లేదంటే అసెంబ్లీని స్తంభింప జేస్తాం :
మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ, లేదంటే అసెంబ్లీ సమావేశాలను స్తంబింప జేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనకు నేటితో వెయ్యి రోజులు పూర్తయ్యాయని పేర్కొంటూ మంగళవారం ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై అసత్యాలు ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. క్షేత్రస్థాయిలో పిల్లలు పడుతున్న గోస మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. కష్టపడి చదువుకున్నా సర్టిఫికెట్లు చేతికి రాక.. అటు ఉద్యోగాలకు, ఇటు పైచదువులకు వెళ్లలేక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాల వల్ల రాష్ర్టంలో 960గా ఉన్న ప్రయివేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య 650కి పడిపోయిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు త్వరలో మూతపడే ప్రమాదముందని హెచ్చరించారు. దీని ప్రభావం అత్యధికంగా గ్రామీణ తెలంగాణపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నెలల తరబడి జీతాలు అందక అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బంది ఇంబ్బందులు పడుతుంటే, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించలేక కళాశాలలు సంక్షోభంలో కూరుకు పోయాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రూ. 2,500 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు ఉంటే, వాటిని చెల్లించి ఆ పథకాన్ని కొనసాగించినట్టు గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు జరిగినా, కరోనా విపత్తు వచ్చినా తాము ఫీజు రియింబర్స్ మెంట్ ఆపలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు భరోసాగా నిలిచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



