Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12 వరకు అసెంబ్లీ

12 వరకు అసెంబ్లీ

- Advertisement -

బీఏసీలో నిర్ణయం
అవసరమైతే మళ్లీ సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణపై ‌సోమవారం జరిగిన బీజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని బీఏసీలో ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష జరపాలని నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ అధ్యక్షతన జరిగిన శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎజెండా రూపొందించారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహరాల మంత్రి శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల హాజరయ్యారు. ఉదయం శాసనసభకు వెళ్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో 22ఏ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై స్వల్పకాలిక చర్చలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం 22ఏ నిషేధిత భూముల జాబితాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో 22 కీలకమైన అంశాలపై చర్చ జరిపేందుకు కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నిరోజులు సభ నిర్వహించినా సిద్ధమే : ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో పాటు మైనారిటీ అంశాలపైనా అసెంబ్లీలో చర్చలు జరపాలని ఎంఐఎం నేత అహ్మద్‌ బలాలా సైతం కోరారు. ఈ నేపథ్యంలో సభలో ఎన్నిరోజులైనా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాగా బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్​ఎస్.. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయనీ, అసెంబ్లీని కనీసం 20 నుంచి 30 రోజుల పాటు నడపాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ డిమాండ్ చేశారు.ఇదిలావుండగా శాసనమండలి బీఏసీ సైతం చైర్మెన్‌ ‌గుత్తా సుఖేందర్‌‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -