Friday, September 4, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజలను వంచించిన కాంగ్రెస్‌ కు గుణపాఠం తప్పదు

ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ కు గుణపాఠం తప్పదు

- Advertisement -

– అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రజా వ్యతిరేక సర్కారు
– రైతులు, వృద్ధులు, మహిళలను నిలువునా ముంచారు
– దమ్మపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘వంటా-వార్పు’ నిరసన
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జి ఉప్పల వెంకటరమణ ఆరోపించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ దమ్మపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ‘వంటా-వార్పు’ కార్యక్రమం నిర్వహించారు.పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దొడ్డ రమేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డుపైనే పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

సంక్షేమాన్ని గాలికొదిలేసారు: మెచ్చా
కేసీఆర్‌ హయాంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గిరిజనుల దశాబ్దాల కల అయిన పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటను సొంత పార్టీ నేతలే పట్టించుకోని పరిస్థితి ఉందని, అంతర్గత విభేదాలతో ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హామీలన్నీ మోసపూరితమే: ఉప్పల
ఎన్నికల సమయంలో వంద రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఉప్పల వెంకటరమణ ఆరోపించారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట వృద్ధాశ్రమానికి చెందిన కోటేశ్వరరావుతో మాట్లాడి పింఛన్‌ అందకపోవడంపై ఆయన సమస్యలను తెలుసుకున్నారు.

ప్రభుత్వం ఒక్కో వృద్ధుడి కి రూ.82,500, దివ్యాంగులకు రూ.66 వేల చొప్పున బకాయిలు పడిందని ఉప్పల పేర్కొన్నారు. కల్యాణలక్ష్మీ తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు.

రైతుబంధు కింద రైతులకు రూ.2,936 కోట్ల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిచిపోయిందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కమీషన్ల సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు.

స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ 1/70 చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ వ్యవహారాలు సాగుతున్నాయని, పామాయిల్‌ ఫ్యాక్టరీల విషయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పామాయిల్‌ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఉద్యమ బాట పట్టామని తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు, మండల మాజీ అధ్యక్షులు, మండల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -