శాసనమండలిలో
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యవసాయ మోటార్లు, పంప్సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. వ్యవసాయ పంప్సెట్ల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా వెల్లడించిందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు దేశపతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్డీఎస్ఎస్ లో లేదని భట్టి విక్రమార్క వివరించారు. అంతకు ముందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఉదయ్ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ డిస్కమ్‌లు కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయని చెప్పారు. 2017 జూన్ 30 నాటికి 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీటరింగ్ పూర్తి చేయాలని, 2018 డిసెంబర్ 31 నాటికి వ్యవసాయ వినియోగదారులు మినహా నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని, 2019 డిసెంబర్ 31 నాటికి నెలకు 200 యూనిట్లకు పైగా వినియోగించే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నట్టు తెలిపారు. ఆ ఒప్పందంపై విద్యుత్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి. రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీ ఎ. గోపాల్‌రావు సంతకాలు చేశారని వివరించారు.
ఆర్డీఎస్ఎస్ లో వ్యవసాయ మీటర్ల నిబంధన లేదు
ఆర్డీఎస్ఎస్ పథకంలో వ్యవసాయ పంప్సెట్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఎక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను వినియోగించకుండా రాష్ట్రానికి గత ప్రభుత్వం నష్టం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏటికేడు పెరుగుతోందని, ప్రస్తుతం డిమాండ్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరిందని చెప్పారు. 15 వేల మెగావాట్ల సామర్థ్యానికి అనుగుణంగా గతంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థ, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లపై ప్రస్తుతం 19 వేల నుంచి 20 వేల మెగావాట్ల వరకు డిమాండ్‌ను తట్టుకోవాల్సి వస్తోందన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఆధునీకరించడంతోపాటు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ ద్వారా 60 శాతం గ్రాంట్ అందిస్తోందని, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



