Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో పెరగనున్న పేదరికం

పశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో పెరగనున్న పేదరికం

- Advertisement -

దారిద్య్రం ముంగిట 25 లక్షల మంది
ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ..దక్షిణాసియాదే అధిక వాటా
కుదేలవుతున్న కుటుంబ, ప్రభుత్వ బడ్జెట్లు : యూఎన్‌డీపీ నివేదిక హెచ్చరిక
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో తలెత్తిన ఘర్షణలు, సైనిక చర్యలు, ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో 25లక్షల మంది పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం పొంచి వుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. మానవాభివృద్ధి పురోగతికి సంబంధించి కొంత నష్టాన్ని ఎదుర్కొనే అవకా శముందని అంచనా వేసింది. ‘పశ్చిమాసియాలో చెలరేగిన సైనిక ఉద్రిక్తతలు : ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల వ్యాప్తంగా మానవాభివృద్ధి ప్రభావితం’ అనే శీర్షికతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌- యూఎన్‌డీపీ) ఒక నివేదికను మంగళవారం వెలువరించింది. ఈ పరిణామాలతో ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల వ్యాప్తంగా మానవ అభివృద్ధికి సంబంధించి ఒత్తిళ్ళు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. అధిక ఇంధన ధరలు, సరుకు రవాణా భారం, సరఫరా మార్గాల్లో అంతరాయాలు, గల్ఫ్‌ దేశాల నుంచి తగ్గిన చెల్లింపులు, పెరుగుతున్న ఉపకరణాల వ్యయం ఇవన్నీ కలిసి ఒక కుటుంబం కొనుగోలు శక్తిని క్షీణింపచేస్తున్నాయి. చిన్న వ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులు, రైతులు అత్యంత దారుణంగా దెబ్బతింటున్నారు. దీంతో ఆహార అభద్రత పెరుగుతోంది. ప్రభుత్వ బడ్జెట్లు తారుమారవుతున్నాయి. జీవనోపాధులు బలహీన పడుతున్నాయని నివేదిక హెచ్చరించింది. మొత్తంగా చూసినట్లైతే అభివృద్ది విషయంలో భారత్‌కు చిన్నపాటి ఎదురుదెబ్బ తప్పదని భావించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది దారిద్య్రంలోకి జారుకునే ముప్పు ముంగిట వున్నారని ప్రాధమికంగా అంచనా వేసింది. పశ్చిమాసియాలో పెచ్చరిల్లిన యుద్ధం కారణంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో 299 బిలియన్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్ల వచ్చని అంచనా వేసింది.

‘భారతదేశంలో, దారిద్య్రం బారినపడే వారి సంఖ్య నాలుగు లక్షల నుంచి 25 లక్షలకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి నెట్టబడే వారి సంఖ్య దాదాపుగా 19 లక్షలు నుంచి 88 లక్షలకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇందులో దక్షిణాసియాదే అధిక వాటాగా వుంది. 17 లక్షల నుండి 80 లక్షల వరకు పెరగనున్నారు. ప్రాంతాల వారీగా జనాభా పరిమాణం, అలాగే వారి ఆదాయాలకు, ధరలకు కలిగిన దెబ్బలను బట్టి ఈ తీవ్రత నమోదవుతోందని నివేదిక పేర్కొంది. చైనాలో ఈ ప్రభావం కొంత మేరా మితంగా వుండగలదని అంచనా వేశారు. కొత్తగా పేదరికంలో జారుకునే వారి సంఖ్య 1,15,000 నుంచి 6,20,000 వరకు వుండొచ్చునని భావిస్తున్నారు. అత్యంత భారీ జనాభా వున్నందున స్వల్ప నిష్పత్తిలో ఈ మార్పులు సంభవించినట్లు కనబడుతోంది. సైనిక ఉద్రిక్తతలతో పేదరికంపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తే (28రోజుల ఘర్షణలు, 8మాసాల కాలానికి సద్దుబాటు చేసిన అత్యంత తీవ్రమైన పరిస్థితులను), భారతదేశ దారిద్య్రం రేటు 23.9శాతం నుండి 24.2 శాతానికి (సంక్షోభ అనంతరం కాలంలో) పెరుగుతుందని అంచనా వేశా రు. అంటే 24,64,698మంది దారిద్య్రంలోకి నెట్టబడతారని అంచనా. అంతేకాదు పశ్చిమాసియా యుద్ధం భారత్‌లో పలు రంగాలను కూడా తీవ్రంగానే ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా భారత్‌ 90శాతం మేరా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందులో మెజారిటీ భాగం పశ్చిమాసియాదే, తాజా పరిణామాల నేపథ్యంలో చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఫలితంగా రవాణా భారం పెరిగింది. విద్యుత్‌, ఇతర ఉత్పత్తులు కూడా ప్రియమయ్యాయి. ఎరువుల దిగుమతులు దెబ్బతిన్నాయి, దీంతో వ్యవసాయం వ్యయం భారమైంది. ఫలితంగా ఆహార ధరలు పెరుగుతున్నాయి. అంతిమంగా కుటుంబ కొనుగోలు శక్తి కుదేలవుతోంది. మరోవైపు బియ్యం, తేయాకు, ఆభరణాల ఎగుమతులు దెబ్బతిన్నాయి. చిన్న తరహా వ్యాపారాలు, నిర్మాణ, తయారీ రంగాలు, ఆతిథ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలు, రత్నాలు, ఆభరణాల రంగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉపాధులు కూడా ముప్పున పడ్డాయి. ఎందుకంటే ఈ రంగాలు చాలా వరకు దిగుమతి చేసుకునే వస్తువులపై, ఇంధనంపై ఆధారపడ్డాయి. అలాగే ఎగుమతి డిమాండ్‌ బాగుంటే వీటికి అవకాశాలు బాగుంటాయి. పైగా భారతదేశంలో 90 శాతం కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేసేవారే, అందువల్ల ఈ దెబ్బ మరింత కఠినంగా వుంటుందని నివేదిక హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -