Saturday, August 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులివ్వాలి.. నిర్వాసితులకు న్యాయం చేయాలి

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులివ్వాలి.. నిర్వాసితులకు న్యాయం చేయాలి

- Advertisement -

నేటి నుంచి 31 వరకు 60 కి.మీ. పాదయాత్ర..
మూసీ విషజలాల నుంచి విముక్తికి గోదావరి జలాలే ప్రత్యామ్నాయం
నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్

​యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. బస్వాపురం , గంధమల్ల, చర్లగూడెం రిజర్వాయర్లతోపాటు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలను పూర్తిచేయాలని, భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టబోతుంది. 31న హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించనుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్‌ నవతెలంగాణ నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి సాదత్‌అలీకి పాదయాత్రకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

​నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
​పాదయాత్ర ప్రధాన లక్ష్యం ఏమిటి?
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని పార్టీ తరపున కోరుతున్నాం. జిల్లాలో కీలకమైన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ​బస్వాపురం రిజర్వాయర్‌ 11.38 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నా ప్రస్తుతం కొంత నీటిని నింపేందుకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందాల్సి ఉంది. గంధమల్ల రిజర్వాయర్‌కు రూ.450 కోట్లు అవసరం. ఇప్పటివరకు రూ.100 కోట్ల మేర మాత్రమే నిధులు కేటాయింపులు జరిగాయి. శంకుస్థాపన జరిగి ఏడాది గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. దీనికి ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించి పనులు పూర్తి చేయాలి.

​బస్వాపురం ప్రాజెక్టు విషయంలో మీ ప్రధాన డిమాండ్లు ఏమిటి?
బస్వాపురం భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి. ప్రధాన కాలువ పనులు మూడు చోట్ల నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద ప్రయివేటు గోదాం సమీపంలో, సంగెం, నేలపట్ల వద్ద ఉన్న సమస్యలను పరిష్కరించాలి. కేవలం మెయిన్‌ కెనాల్‌ నిర్మిస్తే ప్రయోజనం ఉండదు. ఫీడర్‌ ఛానల్స్‌ ఏర్పాటు చేసి చెరువులు, కుంటలను నింపాలి. మూసీ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అనుసంధానం చేయాలి. మూసీ విషజలాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించి, గోదావరి జలాలను అందించాలనేది మా కీలక డిమాండ్‌.

​చర్లగూడెం, డిండి ప్రాజెక్టుల విషయంలో 
మీ అభిప్రాయం?
చర్లగూడెం రిజర్వాయర్‌ పనులు కూడా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2015లో శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పూర్తికాలేదు. డిండి ప్రాజెక్టుకు నీళ్లు రావడానికి అవసరమైన సాంకేతిక అంశాలను పరిష్కరించాలి. కేవలం చర్లగూడెం లిఫ్ట్ ద్వారా భువనగిరి జిల్లా నారాయణపురం, చౌటుప్పల్‌ ప్రాంతాలకు కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. రాచకొండ లిఫ్ట్‌ ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రతిపాదనను కార్యరూపంలో తీసుకురావాలి.

​ చిన్న నీటి వనరుల పరిస్థితి ఎలా ఉంది?
పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలు పూర్తికాక ప్రజలకు ప్రయోజనం అంద డం లేదు. వీటికి కూడా నిధులు విడుదల చేసి పను లు పూర్తి చేయాలి. నవాబ్‌పేట రిజర్వాయర్‌ నుంచి బొమ్మలరామారం మండలానికి నీళ్లు రావడం లేదు. షామీర్‌పేటకు గోదావరి జలాలు అందిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా పెండింగ్‌లోనే ఉంది.

​​పాదయాత్ర ఎలా సాగనుంది?
మొత్తం 60 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది. నిరంతరం యాత్రలో పాల్గొనే వారు సుమారు 100 మంది ఉంటారు. ఈ నెల 29న భువనగిరిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉదయం 10.30 గంటలకు ప్రారంభ సభ జరుగుతుంది. 11 గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఘట్‌కేసర్‌ వరకు సాగుతుంది.​30న ఉప్పల్‌, రామాంతపూర్‌ మీదుగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటుంది. 31న ఇందిరాపార్కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం ధర్నాచౌక్‌లో వేలాది మందితో మహాధర్నా నిర్వహిస్తాం. ధర్నా అనంతరం ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలోని ప్రజల సమస్యలను, సాగునీటి ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తాం.

​పాదయాత్రకు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది?
వామపక్షాలతోపాటు ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. ఇది కేవలం సీపీఐ(ఎం) కార్యక్రమం కాదు.. జిల్లాలోని ప్రజల సాగు, తాగునీటి భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమం. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తారు. పాదయాత్ర విజయవం తానికి ఆరు రోజులపాటు జీపు ప్రచారం నిర్వహిం చాం. గ్రామగ్రామాన సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

​ పాదయాత్రకు ఎవరు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు?
ఈ నెల 29న ప్రారంభ కార్యక్రమానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరవుతున్నారు. 31న జరిగే బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి , జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొంటారు.

​ప్రభుత్వం ఇటీవల కొన్ని నిధులు ప్రకటించింది. దీనిపై మీ స్పందన?
సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటాలు, పాదయాత్ర ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. బస్వాపురానికి రూ.206 కోట్లు, గంధమల్లకు రూ.80 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత మూసీ ప్రాజెక్టును చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది పోరాటాల ప్రభావమే. ​అయితే అరకొర నిధులతో పనులు పూర్తికావు. గతంలో కూడా ప్రజా ఉద్యమాలను తాత్కాలికంగా చల్లార్చేందుకు కొంత నిధులు విడుదల చేసిన సందర్భాలున్నాయి. ఈసారి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు వెంటపడతాం. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా, పూర్తి స్థాయి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలి.

భూ నిర్వాసితుల సమస్యలపై మీ డిమాండ్‌ ఏంటి?
బస్వాపురం ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు సుమారు రూ.420 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తు తం రూ.206 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అసైన్డ్‌ భూములు కోల్పోయిన కొందరికి ఇంకా నష్టపరిహారం అందలేదు. భూమితోపాటు ఇల్లు, గ్రామం, జీవనాధారం కోల్పోతున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి.​ బహిరంగ మార్కెట్‌ ధరకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలి. ఆర్‌అండ్‌ఆర్‌ కింద పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలి. నిర్వాసిత కుటుంబాలకు జీవన భరోసా కల్పించడంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి.

‘మూసీ విష జలాల నుంచి విముక్తి.. 
గోదావరి జలాలే పరిష్కారం’…
​జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం, నిర్వాసితులకు న్యాయం చేయడం, సాగు–తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ఉద్యమ లక్ష్యం. ‘‘మూసీ విషజలాల నుంచి విముక్తి కల్పించాలి.. గోదావరి జలాలు ఇవ్వాలి” అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తాం. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -