ఐటిడిఏ పిఓకు ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన రూ.35 లక్షల పనులను తక్షణమే నిలిపివేసి, మళ్లీ గ్రామసభ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం విడిసి కమిటీని ఎన్నుకోవాలని కోరుతూ సోమవారం మాజీ సర్పంచ్ చింతల సుధాకర్,అప్పాల భూమేష్ యాదవ్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (పిఓ)కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామసభలో చర్చించకుండా,వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా విడిసి తీర్మానాలు చేసినట్లు వారు ఆరోపించారు.
మేడిపల్లి గ్రామానికి సంబంధం లేని పెద్ది మహేందర్‌ను విడిసి అధ్యక్షుడిగా ఎలా నియమించారో,అలాగే సర్పంచ్ భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు/బంధువులు, పంచాయతీ సిబ్బంది పేర్లు తీర్మానాల్లో ఉండటంపై విచారణ చేయాలని కోరారు.విడిసి సభ్యుల సంతకాలపై అనుమానాలు ఉన్నందున అసలు రికార్డులను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని,అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత విడిసిని రద్దు చేసి,మళ్లీ గ్రామసభ నిర్వహించి గ్రామ ప్రజల సమక్షంలో కొత్త విడిసి కమిటీని నిబంధనల ప్రకారం ఎన్నుకునే వరకు ఆశ్రమ పాఠశాల పనులను నిలిపివేయాలని కోరారు.తీర్మానాలు తప్పుడు లేదా నకిలీవిగా తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



