విద్యుత్ సంస్కరణల చట్టాన్ని మోడీ సర్కారు వెనక్కి తీసుకోవాలి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వంత పాడటం సరిగాదు
విద్యుత్ ఉద్యమం తరహాలో పోరాటాలు పుట్టుకొస్తాయ్ : విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఒకవైపు మోడీ సర్కారును విమర్శిస్తూనే మరోవైపు బీజేపీ సర్కారు తీసుకొస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక సంస్కరణలకు రేవంత్‌రెడ్డి సర్కారు వంత పాడటాన్ని తప్పుబట్టారు. విద్యుత్ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు డిస్కమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు. బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరవీరులు బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలను స్మరించుకుంటూ శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఆనాడు ప్రపంచ బ్యాంకు ఒప్పందంలో భాగంగా ఇష్టానుసారంగా విద్యుత్ చార్జీలను పెంచేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉప్పెనలా విద్యుత్ ఉద్యమం నడిచిందని గుర్తుచేశారు.
ఆ పోరాటం ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ప్రయివేటీకరణ నుంచి వెనక్కి తగ్గిందన్నారు. ఆ పోరాటం వల్లనే రైతులకు ఉచిత విద్యుత్ పథకం వచ్చిందన్నారు. ఇప్పటి వరకూ ఏ పాలకులూ విద్యుత్ చార్జీల పెంపువైపు, ప్రయివేటీకరణ వైపు చూడలేదని చెప్పారు. కానీ, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రకు పూనుకుంటున్నదనీ, అదే జరిగితే రైతులకు అందుతున్న ఉచిత్ విద్యుత్ పథకం పోతుందనీ, పేదలకు విద్యుత్ సబ్సిడీలు పోతాయని హెచ్చరించారు. కేంద్రం విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సంస్కరణల పేరుతో కార్పొరేట్ శక్తులకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్పి కోట్లాది రూపాయలు ప్రజలపై భారాలు మోపడానికి రంగం సిద్ధం చేశారన్నారు. రైతులు వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లకు మీటర్లు బిగించి నెల నెల డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన విధానాన్ని బీజేపీ, బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలు పాలిస్తున్న యూపీ, ఏపీ వంటి రాష్ర్టాల్లో మొదలు పెట్టాయనీ, అక్కడ వేలాది రూపాయల బిల్లులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లెక్కుతున్నారని వివరించారు. తెలంగాణలోనూ మున్ముందు ఇదే పరిస్థితి రాబోతున్నదని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్ కి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఝూన్సీ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్వేష్, ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎన్.చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు తేజ, సీపీఐ(ఎంఎల్)సీపీ రాష్ట్ర నాయకులు షేక్‌షావలీ మాట్లాడుతూ.. 26 ఏండ్ల కిందట ప్రపంచ బ్యాంకు విధానాలను విద్యుత్‌రంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ వేలాది మంది హైదరాబాద్ నగరంలో నిరసన గళం వినిపిద్దామని వస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారనీ, ఆ పోరాటంలో ముగ్గురు తమ ప్రాణాలను కోల్పోయారనీ, వందలాది మంది గాయపడ్డారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలను మోపుతూ మరొకవైపు విద్యుత్ సంస్కరణ పేరుమీద ప్రజల పైన మరింత భారం వేసి దోపిడి వర్గాలకు దోచిపెట్టే పనికి పూనుకున్నదని విమర్శించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు సామాజిక ప్రయోజనాల కోసం ఉన్న తాగునీటి లాంటి పథకాలకు తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశముందని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతి, టి.సాగర్, పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్, పి.ప్రభాకర్, మల్లులక్ష్మి, రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, ఆర్.వెంకట్రాములు, బాబూరావు, భూపాల్, స్కైలాబ్‌బాబు, ఉడుతరవీందర్, ఆశన్న, జె.వెంకటేశ్వర్లు, ఆర్.వెంకటేశ్, అరుణజ్యోతి, వంగూరు రాములు, కోట రమేశ్, మహేందర్, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు వీఎస్ బోస్, రాష్ట్ర నాయకులు స్టాలిన్, పల్లె నర్సింహ, శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, మామిడి చెట్ల వెంకటస్వామి, బొడ్డు పల్లి కిషన్, జైపాల్ రెడ్డి, చెట్టు కింది శ్రీనివాస్, పి వెంకటయ్య. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు సూర్యం, సదానందం, ఎస్ ఎల్.పద్మ, సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరుణ, అనురాధ, సంధ్య, మహేష్, నాగరాజు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.



