప్రభుత్వం ఆదాయాన్ని పక్కనపెట్టి పేదల సంక్షేమానికి కేటాయించడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. హౌసింగ్ ఎండీ, కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో భూముల కొరత ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, పీడీ అశోక్ చక్రవర్తి, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్లు నయీముద్దీన్, జ్యోతి తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్దిదారులు పాల్గొన్నారు.

​రిజర్వేషన్ల వారీగా ఫ్లాట్ల కేటాయింపు ఇలా
జనరల్ (50శాతం): 240 ఫ్లాట్లు
బీసీ (16శాతం): 77 ఫ్లాట్లు
ఎస్సీ (14శాతం): 67 ఫ్లాట్లు
ప్రభుత్వ/ఔట్‌సోర్సింగ్ సిబ్బంది (10శాతం): 48 ఫ్లాట్లు
ఎస్టీ (5శాతం): 24 ఫ్లాట్లు
వికలాంగులు (5శాతం): 24 ఫ్లాట్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -