Saturday, September 12, 2026
E-PAPER
Homeజాతీయంబ్యాంకుల్ని కాపాడే సమ్మె

బ్యాంకుల్ని కాపాడే సమ్మె

- Advertisement -


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మెతో మొదలుపెట్టిన పోరాటం, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెగా, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెగా విస్తరించనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌‌బియు) పిలుపు మేరకు తొమ్మిది యూనియన్లకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. వారంలో ఐదు రోజుల పని, పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం ఉపసంహరణ, పెన్షన్ సవరణ వంటి తక్షణ డిమాండ్లతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇది కేవలం వేతనాలు, సెలవుల కోసం జరుగుతున్న పోరాటం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజల సేవకు కొనసాగించాలని, కొద్దిమంది కార్పొరేట్ సంస్థల లాభాలకు అప్పగించరాదన్న విధాన పరమైన డిమాండ్‌‌తో జరుగుతున్న ఆందోళన కావడం ముదావహం. సమ్మెలో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు, అధికార్లకు అభినందనలు. కోట్లాది మంది సామాన్యుల పొదుపులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాల చెల్లింపులు, రైతులు, చిన్న వ్యాపారులు, విద్యార్థుల రుణాలు అన్నీ ఈ బ్యాంకుల ద్వారానే నడుస్తున్నాయి. అందుకే బ్యాంకులు కేవలం వ్యాపార సంస్థలు కావు; దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, శాఖల మూసివేత, విలీనాలు, ప్రైవేటు మూలధనానికి ద్వారాలు తెరవడం ద్వారా పాలకులు బలహీనపరుస్తున్నారు. బ్యాంకులు విలీనమై పరిమాణంలో పెద్దవి కావచ్చు గానీ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మెరుగుపడతాయన్న గ్యారంటీ లేదు. శాఖలు తగ్గితే మారుమూల ప్రాంతాల ప్రజలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. సిబ్బంది కొరత సేవల నాణ్యతను దెబ్బతీస్తుంది. ఈ సమ్మెకు మరో పార్శ్వం.. కార్పొరేట్ రుణాల మాఫీ గణాంకాలు. 2015-16 నుంచి 2023-24 మధ్య దాదాపు రూ.12.3 లక్షల కోట్ల రుణాలు మాఫీ కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదున్నర సంవత్సరాల్లో రూ.6.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు స్వయంగా పార్లమెంటుకు సమాచారం ఇచ్చారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.18 లక్షల కోట్లకు పైగా బకాయిలు రద్దయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సామాన్యుడి రుణభారం మాత్రం ఎందుకు తగ్గడం లేదన్నది సమ్మెకారులు లేవనెత్తుతున్న సూటి ప్రశ్న. పెద్ద కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ వరాలు, సామాన్యుడికి మాత్రం కొద్దిపాటి ఆలస్యానికే జరిమానాలు, వసూళ్లకై జప్తులు. ఈ వైరుధ్యమే వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. నడమంతర సిరిగాళ్ల ఎగవేత రుణాల భారాన్ని అంతిమంగా ప్రజల పన్నుల సొమ్ముతోనే భర్తీ చేయాల్సి వస్తే, లాభాలు బడాబాబుల పరం కాగా నష్టాలు మాత్రం సమాజం మీద పడుతున్నాయి. ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులను నియమించడం తగదు. సరైన వేతనాలు, భద్రత లేని ఇలాంటి తాత్కాలిక కొలువులు యువతకు మేలు చేయవు సరికదా, దీర్ఘకాలంలో బ్యాంకింగ్ సేవల నాణ్యతనే దెబ్బతీస్తాయి. అదే సమయంలో ప్రైవేటు, కార్పొరేట్ రంగ అనుభవం ఉన్నవారిని బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులుగా నియమించడం, విదేశీ పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించడం వంటి ధోరణులు బ్యాంకుల మూలధనాన్ని క్రమంగా ప్రైవేటు చేతుల్లోకి మళ్లించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. యాభై ఏడేళ్ల క్రితం జరిగిన బ్యాంకుల జాతీయీకరణ బ్యాంకింగ్ సేవలను గ్రామాలకు చేర్చింది. వ్యవసాయ రుణాలు, చిన్న పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలకు ఊతమిచ్చింది. ఆ సేవా లక్ష్యాన్ని పక్కనపెట్టి, బ్యాంకులను కేవలం లాభార్జన సాధనాలుగా మార్చే ప్రయత్నం జరిగితే, అభివృద్ధి నమూనానే తలకిందులవుతుంది. అభివృద్ధి అంటే జిడిపి సంఖ్యలు పెరగడం మాత్రమే కాదు. రైతుకు, చిన్న వ్యాపారికి, విద్యార్థికి సకాలంలో రుణం అందడం, సామాన్యుడి పొదుపు సురక్షితంగా ఉండటం, ఉద్యోగికి గౌరవప్రదమైన పని పరిస్థితులు లభించడం కూడా అభివృద్ధి కొలమానాలే. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వల్ల సామాన్య ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. చెక్కుల క్లియరెన్స్, శాఖాపరమైన లావాదేవీలు ఆలస్యం కావచ్చు. అయితే దీర్ఘకాలంలో ఈ పోరాట ఫలితం సామాన్యులకే మేలు చేస్తుందని గుర్తించాలి. ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల విస్తరణ, పారదర్శకమైన రుణ విధానం, కార్పొరేట్‌ ‌గద్దలపై కఠిన చర్యలు.. ఇవే సరైన బ్యాంకింగ్‌ సంస్కరణలు. ప్రజల సొమ్మును కార్పొరేట్ ప్రయోజనాలకు అప్పగించే విధానాలను నిలువరించే కర్తవ్యం నేటి పౌర సమాజపై ఎంతైనా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజల కోసమే, తప్ప కొద్దిమంది కార్పొరేట్ల లాభార్జనల కోసం కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -