Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగ సవరణ బిల్లులపై రగడ

రాజ్యాంగ సవరణ బిల్లులపై రగడ

- Advertisement -

రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మోడీ సర్కార్‌
ఎంపీలకు సమాచారమిచ్చిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ బిల్లు : కపిల్‌ సిబల్‌
ప్రధానిది బుల్డోజర్‌ మనస్తత్వం: జైరాం రమేష్‌
నేడు ప్రతిపక్షాల భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలులోకి తీసుకు వచ్చేందుకు, లోక్‌ సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి 850 వరకు పెంచే నియోజక వర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదానికి ఏర్పాట్లు చేసింది. ప్రతిపక్షాల డిమాండ్లను, వారి సూచనలను పెడచెవిన పెట్టి బిల్లులను ఆమోదించేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 16న ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. కాగా ఈనెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు బిల్లుల గురించి ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. బిల్లు కాపీలను ఎంపీలకు పంపింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఈ బిల్లు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81ని సవరించాలని కోరుతోంది. 2023 మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన చట్టం బిల్లు, శాసనసభలు ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరిలకు సంబంధించిన ఒక అధికార బిల్లును ప్రవేశపెడతారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. దీంతో లోక్‌ సభ స్థానాలు 543 నుంచి 850కి చేరే అవకాశం ఉంది. లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీనికి సంబంధించిన బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనుంది. 2029 ఎన్నికల్లోగా డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్‌ స్థానాలు కూడా పెరగనున్నాయి. జనగణన తరువాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం.

నేడు ప్రతిపక్షాల భేటీ
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఇండియా బ్లాక్‌ నేతలు బుధవారం భేటీ కానున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై చర్చించనున్నారు.

2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ బిల్లు : కపిల్‌ సిబల్‌
తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్వి భజన చేసుకుని, 2029 ఎన్నికల్లో గెలవాలనే రాజకీయ లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లు తీసుకు రావాలనుకుంటోందని, ఈ రాజకీయ ఎత్తుగడను ప్రతిపక్షం తిప్పి కొట్టాలని రాజ్యసభసభ్యుడు కపిల్‌ సిబల్‌ అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే, లోక్‌ సభలో తెలిపారు. ప్రస్తుతం 543 సీట్లలో మహిళలకు సీట్లు రిజర్వ్‌ చేసేందుకు ఒక బిల్లు తీసుకురావాలని ఆయన అన్నారు. ”బీజేపీ రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చేయదు. తమకు రాజకీయంగా ప్రయోజనం చేకూరితే తప్ప వారు ఏ బిల్లునూ తీసుకురారు. 106వ రాజ్యాంగ సవరణ బిల్లు 334-ఎను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జనాభా లెక్కలు, నియో జకవర్గాల పునర్విభజన తరువాత 2026 అనంతరం మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు చేయబడుతుంది” అని సిబల్‌ అన్నారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని తెలిపారు. ”ఇప్పుడు మోడీ సర్కార్‌ దానిని సవరించాలని నిర్ణయించుకున్నారు. వారికి ఎలాంటి మార్పు కావాలో చెప్పడం లేదు. 2023లో జనాభా లెక్కలు, నియోజక వర్గాల పునర్విభజన తరువాత ఇది జరుగుతుందని వారు నిర్ణయించారు. ఇపుడు దానిని మార్చాలని చెబుతున్నారు” అని విమర్శించారు. ఇది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న చర్య అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ”టీఎంసీ, ఇతర పార్టీల ఎంపీలు అక్కడ ప్రచారం చేస్తారా? లేక ఇక్కడికి వస్తారా? ఒకవేళ 29వ తేదీ తరువాత ఈ అంశాన్ని చేపట్టి ఉంటే ఏం జరిగేది? ఈ ప్రక్రియలో తమకు రాజకీయ ప్రయోజనం ఉందని తెలిస్తే తప్ప బీజేపీ ఏమీ చేయదు” అని ఆయన ధ్వజమెత్తారు.

”పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో గెలిచే అవకాశం తమకు లేదని వారికి తెలుసు, అందుకే ఎన్నికలకు ఆటంకం కలిగించాలని చూస్తున్నారు. మహిళా చట్టం ఆమోదం పొందినప్పుడు ‘మేము ముందే వాగ్దానం చేశాం, ఇప్పుడు నెరవేరుస్తున్నాం’ అని చెబుతారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన ప్రతి రాష్ట్రంలో లోక్‌ సభ సీట్లను 50శాతం పెంచడమే లక్ష్యం. కాబట్టి 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య 120కి చేరు తుంది. 39సీట్లు ఉన్న తమిళనాడులో ఈ సంఖ్య కేవలం 59కి మాత్రమే చేరుతుంది. వాస్తవానికి 41గా ఉన్న తేడా ఇప్పుడు 61 సీట్లకు పెరుగుతుంది”అని కపిల్‌ సిబల్‌ అన్నారు. ”ఉత్తర భారతదేశంలో బీజేపీ 238 స్థానాలకుగాను 127 గెలుచుకోగా, దక్షిణ భారతదేశంలో 130 స్థానాలకుగాను 29 గెలు చుకుంది. కాబట్టి బీజేపీ ఉత్తరాదిన సీట్లను పెంచుకుని, పెద్ద వాటాను పొందాలని చూ స్తోంది. ఈ వ్యత్యాసం బీజేపీకి రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది” అని కపిల్‌ అన్నారు. ‘పాకెట్‌ వీటోల’తో డీలిమిటేషన్‌ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజే పీ యత్నిస్తోందని తెలిపారు. ”నియోజక వర్గా ల పునర్విభజన కమిషన్‌ చైర్మెన్‌కు సొంతంగా వీటో అధికారం ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌, అసోంలో ఏం జరిగిందో మనం చూశాం. ఏ నియోజకవర్గాలు తమకు ప్రయోజనం చేకూ రుస్తాయో బీజేపీనే నిర్ణయిం చుకుంటుంది. పునర్విభజన కమిషన్‌తో తమ స్వప్రయోజనా లను నెరవేర్చుకుంటారు”అని ఆయన విమర్శిం చారు. ”బీజేపీ 2011 జనాభా లెక్కలను తీసు కుంటోంది. కానీ జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నప్పుడు, ఈ బిల్లు అవసరం ఎందుకు? 2027 నాటికి డేటా వస్తుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ చెప్పారు. కాబట్టి వారు అప్పుడు ఆ బిల్లును తీసుకురావచ్చు” అని కపిల్‌ సిబల్‌ అన్నారు. ”ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యుడు ఎవరూ దీన్ని ఆమోదించ కూడదు. వారికి మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. మనం దీన్ని తిరస్కరించాలి. ఎందుకంటే వారు దేశ భవిష్యత్తుతో రాజకీయాలు ఆడు తూ, దేశసమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తున్నారు”అని కపిల్‌ అన్నారు.పార్ల మెంట్‌లోని ప్రతిపక్షసభ్యులెవరూ అనుమతించకూడదని నొక్కిచెప్పారు.

మహిళా రిజర్వేషన్లతో దేశ ప్రజాస్వామ్యం బలోపేతం: ప్రధాని మోడీ
2029లో జరిగే లోక్‌సభ, వివిధ శాసనసభలకు మహిళా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుచేస్తూ ఎన్నికలు నిర్వహిస్తే దేశ ప్రజాస్వామ్యం మరిం త బలోపేతమై, చైతన్య వంతంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ప్రధాని మోడీ దేశంలోని మహిళలకు లేఖ రాశారు. మహి ళలు పలు రంగాల్లో రాణిస్తున్నందున, శాసనసభలలో వారి భాగస్వామ్యం పెరగడం సముచితమని అన్నారు. మన శాసనసభల్లో మహిళల గళం బలపడినప్పుడు, ప్రజాస్వామ్య గళం కూడా బలపడుతుందని తెలిపారు.

ప్రధానిది బుల్డోజర్‌ మనస్తత్వం : జైరాం రమేష్‌
రాజ్యాంగ సవరణ బిల్లును ఎంపీలతో పంచుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమేనని, ఇది ప్రధాని మోడీ బుల్డోజర్‌ మనస్తత్వాన్ని బయట పెట్టిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ విమర్శించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఉధతంగా సాగే ఏప్రిల్‌ 16న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎన్నికలు పూర్తైన తరువాత, అంటే 15 రోజుల తరువాత, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సహేతుకమైన, చట్టబద్ధమైన అభ్యర్థనలను మోడీ ప్రభుత్వం తిరస్కరించిందని విమర్శించారు. ఎంపీలు చర్చించి ఓటు వేయాల్సిన రాజ్యాంగ సవ రణ బిల్లుల కాపీలను మంగళవారం ఉద యం వరకు మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -