Saturday, August 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువివాదం వేళ‌..సీఎంకు రాఖీ క‌ట్టిన మంత్రి కొండా సురేఖ

వివాదం వేళ‌..సీఎంకు రాఖీ క‌ట్టిన మంత్రి కొండా సురేఖ

- Advertisement -

ముఖ్య‌మంత్రికి మ‌హిళ‌ల అండ ఎప్పుడూ ఉంటుందంటూ వ్యాఖ్య‌లు
టీపీసీసీ నోటీసుల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ

న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
రక్షా బంధన్‌ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ.. సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎంతో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంత‌రం త‌న నివాసంలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డికి మూడోసారి రాఖీ కట్టా. నేను అందరికీ సోదరినే. పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఆయనకు ఇవ్వాలని దేవుడిని కోరుకున్నా. ఆడబిడ్డల ఆశీర్వాదాలు సీఎంకు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నా’’ అని తెలిపారు.ఇటీవల.. ములుగు, పరకాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో వరంగల్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొండా సురేఖ పాల్గొనలేదు. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక మంత్రి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

తమ వర్గీయులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు పరకాల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవూరే అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయ్యింది. ఇది జరిగిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపైన, స్థానిక ఎమ్మెల్యేపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకొన్నట్టు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇవ్వగా, కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలిని అవుతానని సమాధానం ఇచ్చారు. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడంతోనే పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నివాసానికి కొండా సురేఖ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -