టీజీఈజేఏసీ డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన
నవతెలంగాణ బ్యూరో-సిటీ బ్యూరో/విలేకరులు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల పెన్షనర్ల జేఏసీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి.. ఓపీఎస్‌ను అమలు చేయాలని, అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్ డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్), బి. శ్యామ్ ప్రసంగించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఉద్యోగుల జీవితాలకు భరోసానిచ్చే ఓపీఎస్‌ను పునరుద్ధరించే వరకు ఉద్యమం ఆగేది లేదని స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ ఎస్. విక్రమ్ కుమార్, కన్వీనర్ ఎం.బి. కృష్ణ యాదవ్, టీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం. సత్యనారాయణ గౌడ్, నాయకులు ఉమ, శైలజ, నజీర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కురాడి శ్రీనివాస్ కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్ కుమార్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీజీజేఎల్‌ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.పి.శోభన్‌బాబు ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. టీఎన్జీవో హైదరాబాద్ సిటీ చైర్మెన్ కట్టకూరి శ్రీకాంత్, కన్వీనర్ గండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అబిడ్స్ భీమా భవన్ వద్ద, హెచ్ఓడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం ఉద్యోగుల ప్రతినిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరణ చేసుకోవడమే తమ లక్ష్యమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. సెప్టెంబర్ 1ని సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి, వొడ్నాల రాజశేఖర్ మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు, జూనియర్ లెక్చలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుమారస్వామి, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్‌గౌడ్, ఇంటర్మిడీయేట్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, టీఏపీయూఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ హన్మంతరావు, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పి.రాధ, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, టీజీఆర్ఎస్ఏ- సీసీఎల్ఏ యూనిట్ నేతలు రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి , మల్లేష్, వేంకటేశ్ వివిధ సంఘాల నేతలు రాబర్ట్ బ్రూస్, రామరాజు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం… బహుబలి గేట్ వద్ద తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్, ఉమెన్ వెల్ఫర్ అసోసియేషన్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అసెంబ్లీ, లోక్‌భవన్ ఉద్యోగుల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నల్ల రంగు దుస్తులు ధరించి ప్లకార్డులు పట్టుకొని సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్నాయక్ మాట్లాడారు. సీపీఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ ను పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటీ భూపతి రావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న విద్రోహదినంగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారని చెప్పారు. నిజామాబాద్ ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మెన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్ సమస్యలపై టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని పిలుపు నిచ్చారు.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల్లో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గండిపేట మండలంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. తిరుమలగిరి, పెన్‌పహాడ్ , మద్దిరాల, చివ్వెంల మండలాల్లో నిరసనలు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని తాటికల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. చండూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో వందనపు శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాధ్రిభువనగిరి జిల్లా ఆలేరు పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. రామన్నపేటలో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిరసన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. నారాయణపేట జిల్లాలోని వివిధ పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.



