Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంకొనుగోలుదారుగానే మిగిలింది !

కొనుగోలుదారుగానే మిగిలింది !

- Advertisement -

భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అమెరికా నో
శుభం కార్డు పడని 16 సంవత్సరాల జావెలిన్‌ ఒప్పందం కథ
చండీఘర్‌ :
సైనిక అవసరాల కోసం అమెరికాలో తయారైన ఎఫ్‌జీఎం-148 జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులను (ఏటీజీఎం) దిగుమతి చేసుకోవడానికి భారత్‌ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ ఆయుధ వ్యవస్థ కోసం 16 సంవత్సరాల క్రితమే అమెరికాను భారత్‌ సంప్రదించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఆయుధ వ్యవస్థకు కేవలం కొనుగోలుదారుగానే ఉండకుండా సాంకేతిక బదిలీ ద్వారా దానిని స్థానికంగా తయారు చేయాలని అప్పుడు భారత్‌ భావించింది. రెండు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలలో ఇది ఓ మైలురాయి అంటూ ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలను వండివారుస్తోంది. అయితే ఈ ఒప్పందం వెనుక ఆశాజనకంగా లేని ఓ వాస్తవం దాగి ఉంది.

సమాధానాల కంటే ప్రశ్నలే అధికం
జావెలిన్‌ క్షిపణుల కోసం 16 సంవత్సరాల పాటు చర్చలు జరిపిన తర్వాత కూడా భారత్‌ సాధించింది ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దేశీయంగా క్షిపణుల తయారీకి చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు జావెలిన్‌ సహ-ఉత్పత్తిపై అమెరికా ఇచ్చిన తాజా హామీని ఎలా విశ్వసించాలన్న సందేహం కలుగుతోంది. జావెలిన్‌ సాంకేతికతపై అమెరికా తన నియంత్రణను నిలుపుకొని, భారత్‌ కేవలం ఆ క్షిపణి కొనుగోలుదారుగా మాత్రమే మిగిలిపోతే ‘సహ-ఉత్పత్తి’ అనే మాటకు అర్థం ఏముంటుంది? పైగా ఏటీజీఎం కొనుగోలుకు సంబంధించిన పరిస్థితులు కూడా పెద్దగా భరోసా ఇవ్వడం లేదు. ఒప్పందం విలువ, దాని వివరాలు బహిర్గతం కాలేదు. భారత త్రివిధ దళాలు ఒకేసారి రూ.300 కోట్ల విలువైన ‘కీలక కార్యాచరణ సామర్ధ్యాల’ను నేరుగా సమకూర్చుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. జావెలిన్‌ కోసం సుదీర్ఘ కాలం జరిగిన చర్చలు చివరికి ఓ ఫాస్ట్‌ట్రాక్‌ రెడీమెడ్‌ కొనుగోలుతో ఎలా ముగిశాయి ? ఒక్క మాటలో చెప్పాలంటే జావెలిన్‌ ఒప్పందం సమాధానాలు ఇవ్వడం కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుబాటులో ఉన్న ఒప్పందం వివరాలు కూడా చాలా అస్పష్టంగా ఉన్నాయి.

ఆధునిక సామర్ధ్యాల కోసం ప్రయత్నాలు
జావెలిన్‌లో రెండు సామర్ధ్యాలు ఉన్నాయి. ఒకటి ‘ఫైర్‌ అండ్‌ ఫర్‌గెట్‌’ సామర్ధ్యం. అంటే కాల్పులు జరిపిన వెంటనే దాని ఆపరేటర్లు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వీలు కలుగుతుంది. రెండోది టాప్‌-అటాక్‌ సామర్ధ్యం. ట్యాంకుల రక్షణ కవచం బలహీనంగా ఉన్నప్పుడు పై నుంచి వాటిపై దాడి చేయడానికి వీలు కల్పిస్తుంది. భారత సైన్యం ఆధునిక మూడో తరం ఏటీజీఎం కోసం 1990వ దశకం చివర, 2000వ దశకం ప్రారంభం నుంచే అన్వేషించడం ప్రారంభించింది. అయితే ఆ సమయంలో అందుబాటులో ఉన్న వ్యవస్థలలో ఈ ఆధునిక సామర్ధ్యాలు లేవు. జావెలిన్‌లో ఈ వ్యవస్థలు ఉండడంతో మన దేశం వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం మేలో సింగపూర్‌లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ జావెలిన్‌ వ్యవస్థ అమ్మకాన్ని ప్రస్తావించారు. ఏదేమైనా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇరు పక్షాలకు భిన్నమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.

అమెరికా చేతిలోనే నియంత్రణ
న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గత నెల 28న ఒప్పందం వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం సాంకేతిక పరిజ్ఞానంపై యాజమాన్యం, ఏటీజీఎం సరఫరాపై నియంత్రణ అమెరికా చేతిలోనే ఉంటుంది. ఏటీజీఎం ఉత్పత్తిదా రుగా మారాలన్న భారత్‌ ఆకాంక్ష నెరవేరలేదు. చివరికి కొనుగో లుదారు పాత్రకే అది పరిమితం కావాల్సి వచ్చింది. పరస్పర ప్రయోజ నకరంగా జావెలిన్‌ క్షిపణులను రెండు దేశాలు ఉత్పత్తి చేసే అంశం పైన, తయారీ-సాంకేతిక పరిజ్ఞా నం విస్తరణ అవకాశాల పైన తాజాగా కుదిరిన ఒప్పంద పత్రం (ఏల్‌ఓఏ) చర్చలకు వీలు కల్పిస్తుందని అమెరికా రాయబార కార్యాలయం చెప్పినప్పటికీ మరింత వివరణ ఇచ్చేందుకు నిరాకరించింది.

పరీక్ష అవసరమా?
గత సంవత్సరం నవంబరులో అమెరికా విదేశాంగ శాఖ 45.7 మిలియన్‌ డాలర్ల విలువైన ఎఫ్‌ఎంఎస్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఇందులో 100 జావెలిన్‌ క్షిపణులు, పాతిక తేలికపాటి కమాండ్‌ లాంఛ్‌ యూనిట్లు, ఓ అదనపు క్షిపణి ఉన్నాయి. ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ముందు వినియోగదారుడు ఈ అదనపు క్షిపణిని ప్రయోగించాల్సి ఉంటుంది. పదహారు సంవత్సరాల చర్చల తర్వాత కూడా వ్యవస్థ కొనుగోలుకు ముందు క్షిపణిని భారత్‌ ప్రయోగించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇంతకాలం తర్వాత భారత సైన్యానికి జావెలిన్‌ను పరీక్షించడం ఇంకా అవసరమా అని ఓ నిపుణుడు వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిని ఓ విచిత్రమైన చిక్కుముడిగా పలువురు సైనిక విశ్లేషకులు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -