Tuesday, September 1, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మాతృత్వం ఖరీదైంది

మాతృత్వం ఖరీదైంది

- Advertisement -

మారుతున్న జీవనశైలి.. దంపతుల్లో పెరుగుతున్న సంతానలేమీ సమస్య
ఐవీఎఫ్‌‌పై ఆసక్తి చూపుతున్న వైనం రూ. లక్షలు వసూలు చేస్తున్న ఆస్పత్రులు
గ్రేటర్‌‌లో విచ్చలవిడిగా వెలుస్తున్న ఫర్టిలిటీ సెంటర్లు
అర్హతల్లేకున్నా అనుమతులు.. నిబంధనలు పాటించని వైనం
లొసుగులను ‘క్యాష్‌’ చేసుకుంటున్న జిల్లా వైద్యారోగ్యశాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో

​మాతృత్వం మధురమైనది. అది దంపతులకు మరుపురాని జ్క్షాపకం లాంటిది. కానీ నేడు మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆలస్య వివాహాలు, ప్యాకేజ్‌ ‌ఫుడ్‌ అలవాట్లు, నిద్రలేమి కారణాలతో మాతృత్వం చాలా మందికి సవాలుగా మారుతోంది. దీంతో దంపతులు ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించి ఐవీఎస్, ఐయూఐ చికిత్స ద్వారా పిల్లలను పొందడం ట్రెండ్‌‌గా మారుతోంది.
ఈ క్రమంలో పిల్లల్లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌‌లో విచ్చలవిడిగా ఐవీఎఫ్, ఐయూఐ, టెస్ట్‌ట్యూబ్ బేబీ చికిత్సలకు ప్రత్యేక కేంద్రాలు వెలు స్తున్నాయి. కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ‘అమ్మతనం’తో వ్యాపారం చేస్తున్నాయి. దంపతుల సంతానలేమి సమస్యలను ఆసరాగా చేసుకుని నిర్వాహకులు రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. దీనికితోడు నిబంధనలు పాటిం చకున్నా.. చికిత్సకు తగిన వైద్యుల్లేకున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పైపైన తనిఖీలు చేస్తూ ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన కొత్తపేట, కూకట్‌‌పల్లిలో జరిగిన ఘటనలు.

​ఐవీఎఫ్‌‌పై పెరుగుతున్న ఆసక్తి​
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లో దాదాపు 200 వరకు ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువగా బంజారాహిల్స్‌. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ ‌సిటీ, గచ్చిబౌలి, కూకట్‌‌పల్లి, ఫైనాన్షియల్‌ ‌డిస్ర్టిక్‌‌లో ఉన్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆస్పత్రి, పాతబస్తీలోని పేట్లబుర్జు సర్కార్‌ ఐవీఎఫ్‌ ‌సెంటర్లు కూడా ఉన్నా.. వీటిపై అవగాహన లేకపోవడంతో బాధితులు ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సహజ గర్భధారణ కష్టమవుతున్న దంపతుల్లో ఐవీఎఫ్‌‌పై ఆసక్తి పెరుగుతోంది. పెళ్లయిన రెండు, మూడేండ్లలో సహజంగా గర్భం రాలేదంటే ఐవీఎఫ్‌‌ను ఎంచుకుంటున్నారు. ఈ విధానం ద్వారా అందరికీ సత్ఫలితాలు వస్తాయా..? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొందరికి ఏడాదిలో సక్సెస్ అయితే.. మరికొందరికి రెండూ మూడేండ్లు పట్టొచ్చు. మరికొందరికి సక్సెస్ కాకపోచ్చు అని కూడా వైద్యులు చెబుతున్నారు. గ్రేటర్‌ ‌పరిధిలో మధ్యతరగతి, ఉద్యోగ దంపతుల్లో ఫెర్టిలిటీ సేవలపై డిమాండ్ పెరుగుతోందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క ఐవీఎఫ్ సైకిల్‌‌కే రూ.లక్షల్లో ఖర్చువుతుండటంతో ‘మాతృత్వం’ ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒక్కో సెంటర్‌‌లో ఐవీఎఫ్‌‌కు రూ.3 లక్షల నుంచి రూ. రూ.5లక్షల వరకు, ఐయూఐకు రూ.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స పొందడం ద్వారా బిడ్డను పొందేందుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు, అద్దె గర్భం ద్వారా అయితే సుమారు రూ.20 లక్షలకుపైనే తీసుకుంటున్నారు. డిమాండ్‌ ‌పెరగడంతో మోసాలూ పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌‌నగర్‌ ‌మండలంలో కొత్తపేటకు సమీపంలో ఉన్న ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులు గతేడాది మే నెలలో సంప్రదించారు. ఈ సాఫల్య కేంద్రంలో చికిత్స తీసుకుంటుండగా.. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇటీవల లోపల శిశువు బాగానే పెరుగుతుందని, ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవని చెప్పారు. కానీ కొద్ది రోజుల క్రితం బాధితురాలికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి వచ్చారు. చికిత్స చేసిన వైద్యులు గర్భంలో ఉన్న శిశువు మృతి చెందిందని అబార్షన్ చేశారు. దీంతో ఆ బాధితురాలికి సంతానం కలగకపోగా.. తల్లి అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ​

‘క్యాష్‌’ చేసుకుంటున్న వైద్య, ఆరోగ్యశాఖ
​గ్రేటర్‌ పరిధిలో ఫెర్టిలిటీ సెంటర్లు విస్తృతంగా వెలుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడం లేదని గతేడాది ‘సృష్టి’ వ్యవహారం తర్వాత చేసిన దాడుల్లో వెల్లడైంది. దాదాపు 50 వరకు ఫెర్టిలిటీ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీల్లో తేలిపోయింది. ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డబ్బులు డిమాండ్‌ ‌చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నీ చట్టపరంగా ఉంటే సరేసరి.. లోటుపాట్లను గుర్తిస్తే ముందుగా అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ తర్వాతే వసూళ్ల పర్వం మొదలవుతోందనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ఇటీవల కూకట్‌‌పల్లిలోని ఓ ఐవీఎఫ్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.. లోటుపాట్లున్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల తర్వాత కొందరు సదరు ఆస్పత్రి యాజమాన్యంతో బేరానికి దిగి పెద్ద మొత్తంలో డిమాండ్‌ ‌చేయడంతో ఆ ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్‌ యాజమాన్యం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో సదురు ఆస్పత్రితో కాళ్లబేరానికి వచ్చి ఎంతో కొంత జరిమానా వేసి వదిలేశారు. గతంలోనూ మియాపూర్ పరిధిలో ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారన్న అంశం అప్పట్లో హాట్‌‌టాఫిక్‌‌గా నిలిచింది. జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది తక్కువగా ఉండటం, ప్రయివేటు ఆస్పత్రులు అధిక సంఖ్యలో ఉండటంతో పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -