ప్లకార్డులతో నిరసన,
పోడియం ఎదుట బైటాయింపు
ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
బయట బీఆర్‌ఎస్, లోపల బీజేపీ…కుమ్మక్కు రాజకీయాలు: మంత్రి కోమటిరెడ్డి
ప్రశ్నోత్తరాలకు బ్రేక్… గందరగోళం మధ్య సభకు విరామం
తొలిసారి వందేమాతరం గీతాలపన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభలో మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత జనగణమన జాతీయగీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రశ్నోత్తరాల్లో భాగంగా కాంగ్రెస్ సభ్యులు అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన వెంటనే బీజేపీ సభ్యులు లేచి 22ఏ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోడియం ముందు బైటాయించారు. భూకబ్జాల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలగజేసుకుని ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని తెలిపారు. బీఏసీ లో చర్చించి 22ఏ పై మొదటి అంశంగా చర్చిద్దామని సూచించారు. ఇలా సభను అడ్డుకోవడం సరికాదు.. వెంటనే సీట్లలో కూర్చోవాలని కోరారు. బీఏసీ సమావేశంలో 22ఏ అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. 22ఏపై స్వల్ప కాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధమని హామీ ఇచ్చారు. నియమ నిబంధనలకు అనుగణంగా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సభ్యులకు సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ సర్దిచెప్పినా… బీజేపీ ఎమ్మెల్యేలు వినకుండా 22ఏపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. రాజకీయాల కోసం సభను అడ్డుకోవడం సరైంది కాదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని బయట బీఆర్‌ఎస్ సభ్యులు, లోపల బీజేపీ సభ్యులు సభను అడ్డుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరినా ఎందుకు చేయడంలేదని నిలదీశారు. సభను సజావుగా నడిపించేందుకు సభ్యులు సహకరించాలని సీపీఐ సభ్యులు కునంనేని సాంబశివరావు కోరారు. చివరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.
సభలో ఆ మూడు వార్షిక నివేదికలు
తన పరిధిలో ఉన్న మూడు అంశాలకు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. పీఎం స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా-పీఎం శ్రీ తెలంగాణ(2024-25), హైదరాబాద్ మెట్రో రైల్‌కు సంబంధించిన 2013 నుంచి వరసగా 2018 వరకు వార్షిక నివేదికలను కూడా సభ ముందుచ్చారు. తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్‌ఎస్) ఆడిట్ నివేదిక (2024-25)ను సభకు సమర్పించారు.
అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
రాష్ట్ర ప్రభుత్వం 22ఏపై సరిగ్గా స్పందించకపోవడానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు బయటికి వెళ్లిపోయారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది సభకు, తెలంగాణకు జరిగిన అవమానమని అన్నారు. తప్పు చేసే వారిని ఉపేక్షించొద్దని కోరారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను అవమానించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. భవిష్యత్తులో దుర్భాషలాడకుండా ఉండాలంటే ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు వచ్చి తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.
22ఏపై చర్చకు బీజేపీ పట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


