ఎమర్జెన్సీని తలపిస్తున్న శాసనసభ ప్రాంగణం : బీఆర్ఎస్ పక్షనేత మధుసూధనాచారి ఆవేదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యలను ప్రస్తావించే శాసనసభ, మండలిలో మార్షల్స్… బయట పోలీసులు వెరసి తెలంగాణ శాసనసభ ప్రాంగణం ఎమర్జెన్సీని తలపిస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ నేత ఎస్.మధుసూధనాచారి ఆరోపించారు. గురువారం మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు ఎల్.రమణ, దాసోజు శ్రవణ్, వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ మా నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకునేందుకు సభలో 40 మంది మార్షల్స్ ను మోహరించారని ఆన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పోలీసులు దాడులు చేశారో మా సభ్యులపైన కూడా అదే విధంగా నేడు దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవద్దు అని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చచ్చిపో అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్, చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యే ల పై కేసు పెట్టకుండా, నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలపై మూడు రోజుల తర్వాత కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కుట్ర అని ముఖ్యమంత్రి అనడం, దానికి సిట్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
తెలంగాణ కోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ ఇంట్లో ఉంటే చావు డప్పులు పంపడం మీ క్షుద్ర సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు. ఇన్ని సంవత్సరాల దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన చూడలేదని మండి పడ్డారు.కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్భందం విధించిన ప్రజల కిచ్చిన హామీలను ప్రజా క్షేత్రంలో నిలిదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో మార్షల్స్..బయట పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



