Thursday, September 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితాపీ ధర్మారావు జయంతి : తెలుగు మాధ్యమాల దినోత్సవం

తాపీ ధర్మారావు జయంతి : తెలుగు మాధ్యమాల దినోత్సవం

- Advertisement -

‘‘దేవుడి గది వైపు కాళ్లు పెట్టి చదువుకుంటు న్నావేమిట్రా? తియ్-కాళ్లు తీసి ఇటు వైపు పెట్టుకో’’అని గద్దించింది ఓ తల్లి కొడుకును. పాఠం చదువుకుంటున్న కుర్రవాడు గబుక్కున కాళ్లు దగ్గరికి లాకున్నాడు. కానీ, వెంటనే తనకు గుర్తొచ్చిన పద్యం చదివి వినిపించాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు … ఎందెందు వెదికినా అందందే గలడు’’ -అని అంటారు కదమ్మా? దేవుడు లేని స్థలమంటూ లేదని చెపుతున్నప్పుడు.. మరి నేను కాళ్లు ఎక్కడ పెట్టుకోవాలీ?’’ అని అమాయకంగా అడిగాడు. అంతేకాదు, ఆ కుర్రవాడు ఒక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తాడు. అతని గొంతులో హేతువాదం బలంగా వినిపించింది. ఆ కుర్రవాడి పేరు తాపీ ధర్మారావు. వివేచన, వివేకం గల పిల్లలు సహజంగానే హేతువాదులవుతారు. వారి ఆలోచనలు సూటిగా బలంగా ఉంటాయి. అహేతుకమైన అంశాల్ని నిర్ద్వందంగా తోసి పుచ్చుతారు. ఆ రోజుల్లో పాఠశాల విద్యార్థులు కూడా పంచెలు కట్టుకునేవారు. అలాగే, తాపీ ధర్మారావు పంచెకట్టుకుని స్కూలుకు వెళ్లాడు. అది చూసి, పిల్లలంతా నవ్వారు. కారణమేమంటే అందరూ గోచి ఎడమ చేతి వైపు పెట్టుకుంటే ఈ అబ్బాయి మాత్రం కుడిచేతి వైపు పెట్టుకున్నాడు. ఆ విషయం ఉపాధ్యాయుడి దృష్టికి వెళ్లింది. ఆయన ‘‘పంచె సరిగా కట్టుకుని రావాలని’’ హెచ్చరించాడు. కానీ, ధర్మారావు అందుకు సమ్మతించలేదు. తను సరిగానే కట్టుకున్నానని గోచి ఎటువైపు పెట్టుకున్నా ఒక్కటేనని, ఇక నుంచి తను రోజూ ఇలాగే కట్టుకుంటానని చెప్పాడు. అందరూ అదే పాత ఒరవడిలో, ఒకే రకంగా ఆలోచించాలనే పద్ధతికి తాపీ ధర్మారావు వ్యతిరేకం. అలా ఎందుకూ? ఇలా మాత్రం ఎందుకు చేయగూడదూ? అని తన తర్కాన్ని ఉపయోగిస్తూ ఉండేవాడు. అంతేకాదు, జీవితాంతం ఆయన పంచె కట్టుకున్నా గోచి మాత్రం కుడి చేతి వైపే పెట్టుకునేవాడు. అలాగే, నవయువకుడిగా ఎఫ్.ఎ (ఇంటర్ స్థాయి) పరీక్షలకు వెళుతున్నప్పుడు మరొక సంఘటన జరిగింది.

ఎదురుగా నూనె కావడి ఎదురొచ్చింది. అలా రావడం అశుభమని, అగి- పొమ్మని చాలామంది వారించారు. ధర్మారావు వినలేదు. ఆగిపోలేదు. వెళ్లి, పరీక్షలు రాసి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడ యాడు. అలా అంధ విశ్వాసం అడ్డు తొలగించుకున్నాడు. బాల్యంలోనూ, తొలి యవ్వనదశలోనూ ధర్మారావు ఎవరినో చూసి, నేర్చుకున్నది ఏమీ లేదు. ఇంట్లో గానీ, చుట్టుపక్కల గానీ ఆ వాతావరణమే లేదు. అయినా, బాల్యంలోనే అతనికి తర్కం సహజంగా అబ్బింది. అందుకే ప్రముఖ హేతువాదిగా ఎదగగలిగాడు. తెలుగు ప్రజల మొద్దు నిదురను వదిలించే ‘కాగడా’ను ఎత్తి పట్టుకున్నాడు. భక్తుల మూఢ నమ్మకాల్ని బద్దలు కొట్టాడు.. ‘జనవాణి’ని వినిపించాడు. కాగడా, జనవాణి, సమదర్శిని, కొండెగాడు వంటివన్నీ ఆయన పత్రికా రచయితగా ఎదిగిన తర్వాత, ప్రారంభించి, నిర్వహించిన తెలుగు పత్రికలు. బహుముఖాలుగా విలసిల్లిన ఆయన ప్రతిభకు ఇదొక పార్శ్వం. ‘‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకూ?’’, ‘‘ పెండ్లి – దాని పుట్టు పూర్వోత్తరాలు’’, ‘‘ఇనుప కచ్చడాలు’’ -వంటి తాపీ ధర్మారావు రచనలు చదవని తెలుగు పాఠకులు బహుశా ఉండి ఉండరు. ‘పాత పాళీ’ ‘కొత్త పాళీ’ ‘ఆలిండియా అడుక్కుతినే వాళ్ల మహాసభ’ వంటి ప్రసిద్ధ గ్రంథాలు – ఆయన భాషా పాండిత్యాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూ ఉంటే, అవే- మరొకవైపు సామాజిక స్థితిగతులపై తీవ్రమైన అస్త్రాలుగా పనిచేశాయి.

‘‘ఆంధ్రులకొక మనవి’’- అంటూ 1911లో గ్రంథరచనను ప్రారంభించిన తాపీ, ‘‘సాహిత్య మొర్మొరాలు’’ ‘‘రాలూ రప్పలు’’ ‘‘మబ్బు తెరలు’’ ‘‘విజయ విలాస – వ్యాఖ్య’’ ‘‘నల్లిపై కారుణం’’ ‘‘అన్నాకెరీనా” ‘‘ఆంధ్ర తేజము’’ వంటి దాదాపు 22 ప్రసిద్ధ గ్రంథాల్ని ఆయన తెలుగు పాఠకులకు అందించారు. తరాలు మారుతున్నాయి. కానీ, తాపీ ధర్మారావు రచనలు పునర్ముద్రణలు పొందుతూ, కొత్త తరానికి అందుతూనే ఉన్నాయి. ఇంటింటా జ్ఞాన దీపాలు వెలిగిస్తూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటితరం వారెవరైనా వాటి గూర్చి తెలుసుకోని వారుంటే, వారంతా వెతుక్కుని తప్పక చదవాల్సిన పుస్తకాలు అవన్నీ – తాపీ ధర్మారావు 1887 సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న గంజాం జిల్లా బరంపురం (బెర్హంపూర్)లో జన్మించాడు. అసలు సలు వీరి పూర్వీకుల ఇంటి పేరు బండారు. కానీ, పూర్వీకుల్లో ఒకరైన లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగిగా పనిచేసి, తిరిగి వచ్చాక తాపీ పనితో ప్రాచుర్యం పొందాడు. తాపీ లక్ష్మయ్యగా అందరూ వ్యవహరించేవారు. అలా వారి ఇంటిపేరు బండారు మరుగున పడిపోయి, తాపీగా స్థిరపడింది. ఆ లక్ష్మన్న వంశంలోని అప్పన్న వైద్యు డయ్యాడు.

అలా డా.అప్పన్న – నరసమ్మ దంపతులకు గల ఐదుగురు సంతానంలో తాపీ ధర్మారావు రెండవవాడయ్యాడు. ధర్మారావు ప్రాథమిక విద్య విజయనగరం రిప్పన్ స్కూలులో మెట్రిక్యులేషన్ విజయవాడలో, ఎఫ్. ఎ. పర్లాకిమిడిలో పూర్తిచేశాడు. గిడుగు రామమూర్తి ఈయనకు పర్లాకిమిడిలో చరిత్ర బోధించేవారు. ఆ కాలంలో అక్కడే విద్యార్థిగా ఉన్న ప్పుడు ఒకసారి గురజాడను దూరం నుంచి చూడగలిగారట! అంతే- ఆ తర్వాత మదరాసు వెళ్లి, అక్కడి పచ్చయప్ప కళాశాలలో చేరారు. చిన్నప్పటి నుంచి ధర్మారావుకు గణితం అంటే అభిరుచి ఎక్కువ. అందువల్ల, చదువు పూర్తిచేసుకుని, కల్లికోట రాజా వారి కళాశాలలో గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. ధర్మారావు పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో బలశాలిగా ప్రసిద్ధుడయిన కోడి రామ్మూర్తి నాయుడు ఈయనకు గేమ్స్ టీచర్‌గా ఉండేవాడు. మెట్రిక్యులేషన్ పూర్తికాక మునుపే, బంధువుల అమ్మాయి అన్నపూర్ణతో ధర్మారావు వివాహం జరిగింది. ఆ తరువాత కుటుంబ ఆర్థికస్థితి సరిగాలేక మధ్యలో చదువు మానేసి, కొంత కొంతకాలం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో మదరాసు పచ్చయప్ప కళాశాలలో చదువుకుని బి.ఎ. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడ బి.ఎ. విద్యార్థిగా ఉన్నప్పుడే, తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని శిలప్పదికారం, మణిమేఖలై, కంబ రామాయణం వంటి గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. కాలక్రమంలో ప్రసిద్ధ పత్రికా రచయితగా ఎదిగిన తర్వాత, పత్రికా సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు ఈయనకు శిష్యుడయ్యాడు. ఆర్థిక స్తోమత కొంత స్థిరపడ్డాక, తాపీ ధర్మారావు ఇంకా కొన్ని ఇతర కార్యక్రమాలపైకి దృష్టి మరల్చాడు. మిత్రులతో కలిసి 1910లో బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. మరికొందరితో కలిసి, నిరంతరం అభ్యుదయ వాదం గురించి, ప్రజా సమస్యల గురించి చర్చిస్తూ ఉండే వాడు. కొంతకాలం చిత్రకళను అభ్యసించిన ధర్మారావు, మరోవైపు నాటక రచన, నిర్వహణ, వేషధారణ వంటి పనులన్నీ చేస్తుండేవాడు. కొద్దిపాటి మేజిక్ నేర్చుకుని, ప్రదర్శనలిస్తూ ఉండేవాడు.

రచయితగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన ధర్మారావు మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. 1937లో ‘మోహినీరు క్మాంగద’కు సంభాషణలు రాయడం ప్రారంభించి, 1962లో ‘భీష్మ’ చిత్రానికి సంభాషణలు రాసేవరకు నిరాఘాటంగా కొనసాగింది. మధ్యలో ప్రసిద్ధ తెలుగు చలన చిత్రాలు ‘మాలపిల్ల’ ‘రైతుబిడ్డ’ లాంటివి ఆయన ఖ్యాతిని ఇనుమడింపచేశాయి.. చేమకూర వేంకటకవి ‘విజయ విలాసం’ కావ్యానికి రాసిన వ్యాఖ్యానం పండితుల ప్రశంసలు అందుకుంది. గుడిపాటి వేంకటాచలం తాపీ వారిని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు. ఆ పేరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు ఈ తాతాజీయే దానికి తొలి అధ్యక్షులు! 1936లో తన ‘జనవాణి’ పత్రికలో తొలిసారి వాడుక భాషను ప్రవేశపెట్టిన ఘనత తాపీవారిదే!
85 సంవత్సరాల అవిశ్రాంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తాపీ ధర్మారావు 1973 మే8న శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయారు.. ప్రసిద్ధ సినీ దర్శకులు తాపీ చాణక్య వీరి కుమారులే! 1926లో ‘ఆంధ్ర విశారద’ బిరుదును 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నీ తాతాజీ స్వీకరించారు. నిజానికి ఆయనకు ఉన్న శక్తి సామర్థ్యాలను కొలవడానికి, తెలుగు వారికి ఆయన చేసిన మేలును అంచనా వేయడానికి ఏ బిరుదులూ, సత్కారాలు సరిపోవు.

తాపీ ధర్మారావు జీవితం- సాహిత్యాలపై సమగ్రమైన పరిశోధన చేసి, డాక్టరేట్ సాధించిన అరసం మిత్రులు డా. ఏటుకూరి ప్రసాద్ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. సమగ్రమైన సమాచారం కోసం అభిరుచి ఉన్నవారు దాన్ని తిరిగేయవచ్చు- ఈ రోజు ఎన్నో తెలుగు దిన, వార, మాస పత్రికలు అచ్చవుతున్నాయి. డిజిటల్ మేగజైన్లు వెలువడుతున్నాయి. వీటన్నింటిలో ఉపయోగించబడుతున్నది వ్యవహారిక భాషే! జన సామాన్యానికి సులభంగా అర్థమయ్యే జనభాషను పత్రికా రచనలో ప్రవేశపెట్టి, తాపీ ధర్మారావు – తాతాజీ ప్రాచుర్యం కల్పించి నందువల్ల కదా మనం ఇంత విస్తృతంగా తెలుగులో సమాచారం పంచుకోగలుగుతున్నాం? ఇది మామూలు విషయం కాదు-ఆ విషయం గుర్తుంచుకోవడానికే తాపీ ధర్మారావు జయంతి 19 సెప్టెంబర్‌ను ‘తెలుగు మాధ్యమాల దినోత్సవం’గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం! చాలామంది జీవితంలో చాలా కష్టాలు పడి పైకొస్తారు. కష్టపడి చదువుకుంటారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. కుటుంబాన్ని పోషించుకుంటూ సాదాసీదాగా బతుకులు వెళ్లదీస్తారు. సమాజంలో అధిక సంఖ్యాకులు ఇలాగే ఉంటారు. అయితే, అలాంటి జీవితాలు మరొకరికి స్ఫూర్తిదాయకం కావు. కానీ, అతికొద్దిమంది తాతాజీ లాంటి వారు, వారి వ్యక్తిగత సమస్యలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలూ – అన్నింటినీ తట్టుకుని నిలబడుతూ – తమను తాము సమాజానికి అర్పిం చుకుంటారు.

ఏదో ఒక ప్రయోజనకరమైన రంగం అహరహం కృషి చేస్తారు. తాము జీవిస్తున్న కాలానికేకాదు, భవిష్యత్‌ కాలాలకు కూడా ఆదర్శప్రాయులవుతారు.. తమ సమకాలీనుల్ని చైతన్య పరచడమేకాదు, రాబోయే తరాల్ని కూడా ప్రభావితం చేస్తారు. చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, ఉపాధ్యాయుడు, హేతువాది, సాహితీవేత్త అయిన తాతాజీ – మన తాపీ ధర్మారావు మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడే!
​ -వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -