ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
రాజకీయ లబ్ది కోసమే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ కుట్ర : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ – గోదావరిఖని
రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు చేస్తున్న రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 చారిత్రక సందర్భాన్ని అధికార, ఇతర రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా వక్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఢిల్లీ పాలకుల ఒత్తిడికి తలొగ్గి చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ విలీనం-వాస్తవాలు-వక్రీకరణలు’ అనే అంశంపై ఈ నెల 10 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రామిక భవన్‌లో నిర్వహించిన వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం రాజ్యంలో భాగమైన తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాట ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న విలీనం జరిగిందన్నారు. దీన్ని కేవలం విమోచన దినం లేదా విలీన దినం అంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు, రైతాంగం సాగించిన చారిత్రక పోరాటాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను విస్మరించి ఆర్ఎస్ఎస్, బీజేపీ దీనికి మతపరమైన రంగు పులుముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన మహిళ ఐలమ్మని అన్నారు. విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు పంటను స్వాధీనం చేసుకోవడానికి వస్తే కమ్యూనిస్టుల అండదండలతో ఎదిరించి తన పంటను కాపాడుకున్న ధీశాలి అని కొనియాడారు. చరిత్ర వక్రీకరణను తిప్పికొట్టి.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి వై.యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్యంరావు, మహేశ్వరి, రామాచారి, బిక్షపతి, గణేష్, చందాల శైలజ, బిక్షపతి, సీపల్లి రవీందర్ పాల్గొన్నారు.
సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణను తిప్పికొట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



