ముగ్గురు మృతి..శిథిలాల కింద పలువురు
సహాయ చర్యల్లో పాల్గొన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, డీడీఎంఏ, ఎన్‌డీఆర్ఎఫ్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర విషాదం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్లో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో బాలుర పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద పలువురు విదార్థులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న ఈ భవనం సుమారు 50 ఏండ్ల క్రితం నాటిది. ప్రమాదం జరిగిన సమయంలో బేస్‌మెంట్‌లో మరమ్మతు, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బేస్‌మెంట్‌లో నీరు చేరి పునాది బలహీనపడటంతోనే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. భవనం కూలిన వెంటనే ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, డీడీఎంఏ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక వాహనాలు, క్యాట్స్ అంబులెన్సులను రంగంలోకి దించారు. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలింపు చేపట్టాయి. ఇప్పటివరకు 8 మందిని బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్పత్రికి తరలించే సమయానికే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ చర్యల్లో గాయపడిన ఓ సిబ్బందికి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. 40 నుంచి 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. 40 నుంచి 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
విద్యార్థులతో నిండే ప్రాంతం
సత్య నికేతన్ ప్రాంతంలో ఇరుకైన వీధుల వెంట అనేక పీజీ వసతులు, హోటళ్లు, తినుబండారాల దుకాణాలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలు కళాశాలలు సమీపంలోనే ఉండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ నివసిస్తుంటారు. స్థానిక ఢిల్లీ పోలీసు సిబ్బంది రాజెన్ ఛెత్రి తెలిపిన వివరాల ప్రకారం, కూలిపోయిన భవనంలో సుమారు 15 గదులు ఉండేవి. ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉండేవారు. కేరళ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ ఉండేవారని తెలిపారు. మోతీలాల్ నెహ్రూ కాలేజ్, ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ పీజీలో ఉండేవారని, ఒక్కో బెడ్‌కు సుమారు రూ.12 వేల వరకు అద్దె చెల్లించేవారని చెప్పారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తారన్‌జీత్ సింగ్ సంధు, పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న భవనాన్ని ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎంతో పాటు పోలీస్ కమిషనర్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నట్టు తెలిపారు.



