కోచింగ్ ఫీజు రూ.600 నుంచి రూ.4500కు పెంపు
శాట్జ్ స్టేడియాల్లో ఏకంగా 900 శాతం ఫీజు పెరుగుదల
రాష్ట్ర క్రీడా బడ్జెట్ రూ.500 కోట్లు. అయినా, క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందించేందుకు క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) మీనమేషాలు లెక్కిస్తోంది. వంద కోట్ల లోపు బడ్జెట్ ఉన్నప్పుడే నామమాత్రపు ఫీజులతో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టేడియాల్లో శిక్షణ ఇవ్వగా.. ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ ఐదింతలు కాగా.. క్రీడాకారుల ఫీజు 900 శాతం పైకి ఎగబాకింది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌కు ఇప్పటివరకు క్రీడాకారులు రూ.300-600 చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.3 నుంచి 4.5 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫీజుల పెంపుతో చిన్నారులు, యువత ఆటలకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
నవతెలంగాణ-హైదరాబాద్
యువత వ్యసనాల బారిన పడకుండా, క్రీడా మైదానాల బాట పట్టాలని ఓ వైపు ప్రభుత్వం చెబుతోండగా… అందుకు పూర్తి విరుద్ధంగా క్రీడా ప్రాధికార సంస్థ వ్యవహరిస్తోంది. చిన్నారులు, యువతను ఆటలకు చేరువ చేసేందుకు ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ… ఇప్పటికే ఆటల వైపు మొగ్గిన క్రీడాకారులు మైదానాలకు దూరం అయ్యేందుకు దోహదం చేసే పనికి పూనుకుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని జంట నగరాల స్టేడియాల్లో ఒలింపిక్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రయివేటు అకాడమీల్లో శిక్షణ భారమైన తరుణంలో.. తల్లిదండ్రులు క్రీడా ప్రాధికార సంస్థ అందిస్తోన్న కోచింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకు ఇప్పటివరకు నామమాత్రపు ఫీజులు మాత్రమే వసూలు చేశారు. కానీ, ఇక నుంచి క్రీడాకారుల నుంచి ప్రయివేటు తరహాలో ఫీజులు వసూలు చేసేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేసింది. శాట్జ్ ఆధ్వర్యంలోని స్టేడియాలు, అకాడమీల్లో శిక్షణకు క్రీడాకారుల ఫీజును ఏకంగా 900 శాతం మేర పెంచుతూ క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు. క్రీడా శాఖ ఆదేశాల ప్రకారం కొత్త ఫీజులను సెప్టెంబర్ నెల నుంచి వసూలు చేసేందుకు శాట్జ్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
భారీగా ఫీజులు పెంపు
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టేడియాల్లో ఒలింపిక్, నాన్ ఒలింపిక్ క్రీడలకు శిక్షణ అందిస్తున్నారు. అందులో విభాగాల వారీగా కొన్ని ఆటలకు ముందు నుంచి ఫీజు వసూలు చేస్తుండగా, మరికొన్ని క్రీడలకు ఎటువంటి ఫీజు వసూలు చేయటం లేదు. క్రీడా మంత్రిత్వ శాఖ జులై 17న విడుదల చేసిన జీవోలో ఇప్పటికే నామమాత్రపు ఫీజు వసూలు చేస్తున్న క్రీడల ఫీజును ఏకంగా 900 శాతం పెంచగా.. ఎటువంటి ఫీజు లేని క్రీడలకు సైతం కొత్తగా ఫీజును ప్రవేశపెడుతున్నారు. స్విమ్మింగ్‌కు ప్రస్తుతం రూ.600 ఫీజు ఉండగా, దానిని ఏకంగా రూ. 4500కు పెంచారు. బ్యాడ్మింటన్ ఫీజు రూ.3000, షూటింగ్ ఫీజు రూ.4500, టెన్నిస్ ఫీజు రూ.3000 చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కాష్ రాకెట్‌కు ఇప్పటివరకు ఎటువంటి ఫీజు లేదు. ఇక నుంచి ఈ క్రీడలో శిక్షణ పొందే క్రీడాకారులు నెలకు రూ. 3 వేలు చెల్లించాల్సి ఉండగా.. జూడో, వుషూ, కరాటే, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, ఖోఖో, చెస్-బోర్డ్ గేమ్స్, బాల్ బ్యాడ్మింటన్, కయాకింగ్ కనోయింగ్, హ్యాండ్‌బాల్, యాచింగ్-సెయిలింగ్, తైక్వాండో, టెన్నికాయిట్, అత్యపత్య, బేస్‌బాల్, నెట్ బాల్, పవర్ లిఫ్టింగ్, రోల్ బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, సాఫ్ట్ టెన్నిస్, టెన్నిస్ బాల్ క్రికెట్, రగ్బీ, బాక్స్ క్రికెట్, ఫిట్‌నెస్, పికిల్‌బాల్, ఏరోబిక్స్, యోగాలకు కొత్త ఫీజులు ఖరారు చేశారు.
ఆకాశన్నంటిన స్టేడియాల అద్దె
క్రీడాకారుల ఫీజుతో పాటు స్టేడియాల అద్దె సైతం ఆకాశాన్ని తాకుతోంది. గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం క్రీడా పోటీలకు గతంలో రోజుకు రూ.15 వేల అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఫీజును గుర్తింపు పొందిన క్రీడా సంఘాలకు రూ. 2లక్షలు, గుర్తింపు లేని క్రీడా సంఘాలకు రూ. 4 లక్షలు, ఎంట్రీ ఫీజు టోర్నమెంట్లకు రూ. 6 లక్షలు, నాన్ స్పోర్టింగ్ ఈవెంట్లకు రూ. 8 లక్షలుగా నిర్ణయించారు. ఇండోర్ స్టేడియం ఫీజును గుర్తింపు పొందిన క్రీడా సంఘాలకు రోజుకు రూ. 25 వేలు, ఇతరలకు వరుసగా రూ.50వేలు, రూ. 75 వేలు, రూ.1 లక్షగా పెట్టారు. ఎల్బీ స్టేడియం, యూసుఫ్‌గూడ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాల్లోనూ అద్దెలను భారీగా పెంపుదల చేశారు.
ఉచిత శిక్షణ అందించాలి
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టేడియాల్లో క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందించాలి. పే అండ్ ప్లే స్కీమ్‌లో ఇప్పటికే భారీ ఆర్జిస్తున్న క్రీడా ప్రాధికార సంస్థ ఆ సొమ్మును క్రీడాకారులకు ఖర్చు చేసేందుకు వెనకాడుతోంది. గతంలో క్రీడలకు తక్కువ బడ్జెట్ ఉండేది. అయినా, శిక్షణకు నామమాత్రపు ఫీజు వసూలు చేశారు. రూ. 300-600 ఫీజును కేవలం నిర్వహణ నిమిత్తం వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఫీజును వేలకు వేలు పెంపు చేయటంతో స్టేడియాల నిర్వహణ, సిబ్బంది వేతనాలు సహా ఇతర ఖర్చులకు సైతం క్రీడాకారుల నుంచి ఫీజు రూపంలో వసూలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
క్రీడా మంత్రిత్వ శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ కోచింగ్ ఫీజు, స్టేడియాల అద్దె నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాన్ స్పోర్టింగ్ ఈవెంట్లకు అద్దె పెంపుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ క్రీడా పోటీలకు సైతం కమర్షియల్ ఈవెంట్ల తరహాలో అద్దె నిర్ణయించటం ఎంతమాత్రం సమంజసం కాదు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పుడు.. ఇంకా క్రీడాకారుల శిక్షణకు ఫీజులు వసూలు చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. క్రీడా సంఘాలు, క్రీడాకారులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకముందే ప్రభుత్వం మేల్కొంటే మంచిది.
క్రీడాకారులపైనే భారం
కోచింగ్ ఫీజు పెంపు ప్రభావం నేరుగా క్రీడాకారులపై పడనుండగా, స్టేడియాల అద్దె పెంపు నిర్ణయం పరోక్షంగా క్రీడాకారులపై పడనుంది. గుర్తింపు లేని క్రీడాసంఘాలు, ఎంట్రీ ఫీజు వసూలు చేసి నిర్వహించే టోర్నమెంట్లు సహా జంట నగరాల్లో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా వార్షిక క్రీడా పోటీలను స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు స్టేడియం అద్దె పెంపుతో ఆ మొత్తాన్ని ప్రయివేటు సంస్థలు క్రీడాకారుల నుంచి వసూలు చేయనున్నాయి. స్టేడియం అద్దెలు భారంగా మారి, చిన్న మధ్య తరహా ప్రయివేటు స్కూల్స్ ఏకంగా వార్షిక క్రీడా పోటీలకు దూరంగా ఉండే ప్రమాదం లేకపోలేదు.



