ఆహార ఉత్పత్తుల హెచ్చరిక లేబుళ్లపై 10 రోజుల్లో అఫిడవిట్ : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ముందు వైపు హెచ్చరిక లేబుళ్ళను ముద్రించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ) చేపట్టనున్న రెండు దశల విధానాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. స్పష్టమైన కాలపరిమితి అంటూ లేకపోతే రెండో దశ నిరవధిక కాలం వాయిదా పడే అవకాశం వుందని హెచ్చరించింది. ఆహార లేబుళ్ల గురించి పిల్లలు కూడా తెలుసుకునేందుకు సాయపడేలా పాఠశాలల్లో పోషకాహారం గురించి అవగాహన తీసుకువచ్చే కార్యక్రమాలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్రాన్ని కోర్టు కోరింది. ప్రతిపాదిత రెండు దశల విధానంలో ముందుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్ధాలు ఆందోళన కలిగించే స్థాయిలో వున్న అంటే అధికంగా కొవ్వు, చక్కెర, ఉప్పు వున్న ఆహార పదార్ధాలకు ఈ హెచ్చరికలు వర్తింప చేస్తారు. ఆ తర్వాత ఒకటి ఎక్కువగా వున్నా కూడా ఆ ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్ళు వేస్తారు. కొత్త లేబుళ్ళకు వినియోగదారులు అలవాటు పడేందుకు ఈ ప్రతిపాదిత విధానం కొంత సమయమిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తెలిపింది. ఆహార పరిశ్రమ కూడా తన ఉత్పత్తులను తిరిగి రూపకల్పన చేసుకునేందుకు గడువు వుంటుందని పేర్కొంది. పిల్లలు ముఖ్యంగా ఏం తినాలో తినకూడదో సరైన అవగాహన లేకుండా ఆహార ఎంపిక చేసుకునే అవకాశం వుందని బెంచ్ అంగీకరించింది. అందువల్ల పాఠశాల సిలబస్‌లో పోషకాహారం గురించి తప్పనిసరిగా అవగాహన, చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ప్యాకెట్ల లేబుళ్ళపై వున్న సమాచారాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో కూడా వారికి తెలియజెప్పాలని కోరింది.
కాలపరిమితిపై స్పష్టత ఉండాలి
- Advertisement -
- Advertisement -



