Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్‌ ‌కారిడార్లు

రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్‌ ‌కారిడార్లు

- Advertisement -

సీఎస్‌ ‌సంజయ్‌‌జాజు పరిశీలన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సికింద్రాబాద్‌, బేగంపేట్‌ ‌ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఎలివేటెడ్‌ ‌కారిడార్లను ప్రతిపాదించింది. ఆదివారం ఆయాప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌జాజు వాటిని పరిశీలించారు. కారిడార్ల అలైన్‌మెంట్, కనెక్టివిటీ, భూసేకరణ, మౌలిక వసతుల అవసరాల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు ఎన్‌‌హెచ్‌-44పై, అలాగే ప్యారడైజ్ నుంచి బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ మీదుగా ఓఆర్‌ఆర్‌ జంక్షన్ వరకు ఎస్‌‌హెచ్‌-1 (రాజీవ్ రహదారి)పై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సీఎస్‌కు వివరించారు.ఈ ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్యారడైజ్, సికింద్రాబాద్, బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల మధ్య రవాణా కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఉత్తర హైదరాబాద్ ప్రాంతం నుంచి ఓఆర్‌ఆర్‌కు వేగవంతమైన అనుసంధానం ఏర్పడటంతో పాటు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ కారిడార్లు దోహదపడనున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్, బొల్లారం,శామీర్‌పేట్ మార్గంలో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కారిడార్‌లను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సీఎస్ అధికారులకు వివరించారు. ప్యారడైజ్, బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఎలివేటెడ్ కారిడార్ల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అమలులో భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, వివిధ శాఖల మధ్య సమన్వయం, అవసరమైన అనుమతులు తదితర అంశాలను వేగంగా పరిష్కరించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మెట్రో రైలు, ప్రధాన రహదారులు, ఓఆర్‌ఆర్‌ మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. సీఎస్‌‌ వెంట హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

​మెట్రో రైల్ సేవలపై సీఎస్ ఆరా
‌మరోవైపు మెట్రో రైళ్లలో ప్రయాణికులకు అందుతున్నసేవలపై సీఎస్‌ ఆరా తీశారు. ఆదివారం బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్టేషన్లలోని సౌకర్యాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. మెట్రో రైల్ కార్యకలాపాలు, ప్రయాణికుల రద్దీ, స్టేషన్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రైళ్ల నిర్వహణ, ప్రయాణీకులకు అందుతున్న సేవల గురించి వాకబు చేశారు. హైదరాబాద్ లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం, ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -