రాజస్తాన్‌లో సీపీఐ(ఎం) చారిత్రాత్మక విజయం
నోఖా మున్సిపాలిటీ కైవసం 45 స్థానాలకు 29 స్థానాల్లో గెలుపు బీజేపీకి 13..
స్వతంత్రులకు మూడు స్థానాలు కమలం కోటను
బద్దలు కొట్టిన వామపక్షం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఎడారిలో ఎర్రజెండా రెపరెపలాడింది. చరిత్రలోనే తొలిసారిగా రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఘన విజయం సాధించింది. బికనీర్ జిల్లా నోఖా నగరపాలిక (మున్సిపాలిటీ)లో మొత్తం 45 స్థానాలకు గాను 29 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే తొలి మున్సిపల్ కౌన్సిల్‌ను ఆ పార్టీ ఒంటరిగా ఏర్పాటు చేసింది. ఇక్కడ అనేక వార్డులలో పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 21వ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి నీలూ రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) ముందుండి పోరాటాలు చేయడంతో ప్రజల మద్దతును గెలుచుకోగలిగింది.ఇక బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా, మిగిలిన మూడు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ వివరాల ప్రకారం… శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్, ఝున్‌ఝును, సికార్, ఉదయ్‌పూర్ వంటి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) 40 మున్సిపల్ స్థానాలను గెలుచుకుంది. జోధ్‌పూర్ కార్పొరేషన్ వార్డులోనూ విజయం సాధించింది. సికార్‌లోని దోడ్, లోసల్, పల్సానా నగరపాలికలో సీపీఐ(ఎం) అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. అలాగే గంగానగర్, సూరజ్‌గఢ్, హనుమాన్‌గఢ్, ఝున్ ఝును జిల్లాల్లో ఒక్కో వార్డులోనూ వారు విజయం సాధించారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ ప్రదర్శించిన తీరు, రాష్ట్రంలో దాని సంస్థాగత బలం, ఎన్నికల అవకాశాలపై అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏండ్లుగా ఎన్‌సీపీ, బీజేపీ మధ్య పాలన
నోఖా మున్సిపాల్టీ ఎన్నికల ఫలితంతో సీపీఐ(ఎం) ఒక కీలక రాజకీయ ముంద డుగుగా నిలిచింది. గతంలో ఈ మున్సి పాలిటీని ఏండ్లుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), బీజేపీలు వంతుల వారీగా అధి కారాన్ని చేపట్టే సంప్రదాయానికి ఇది తెరదించింది. దీంతో నోఖా మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది.
వామపక్ష రాజకీయాలకు ఊతం
నోఖా మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) సాధించిన ఈ విజయంతో రాజస్తాన్‌లో వామపక్ష రాజకీయాలకు కొత్త ఉత్సాహం లభించింది. స్థానిక ప్రజా సమస్యలపై పార్టీ నిర్వహిస్తున్న పోరాటాలకు ప్రజల మద్దతు లభించడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందనే చర్చ జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’బ్లాక్ లో భాగంగా పోటీ చేసిన సీపీఐ(ఎం) అభ్యర్థి అమ్రారామ్ సికార్ నియోజకవర్గంలో విజయం సాధించారు. నోఖాలో సీపీఐ(ఎం) విజయం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ ప్రజలకు అభినందనలు తెలిపాయి.



