స్కూళ్లు బాగుచేయండి..టీచర్లు, గదులు, బెంచీలు లేవు
తాగునీరు, కరెంట్ ఎక్కడ?
సమస్యలపై వీధుల్లోకి చిన్నారులు
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల కోసం దేశవ్యాప్త ఆందోళనలు
మోడీ సర్కారును నిలదీస్తున్న కొత్తతరం
‘ప్రశ్న’ను భవిష్యత్‌తరం బలోపేతం చేస్తుంది. ఇన్నేండ్లు ఏ ప్రశ్నను అయితే తొక్కిపెట్టి, నిరంకుశ పాలన కొనసాగిందో, ఇప్పుడు అదే ప్రశ్నను చిన్నారులు తమ భుజస్కందాలపై వేసుకుంటున్నారు. పెద్దలు అడగాల్సిన ప్రశ్నలను ఇప్పుడు చిన్నారులే నిలదీస్తున్నారు. పాఠశాల భవనం కూలిపోతుందనే భయంతో యూపీలో ఆరేండ్ల నుంచి పదేండ్లలోపు పిల్లలు తరగతులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఒక చోట తాగునీరు లేదు.. మరోచోట విద్యుత్ లేదు.. ఇంకోచోట టీచర్లు లేరు.. మరొకచోట మధ్యాహ్న భోజనం నాసిరకం. దేశంలో ‘జెన్ జీ’ విద్యా సంస్కరణల కోసం గళమెత్తిన తర్వాత.. ఇప్పుడు ‘జెన్ ఆల్ఫా’ కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ ముందుకొస్తోంది. ఇప్పుడిది మోడీ సర్కారు మెడకు చుట్టుకుంటున్నది.
న్యూఢిల్లీ : దేశంలో విద్యా వ్యవస్థపై కొత్త తరం అసంతృప్తి బహిరంగ నిరసనలుగా మారుతోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కోసం చిన్నారులే తరగతులు బహిష్కరించి ఆందోళనలకు దిగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీలోని ఓ గ్రామంలో 122 మంది విద్యార్థులు పాఠశాల కొత్త భవనం నిర్మించే వరకు తరగతుల్లోకి వెళ్లబోమని నిరసనకు దిగడం ఈ పరిస్థితికి నిదర్శనం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నా యి. యూపీలోని సముహీ భట్పుర్వా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతనెల 22న సాధారణంగా తరగతులు ప్రారంభం కావాల్సిన సమయానికి 122 మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లలేదు. చదువుకోవాల్సిన చిన్నారులే ఆ రోజు అధికారులకు ‘పాఠం’ చెప్పారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 2023లో పాఠశాల గోడ కూలి ఓ బాలిక తీవ్రంగా గాయపడినప్పటికీ భవనం మరమ్మతులు జరగలేదు. అప్పటి నుంచి కొత్త భవనం కోసం పిల్లలు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు.
పేద పిల్లలే చదువుతున్నందుకే…
విద్యా హక్కుల కార్యకర్త నాగసింహారావు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అడుగుతున్నవి పెద్ద పెద్ద సౌకర్యాలు కాదని అన్నారు. టీచర్లు, బెంచీలు, పాఠశాల భవనాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలే కావాలని కోరుతున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలే చదువుతున్నారని ఆయన గుర్తుచేశారు. పేద పిల్లలు చదువుతున్నందుకే సర్కారు స్కూళ్లలో ఈ దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీచర్లు.. బెంచీలు లేవు
బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని సర్వోదయ ఇంటర్ కాలేజీలో జులై 28న విద్యార్థులు మరో నిరసన చేపట్టారు. 12వ తరగతి వరకు బోధించే ఈ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, బెంచీలు వంటి కనీస సదుపాయాలు కూడా లేవని విద్యా ర్థులు ఆరోపించారు. వేసవిలో విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయవని, తాగడానికి నీరు లేదని, బెంచీలు సరిపోక చాలామంది నేలపై కూర్చోవాల్సి వస్తోం దని 12వ తరగతి విద్యార్థి మనోజ్ తెలిపాడు.
మహారాష్ట్రలో టీచర్ల కొరత
మహారాష్ట్రలోని పార్లీ ప్రాంతంలోని వైద్యనాథ్ విద్యాలయంలో జులై 31న విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 1941లో స్థాపించిన ఈ పాఠశాలలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా ఉంది.
మధ్యాహ్న భోజనం నాసిరకం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత కూడా విద్యార్థుల నిరసనలకు కారణమవుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం బీహార్‌లోని సిముయారా గ్రామంలో జులై 28న సుమారు 50 మంది విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు నడిచి ఓ ఉన్నతాధికారిని కలిశారు. పాఠశాలలో పైపుల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో వంటకు ఉపయోగించే ముడి పదార్థాలను కూడా సరిగా శుభ్రం చేయలేకపోతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బియ్యం, పప్పులు, కూరగాయలు నాసిరకంగా ఉంటున్నాయని.. కొన్ని సందర్భాల్లో కూరగాయలు దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉంటున్నాయని వారు ఆరోపించారు.
మోడీ ప్రభుత్వానికి సవాలు
దేశ జనాభాలో 30 శాతానికి పైగా 18 ఏండ్లలోపు వారే ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో తమ హక్కుల కోసం గళమెత్తుతున్న పిల్లల్లో చాలామంది 2029 నాటికి ఓటు హక్కు పొందే వయసుకు చేరుకుంటారు. “ఈ పిల్లలే రేపటి ఓటర్లు. వారికి మంచి విద్య అందకపోతే దేశ అభివృద్ధి దెబ్బతింటుంది” అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యా హక్కుల కార్యకర్త ఆకాశ్ సర్కార్ అన్నారు.
చిన్నారుల ప్రశ్న.. ప్రభుత్వానికి పరీక్ష
దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా బయటకు రాలేదని బెంగళూరు విశ్వవిద్యాలయంలో చదువుతున్న సుజాత గౌడ అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సమూలంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. చిన్నారుల ప్రశ్నలు, ప్రభుత్వాలకు పరీక్షలే అని తేల్చిచెప్పారు.
ఒక్క టీచర్‌తోనే పాఠశాలలు
భారత్‌లో 1,00,843 పాఠశాలల్లో అన్ని తరగతులకూ కలిపి ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ఈ పాఠశాలల్లో సుమారు 29 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అలాగే, దేశంలో 5,663 ‘ఘోస్ట్ స్కూళ్లు’ (అంటే విద్యార్థులే లేని పాఠశాలలు) కూడా ఉన్నాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
భయం..భయం
ఎనిమిదేండ్ల ప్రియ తన పాఠశాల భవనం పరిస్థితిపై భయపడుతున్నామని తెలిపింది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళన చదువుపై దృష్టి పెట్టనివ్వడం లేదని చెప్పింది. అందుకే తామంతా నిరసనకు దిగామని వివరించింది. ఇది ఈ ఒక్క పాఠశాల సమస్య కాదు. మహారాష్ట్ర, బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జులై నుంచి విద్యార్థుల నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక్కడా అంకెల గారడీనే..
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. దేశంలో సుమారు 15 లక్షల పాఠశాలల్లో 24.7 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో దాదాపు 70 శాతం పాఠశాలలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. 2025-26 ప్రభుత్వ ఆడిట్ ప్రకారం విద్యకు యాక్సెస్ పెరిగిందనీ, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి మెరుగుపడి ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పాఠశాల మానేసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోందని అధికారిక సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని విద్యా హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. కొన్ని పాఠశాలలు పశువులను పెంచే ప్రదేశాలుగా కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి ఉందని ఉదాహరణలు చూపిస్తున్నారు.


