Saturday, August 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅందని ద్రాక్షలా జీవన భృతి

అందని ద్రాక్షలా జీవన భృతి

- Advertisement -

బీడీ కార్మికులకు మొండి చెయ్యి..కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత కరువు
ఆగస్టు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ సరే..
ఆ మార్గదర్శకాల్లో బీడీ కార్మికులకు చోటేదీ?
2014 నుంచి ఎదురుచూపులే ఎన్నికల హామీల అమలుకు నోచని వైనం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పొద్దంతా కూర్చొని.. వందలాది బీడీలు చుట్టి.. వచ్చిన అరకొర కూలితో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బీడీ కార్మికుల జీవితాల్లో జీవన భృతి వాగ్దానం అందని ద్రాక్షగానే మిగిలింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్న ఆశతో ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. తాజాగా జారీ చేసిన పింఛన్ల మార్గదర్శకాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ మార్గదర్శకాల్లో బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎవరికి అవకాశం?
కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నప్పటికీ.. బీడీ కార్మికులకు మాత్రం అవకాశం కనిపించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘చేయూత’ అంటే తమకూ చేయూత లభిస్తుందని భావించిన బీడీ కార్మికులకు.. మార్గదర్శకాల్లో తమ పేరు కనిపించకపోవడంతో “మాకు చేయూత ఎప్పుడు?” అని ప్రశ్నిస్తున్నారు.

హామీలెన్నో.. అమలేది?
ఎన్నికల సమయంలో బీడీ కార్మికుల సంక్షేమం, పింఛన్ల అంశం తెరపైకి వస్తుంటుంది. పాలకులు, రాజకీయ పార్టీలు కార్మికులకు భరోసా కల్పించే హామీలు ఇస్తుంటాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీల అమలుపై స్పష్టత లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం మార్గదర్శకాలు జారీ చేసిన సమయంలోనైనా తమకు అవకాశం కల్పిస్తుందని వారు ఆశించారు. అయితే తాజా మార్గదర్శకాల్లో తమ వర్గాన్ని ప్రస్తావించకపోవడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమనే. ఈ ఖార్ఖానాలలో సుమారు ఏడు లక్షలమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఆరు జిల్లాల్లో, 45 నియోజక వర్గాల్లో వీరు విస్తరించి ఉన్నారు. వీరిని ప్రభావితం చేసేందుకు నాడు, నేడు అధికారంలో ఉన్న పార్టీలు జీవన భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నాటి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నాలుగు లక్షల మందికి రూ. 2,016 భృతి కల్పిస్తే..దాన్ని రెట్టింపు చేసి రూ.4,016 అందిస్తామని కాంగ్రెస్‌ ‌వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. అయినా జీవనభృతి వారికి అందని ద్రాక్షలా మిగిలింది.

బడ్జెట్‌‌లో వారి ఊసేది?
ఈ కాలంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మూడు బడ్జెట్‌‌లు ప్రవేశ పెట్టింది. వాటిల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన జీవనభృతి అంశం, కేటాయింపులు లేకపోవటం వారిని మరింత నిరాశ పర్చింది. అయితే..ఇటీవల కాలంలో పింఛన్ల పండుగ పేరుతో అందరికీ చేయూత పింఛన్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దానిలోనూ.. బీడీ కార్మికుల ఊసెత్తకపోవటంతో తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నిత్యావసరాల సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అందుకనుగుణంగా కూలి పెరగటం లేదు. ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా జీవన భృతి లేదు..ఎలా బతకాలి’’ అని వారు ప్రశ్నిస్తున్నారు.

​2014 నుంచి ఎదురుచూపులే..
బీడీ కార్మికుల జీవన భృతి సమస్య ఇప్పటిది కాదు. 2014 నుంచి దాని కోసం ఎదురుచూస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయాల వైపు ఆశగా చూస్తున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ కార్మికుల వయసు పెరుగుతోంది. శరీరంలో బలం తగ్గుతోంది. కానీ ఆ చేయూత కోసం ఎదురుచూపులు మాత్రం తగ్గడం లేదు.రోజుకు వచ్చే కూలి కుటుంబ అవసరాలకే సరిపోని పరిస్థితుల్లో వృద్ధాప్యంలో బీడీలు చుట్టడం తప్ప మరో మార్గం లేకుండా పోతోందని కార్మికులు వాపోతున్నారు.

పొగలోనే జీవితాలు..
బీడీ చుట్టడం సాధారణ ఉపాధి కాదు. గంటల తరబడి ఒకే చోట కూర్చొని పొగాకు చుట్టూ పని చేయాల్సి ఉంటుంది. చేతులు, కళ్ళు, వెన్ను.. ఇలా శరీరంలోని అనేక భాగాలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. అయినా జీవనోపాధి కోసం వయసు మీదపడినా పని చేయాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు, ఇంటి అద్దె, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు ఇలా ఖర్చులు పెరుగుతున్నా బీడీ కార్మికుల ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది.

​‘మేము కార్మికులం కాదా?’
బీడీ కార్మికుల ప్రధాన ప్రశ్న ఇదే. ఇతర అసంఘటిత, వృత్తి ఆధారిత వర్గాలకు పింఛన్‌ పథకంలో అవకాశం కల్పిస్తున్నప్పుడు.. ఏండ్ల తరబడి బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వృద్ధాప్యం.. మరోవైపు అనారోగ్య సమస్యలు.. ఇంకోవైపు ఆదాయం తగ్గిపోవడం.. ఈ మూడింటి మధ్య బీడీ కార్మికుల జీవితం నలిగిపోతోంది. ఇలాంటి సమయంలో నెలనెలా వచ్చే పింఛన్‌ వారికి కేవలం ఆర్థిక సాయం కాదు.. వృద్ధాప్యంలో బతుకు భరోసా.

​ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో బీడీ కార్మికులకు పింఛన్‌ మంజూరు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. తాజా మార్గదర్శకాల్లో బీడీ కార్మికుల ప్రస్తావన ఎందుకు లేదో ప్రభుత్వం వెల్లడించాలి. భవిష్యత్తులో వారికి జీవనభృతి మంజూరు చేసే అవకాశం ఉందా? బీడీ కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారా? లేక ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. దశాబ్దాలుగా పొగాకు ఘాటు మధ్య తమ జీవితాలను కాల్చుకుంటున్న బీడీ కార్మికులు, వృద్ధాప్యంలోనైనా ప్రభుత్వం వెలుగులు నింపుతుందా? లేక మరోసారి హామీల చీకట్లోనే వదిలేస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్థికంగా చితికిపోతున్నారు..
​‘ఏండ్ల తరబడి బీడీలు చుట్టి సంపద సృష్టించిన బీడీ కార్మికులు ఆర్థికంగా చితికి పోతున్నారు. రోజురోజుకు పని దినాలు తగ్గిపో తున్నాయి. ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయి. పెరు గుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. సర్కారేమో.. వారికిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇక వారికి పోరాటమే మార్గం. అందుకు ఈ నెల 30న సిద్దిపేటలో తెలంగాణ బీడీ అండ్‌ ‌సిగార్‌ ‌వర్కర్స్‌ ‌యూనియన్‌ ‌నాలుగో మహాసభను నిర్వహిస్తున్నాం. ఆ సభలలో భవిష్యత్‌ ‌పోరాట కర్తవ్యాలను తీసుకోబోతున్నాం. పోరాటాలతోనే ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయించుకుంటాం. అందుకు కార్మికులను సమాయత్తం చేయబోతున్నాం…’
​-ఎస్వీ రమ బీడీ అండ్‌ ‌సిగార్‌ ‌వర్కర్స్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ)
ప్రధాన కార్యదర్శి.

జీవన భృతి కల్పించాల్సిందే..
‘ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. లేదంటే కార్మికులకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వ హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా జీవనభృతి రూ.4,016 ఇవ్వాలి. రిటైర్‌‌మెంట్‌ పెన్షన్‌ ‌రూ. ఆరు వేలు ఇవ్వాలి. నెలకు 26 రోజుల పని కల్పించాలి…’
​-కె గోపాల స్వామి అధ్యక్షులు
బీడీ అండ్‌ ‌సిగార్‌ ‌వర్కర్స్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ)
(ఫొటోలు హరి పోల్డర్‌‌లో ఉన్నాయి…)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -