Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూ పరిపాలనకు దిక్సూచి భూభారతి

భూ పరిపాలనకు దిక్సూచి భూభారతి

- Advertisement -

చారిత్రాత్మక చట్టానికి
నేటితో ఏడాది పూర్తి
5 కోట్ల మందికిపైగా పోర్టల్‌ సందర్శన
3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ
పాత సర్వే పద్ధతులకు స్వస్తి…
రోవర్లతో సర్వే
ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్‌ : సమీక్షలో మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతిరహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలిచిందని పేర్కొన్నారు. భూభారతి చట్టం భూ పరిపాలనకు కొత్త దిక్సూచి అని తెలిపారు. ఈనెల 14వ తేదీతో భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం సచివాలయంలోని తన కార్యాల యంలో భూభారతి చట్టంపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇది కేవలం ఒక చట్టానికి ఏడాది పూర్తైన సందర్భం మాత్రమే కాదనీ, రాష్ట్రంలో భూహక్కుల రక్షణకు ప్రారంభమైన కొత్త శకానికి నాంది పలికిన రోజని వ్యాఖ్యానించారు. భూభారతి చట్టానికి ముందు ఆ తర్వాత ఉన్న పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ చట్టం తీసుకొచ్చే నాటికి ధరణి పోర్టల్‌ వల్ల తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న పరిస్ధితులను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న సంకల్పంతో పారదర్శకత, బాధ్యతాయుత, వేగం అనే మూడు ప్రధాన సూత్రాలతో రెవెన్యూ వ్యవస్ధను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే చారిత్రా త్మకమైన భూభారతి చట్టాన్ని తెచ్చామని అన్నారు. ఈ చట్టం రాష్ట్రంలోని భూ పరిపాలనను పారదర్శకంగా సులభంగా మార్చిందన్నారు.

భూ వివాదాలకు చరమగీతం
బీఆర్‌ఎస్‌ పాలనలో సరైన విధివిధానాలు లేకుండా తెచ్చిన 2020 ఆర్వోఆర్‌ చట్టం, ధరణి పోర్టల్‌ వల్ల లక్షలాది మంది ప్రజలు తమ భూముల హక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పొంగులేటి అన్నారు. భూమి వారిదే అయినప్పటికీ హక్కులను నిరూపించుకునేందుకు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. గతేడాది ఏప్రిల్‌ 14న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించామని గుర్తు చేశారు. రైతాంగానికి భూ భద్రత కల్పిం చడంలో భూభారతి ఒక బలమైన ఆయుధంగా మారిందని అన్నారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ, సామాన్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గించడంలో ఈ ఏడాది కాలం ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందని వివరించారు. భూభారతి పోర్టల్‌ పాత చిక్కుము డులను విప్పడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఏడాదిలోపే 5.20 కోట్లకుపైగా ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించారనీ, సుమారు 67 లక్షల మంది పోర్టల్‌ ద్వారా లాగిన్‌ అయ్యారని చెప్పారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఎన్‌ఐసీతో కలిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను ఈనెల 2 నుంచి ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని గుర్తు చేశారు. అక్కడ ఎదురయ్యే మంచి చెడులను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసి వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలంలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఐదు మండలాల్లో కూడా ప్రతి సర్వే నెంబరుకు భూధార్‌ నెంబర్‌ను కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా సర్వే
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలకు నక్షాలు లేవని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూదార్‌ నెంబర్‌ కేటాయించామని వివరించారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్‌ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయోగించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నామని అన్నారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని చెప్పారు. సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్‌ నెంబర్‌ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వేనెంబర్లు వినియోగంలో ఉండగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ 77 ఏండ్లలో 2.29 కోట్లకు చేరాయని వివరించారు. వాటన్నింటికీ భూధార్‌ నెంబర్‌ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. భూ సర్వేకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకున్నట్టు తెలిపారు. శిక్షణ ఇచ్చి 5,520 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేశామని చెప్పారు. భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి నాలుగు నుంచి ఆరుగురు సర్వేయర్లను నియమిం చామ న్నారు. రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించామని అన్నారు. గొలుసులు, కర్రలు, క్రాస్‌ స్టాఫ్‌, మెజరింగ్‌ టేప్‌ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగిం చు కుంటున్నామని చెప్పారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామనీ, త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నామని అన్నారు. భూ భారతి పోర్టల్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌ బుక్‌లు జారీచేశామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -