ఐదేండ్ల్లలో 313 బిలియనీర్లకు చేరొచ్చు
ప్రస్తుతం 207 మంది సంపన్నులు
నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ విడుదల
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో సామాన్యుల ఆదాయాలు హరించుకుపోతుంటే.. మరోవైపు అపర కోటీశ్వరులు భారీగా పెరుగుతున్నారు. ప్రపంచవ్యా ప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వడ్డీరేట్ల పెంపు భయాలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు అమాంత పెరుగుతున్నారని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని బిలియనీర్ల సంఖ్య రాబోయే ఐదేండ్లలో 51 శాతం పెరిగి 313కు చేరుకోనుంది. 2026 ప్రారంభంలో 207గా ఉన్న ఈ సంఖ్య.. 2031 నాటికి భారీగా పెరగనుంది. ఈ వృద్ధి రేటు ప్రపంచ ఆర్థిక శక్తులైన చైనా (20 శాతం), అమెరికా (12 శాతం) కంటే ఎంతో ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం బిలియనీర్లే కాకుండా సుమారు రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య కూడా మన దేశంలో 25,217కు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్లలో భారత్ వాటా 6.7 శాతంగా ఉండగా.. 2031 నాటికి ఇది 8 శాతానికి పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 914 మంది బిలియనీర్లతో అమెరికా, 485 మందితో చైనా మొదటి రెండు స్థానాల్లో ఉండగా, 207 మందితో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచింది.
గడిచిన ఐదేండ్లలో సగటున ప్రతి రోజూ 89 మంది అల్ట్రారిచ్ జాబితాలో చేరారు. సాధారణంగా 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250కోట్లు) కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వారిని అల్ట్రా రిచ్‌గా పిలుస్తారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఈ అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య 5.51లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం 7,13,626కు పెరిగింది. కాగా.. భారత్‌లో ప్రస్తుతం 19,877 అల్ట్రా రిచ్ వ్యక్తులు ఉండగా.. వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య 25,217కు చేరనుంది. ఈ జాబితాలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది.
ధనవంతులు తమ సంపదను కేంద్రీకరించడానికి రియల్ ఎస్టేట్‌ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రతి అత్యంత ధనవంతుడు సగటున 3.7 నివాసాలను కలిగి ఉన్నాడు. వారి మొత్తం సంపదలో 21 శాతం వాటా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. దేశంలో ఒకవైపు బిలియనీర్ల సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు సామాన్యుడి ఆదాయాలు ద్రవ్యోల్బణం దెబ్బకు కరిగిపోతున్నాయి. నివాస స్థలాల ధరలు పెరగడం వల్ల ప్రధాన నగరాల్లో సాధారణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. దేశ వృద్ధి రేటు గణాంకాల్లో కనిపిస్తున్నప్పటికీ దాని ఫలాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవ్వడం వల్ల సమాజంలో ఆర్థిక అంతరాలు మరింత పెరుగుతున్నాయని అనేక రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
కుబేర భారతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



