– మున్సిపల్ చైర్‌పర్సన్ , కామారెడ్డి డీఎస్పీ
నవతెలంగాణ – కామారెడ్డి
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం ఎన్నటికీ రాదన్నారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటి ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమలో సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని, నిస్వార్థంగా సేవలందించే ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, అధ్యక్షులు జమీల్ అహ్మద్, ఐవీఎఫ్ జిల్లా విభాగం నాయకులు దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న, ఎర్రం విజయ్, బుక్క రజని, గజవాడ అన్నపూర్ణ, పర్ష వెంకటరమణ, ఎల్లంకి సుదర్శన్, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.



