ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఊడిన దాదాపు 80వేల జాబ్‌లు
అత్యధికంగా అమెరికా నుంచి 76 శాతం
ఏఐ ఆధారిత ఉద్యోగ సంక్షోభానికి ఇది ఆరంభం మాత్రమే
హెచ్చరిస్తున్న నిక్కై ఏసియా నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 2026 ప్రారంభం నుంచే టెక్ రంగంలో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే దాదాపు 80వేల ఉద్యోగాలు కోల్పోయినట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. ఇందులో అమెరికా నుంచే అత్యధికంగా 76 శాతం కోతలు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగ కోతలకు ప్రధాన కారణంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత మార్పులు నిలుస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచే టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల పరిస్థితి కఠినంగా మారుతోంది. నిక్కై ఏసియా నివేదిక ఇదే విషయాన్ని చెప్తోంది. ఈ నివేదిక సమాచారం ప్రకారం… ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రపంచవ్యాప్తంగా 78,557 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో అమెరికా ఒక్కటే సుమారు 76.7 శాతం వాటా కలిగి ఉంది. అమెజాన్, ఒరాకిల్, మెటా, డెల్ వంటి ప్రముక కంపెనీలు ఈ ఉద్యోగ కోతలను ‘పునర్‌వ్యవస్థీకరణ (రీకన్‌స్ట్రక్టింగ్)’, వ్యూహ మార్పులలో భాగంగా వివరిస్తున్నప్పటికీ.. ఈ మార్పుల వెనుక ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మొత్తం ఉద్యోగ కోతల్లో దాదాపు 37,638 ఉద్యోగాలు నేరుగా లేదా పరోక్షంగా ఏఐ ఆటోమేషన్ వల్ల జరిగాయని అంచనా. సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించాయి. దీనితో పనితీరు మెరుగుపడుతుందని భావించి, కొన్ని ఉద్యోగాల అవసరం తగ్గుతోంది.
‘ఏఐ ఎఫెక్ట్ పూర్తిగా బయటపడలేదు’
కాగ్నిజెంట్ సంస్థ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హౌడ్జత్ ప్రకారం.. ఏఐ ప్రభావం ఇంకా పూర్తిగా బయటపడలేదు. కంపెనీలు ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలను ఇంకా పూర్తిగా అనుభవించలేదు. ప్రస్తుతం జరుగుతోన్న ఉద్యోగ కోతలు.. ఏఐ నిజంగా సాధించిన ఫలితాల కంటే భవిష్యత్తులో అది సాధిస్తుందనే అంచనాల ఆధారంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇక కొన్ని సంస్థలు కోవిడ్ తర్వాత అధికంగా నియామకాలు చేసిన కారణంగా కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అయితే ఈ కోతలకు ఏఐను ఒక కారణంగా చూపుతున్నట్టు కూడా ఆయన వివరించారు. టెక్ రంగంలో ఈ మార్పుపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థలకు మారుతున్న సమయంలో సంస్థలు, ఉద్యోగులు రెండూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మార్పు కాలాన్ని ‘పెయిన్‌ఫుల్ ట్రాన్సిషన్’గా బాబక్ హౌడ్జత్ అభివర్ణించారు.
అమెరికాలో ఏడు శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
ఇక గోల్డ్‌మన్ సచ్స్ నివేదిక ప్రకారం.. వచ్చే పదేండ్లలో ఏఐ కారణంగా అమెరికాలో 6-7 శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది నిరుద్యోగాన్ని సుమారు 0.5 శాతం వరకు పెంచవచ్చు. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం కూడా ఉంటుంది. వారి ఆదాయం సుమారు 3 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే పదేండ్లలో వారి ఆదాయ వృద్ధి సుమారు పది శాతం వరకు వెనుకబడే ప్రమాదం కనబడుతోంది. ప్రత్యేకించి జెన్-జెడ్ ఉద్యోగులు తక్కువ నైపుణ్యం ఉన్న పనుల్లోకి మారే అవకాశం ఉండటంతో.. వారి కెరీర్ పురోగతి నెమ్మదించవచ్చు. దీంతో జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి
ఏఐ ఆధారిత మార్పులు టెక్ ఉద్యోగులను వణికిస్తూ ఆందోళన కలిగిస్తున్నయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఉద్యోగ కోతలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత కీలకంగా మారిందని వివరిస్తున్నారు.



