– వైభవంగా నూతన విద్యార్థుల దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – కామారెడ్డి
స్థానిక ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ‘ప్రారంభ్ ఉత్సవ్–2026’ పేరుతో నూతన విద్యాల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
రజతోత్సవ వేడుకలకు శ్రీకారం
ఆర్కే విద్యాసంస్థలను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది రజతోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి తెలిపారు. గత 24 సంవత్సరాల్లో ఇక్కడ విద్యనభ్యసించిన అనేక మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గిరి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కామారెడ్డి జిల్లాకు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, మై భారత్ జిల్లా యువజన అధికారి రమేష్, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ విద్యావర్ధిని హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ప్రముఖ నేపథ్య గాయకుడు సురేష్ బాబు, ప్రజాకవి, గేయ రచయిత జయరాజ్ పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ కార్యక్రమంలో కళాశాలల సమూహం చైర్మన్ భాస్కర్ రావుతో పాటు వివిధ విభాగాల ప్రిన్సిపాళ్లు, ఉప ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



