Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంరోజారాణికి కన్నీటి వీడ్కోలు

రోజారాణికి కన్నీటి వీడ్కోలు

- Advertisement -

విశాఖ నగరంలో అశ్రునయనాలతో అంతిమయాత్ర
ఊహించని ఘటన.. తీరని నష్టం :
సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఉద్యమాలకు తీరని లోటు : ఏపీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు
విశాఖపట్నం :
”విశాఖ నగరంలో పూసిన ఓ ఉద్యమ రోజాపువ్వా.. శ్రామిక మహిళా హృదయాన సిరిసిరి మువ్వా… అందుకో అరుణారుణ వందనాలు కడసారి మా జోహార్లు.. అంటూ మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరంలో రోజారాణి అంతిమ యాత్ర సాగింది. సీఐటీయూ కార్యాలయం నుంచి చావుల మదుం శ్మశానవాటికకు ఉద్యమ నినాదాలతో సాగింది. అనంతరం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి సీపీఐ(ఎం), సీఐటీయూ అగ్రనేతలు, మహిళా, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరై ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ నగరంలో సోమవారం సాయంత్రం రామా టాకీస్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ శ్రామిక మహిళా ఉద్య మ నేత, న్యూ బోయిగూడ నర్సింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ చక్రవర్తుల రోజారాణి దుర్మణం పార్టీ, ప్రజాసంఘాల నేతలను తీవ్రంగా కలచివేసింది. మంగళవారం ఉదయం కేజీహెచ్‌ లో పోస్టుమార్టం అనంతరం విశాఖలోని సీఐటీయూ కార్యాలయం (ఎన్‌పీఆర్‌ భవనం) వద్ద ఆమె భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షతన నిర్వహించిన సంతాపసభలో పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రోజారాణి విశాఖలో పుట్టి విద్యార్థి ఉద్యమంలో పెరిగా రని,హైదరాబాద్‌ వెళ్లి సీఐటీయూ, పార్టీ ఉద్యమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు.

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ… కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన రోజారాణి మరణం ఎవ్వరూ ఊహించని ఒక ఘటన అని..ఆమె మృతి కార్మికోద్యమాలకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ చురుకుగా ఉంటూ, ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా పోషిం చేవారని ఆయన నివాళులర్పించారు. ఎన్నో ఏండ్లపాటు ఉద్యమానికి సేవలందిం చాల్సిన ఆమె.. అర్థాంతరంగా మనల్ని వీడిపోవటం అత్యంత బాధాకరమని అన్నారు. మహిళా నాయకు రాలిగా, ఉద్యోగిగా, అధికారిణిగా… ఏ హోదాలో ఉన్నా ఆయా రంగాల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారని గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్టు కార్యకర్తగా దేశంలోని దోపిడీ వ్యవస్థ, అసమానతలు పోవాలని, స్త్రీ, పురుష సమానత్వం రావాలని కోరుకున్నారని తెలిపారు. రోజా మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపాన్ని తెలిపారు. భర్త, సీఐటీయూ నేత జే.వెంకటేశ్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వెంకటేశ్‌కు ఆమె మరణం భర్తీ చేయలేని లోటని పేర్కొన్నారు. దాన్ని అధిగమిస్తూ ఆయన, ఇతర కుటుంబ సభ్యులు దృఢంగా నిలబడాలని ఆకాంక్షించారు. వారికి తమ పార్టీ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తూ అండదండలనిస్తుందని వెస్లీ పేర్కొన్నారు.

రోజారాణి భర్త, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్‌ స్పందిస్తూ ‘సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రోజా నాకు ఫోన్‌ చేశారు. మాట్లాడాను. మరో 15 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగిందని కుటుంబం నుంచి ఫోన్‌ రాగానే తీవ్ర కలత చెందాను. నేను పనిచేయడానికి రోజా అంతులేని సహకారం ఇస్తూ వచ్చారు’ అని ఉద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎం.సాయిబాబు, ఎస్‌.వీరయ్య, కె.లోకనాథం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.వెంకట్‌, సీఐటీయూ తెలంగాణ నాయకులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, జె.మల్లికార్జున్‌, భూపాల్‌, జె.చంద్రశేఖర్‌, పద్మశ్రీ, పి.శ్రీకాంత్‌, నవతెలంగాణ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్‌, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, ఐలూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి, తెలంగాణ రాష్ట్ర బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ తెలంగాణ ప్రధాన కార్యదర్శి భాను కిరణ్‌, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీఐటీయూ అఖిల భారత నాయకులు బేబీరాణి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, అజశర్మ, డాక్టర్‌ బి.గంగారావు, తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ కాలేజీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.విద్యుల్లత, విశాఖ కెజిహెచ్‌ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సత్యవల్లి, తెలంగాణ ట్రైన్డ్‌ నర్సస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.రాజేశ్వరి, ఉద్యమ శ్రేయోభిలాషి డాక్టర్‌ కొరటాల సరిత, తెలంగాణ నుంచి కార్యకర్తలు, రోజారాణి బంధువులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, సీఐటీయూ జాతీయ నాయకులు డాక్టర్‌ కె.హేమలత, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విజయరాఘవన్‌ సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -