పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
అమ్మమ్మల నాయనమ్మల లెక్క
పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
తాతల తండ్రుల గుండెల మీద ఆడిన పిల్ల
అత్తింట ఊడిగానికి తయారయ్యింది
పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
నట్టింట లచ్చిందేవి లెక్క తిరుగాడిన పిల్ల
దిష్టి బొమ్మలా కొంగుముడేసుకు ఎల్లి పోవాలంట
పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
సదువుల రాణి సంపెంగ మొగ్గ
తట్టా బుట్టా సర్దుకుని సాగిపోవాలట
పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
సిరుసిరు అడుగులేత్తా
సిరిసిరి మువ్వల్లే నవ్వే నా కంటిపాప
లోకంనుంచీ కనుమరుగయ్యేదాకా
ఆడనే వుండాలంట
పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
సెమ్మా సెక్కలు సారడేసి మొగ్గలు
అట్ల తద్దెలు సంకురేతిరి ముగ్గులు
నిన్నటి దాకా అన్నింటా ఆ పిల్లే
ఆ పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
ఉగ్గిన్నె ఉయ్యాల
రెండు జళ్లు పట్టు పరికిణీలు
అమ్మాడి అమ్మ కూచి
ఆ పిల్లప్పుడే పెళ్లీడు కొచ్చింది
అత్తింట ఆ పనీ ఈ పనని
దినాము సతాయించొద్దని అడిగిరావాలి
చిట్టి తల్లి తల్లడిల్లిపోద్ది
వంటల్ల వంకలెతకమాకండని
బతిమాలుకోవాలి
అరచేయిన పెట్టుకు పెంచిన కూన కందిపోద్ది
రాజాన్ని ఏలడం నేర్సినా గానీ
మెట్టినింట మసలడం కొత్తగా వుంటదని
కాస్త ఓపిక పట్టండనీ ఇడమర్చి సెప్పాలి
పసిడి పసిపాప కంట కన్నీరు నిండద్ది
సుట్టాల పక్కాల కలుపుగోలు తెలిసిన తల్లే అయినా
కొత్త కోడలుగా తడబడుద్దని ఇవరించి రావాలి
తల్లి ఏరుని ఇడిచిన పిల్ల
చిగురాకు లెక్క వణికిపోద్ది
పిల్లని గారంగా సూసుకునే
మారాజునెతికి తేవాలి
పిల్ల పెళ్లీడు కొచ్చింది…
అవునూ
నా పిల్లప్పుడే పెళ్లీడు కెందుకొచ్చింది!?
అసలీ ‘ఆడ’పిల్ల పెళ్లీడు కెందుకొచ్చింది!?
పుట్టినకాడ తీసేత లెక్క మారమని
సొచ్చిన కాడ కూడిక లెక్క కలిసిపొమ్మని
తీసేత కూడికల నడుమ
ఆడోళ్ళ ఈడోళ్ళ ప్రేమల్ని గునించుకుంటూ
భాగారించుకుంటూ నడవమని
ఏడడుగుల నడక కొనసాగించమని
ఆడబిడ్డకే ఉగ్గెందుకు పోయాలి!?
‘ఆడ’పిల్లకే పెళ్లీడు ఎందుకు రావాలి!?
– సుధా మురళి