ప్రయివేటు ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్టీ, సరోగసీ చట్టాలను కట్టుదిట్టం చేయాలి
సమీక్షలో అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను మరింత విస్తరించడంతో పాటు ప్రయివేటు ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్ల పనితీరు, ఏఆర్టీ, సరోగసి చట్టాల అమలు, పీసీపీఎన్డీటీ యాక్ట్ అమలుపై సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గాంధీ, పేట్లబుర్జు ఆస్పత్రుల్లోని ఐవీఎఫ్ సెంటర్లలో 39,802 మంది పేషెంట్లకు ఫర్టిలిటీ వైద్య సేవలు అందించామనీ, 20,185 ఫాలిక్యులర్ స్టడీలు, 521 ఐయూఐ ప్రక్రియలు, 545 ఐవీఎఫ్ కేసులు చేశామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 477 ఏఆర్టీ, సరోగసి సెంటర్లు రిజిస్టర్ అయి ఉన్నాయని తెలిపారు. వాటిలో 129 ఏఆర్టీ లెవల్-1, 226 ఏఆర్టీ లెవల్-2, 59 ఏఆర్టీ బ్యాంకులు, 63 సరోగసి క్లినిక్లు ఉన్నాయనీ, ఇప్పటివరకు 379 సెంటర్లను తనిఖీ చేయగా, 50 సెంటర్లలో డీవియేషన్స్ గుర్తించినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యానారాయణ మంత్రికి వివరించారు. ఆయా సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామనీ, రెండు సెంటర్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి మరో తొమ్మిది సెంటర్ల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేశామని కమిషనర్ వెల్లడించారు. ఫర్టిలిటీ సేవల పేరుతో పేషెంట్లపై అనవసర ఆర్థిక భారం మోపకుండా, పారదర్శకతతో సేవలు అందేలా చూడాలని మంత్రి రాజనర్సింహ సూచించారు. లింగ నిర్ధారణకు పాల్పడే అవకాశమున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలనీ, పీసీపీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, ఐవీఎఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుమిత్ర, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



