నైజాం వ్యతిరేక పోరాటానికి మూలం తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమమే
ఈ పోరాటాన్ని మత ఘర్షణగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలకు విరుద్ధం :
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా నకిరేకల్‌లో సెమినార్
నవతెలంగాణ -
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/నకిరేకల్
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 ఘట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే నైజాం పాలన వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన బలమని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్లగొడ జిల్లా నకిరేకల్ పట్టణంలో ‘తెలంగాణ విలీనం–వాస్తవాలు, వక్రీకరణలు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ వరకు సైనిక చర్య జరగకపోవడానికి గల కారణాలను చరిత్రలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ పోలో ఐదు రోజుల్లో ముగిసిన ఘటనను మాత్రమే ముందుకు తెచ్చి, అంతకుముందు సాగిన ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ పోరాటాల పాత్రను విస్మరించడం సరికాదన్నారు. నైజాం పాలనలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, పన్నులు, బలవంతపు వసూళ్లకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడిందని గుర్తు చేశారు. సాగు భూములపై హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయని, పలు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ గ్రామ పరిపాలన వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పారు. చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లా ఖాన్, బందగీ తదితరుల త్యాగాలను గుర్తించాలన్నారు.
మత ఘర్షణగా చిత్రీకరించడం సరికాదు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని రాఘవులు అన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటంలో అన్ని కులాలు, మతాల ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. బైరాన్‌పల్లి అమరుల జాబితాను పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతుందన్నారు.
మళ్లీ ముందుకొస్తున్న భూ సమస్యలు
దశాబ్దాల తర్వాత భూ సమస్యలు కొత్త రూపంలో ముందుకు వస్తున్నాయని రాఘవులు అన్నారు. భూ రికార్డుల సమస్యలు, పోడు భూముల వివాదాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు రైతుల ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, యువత తమ సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నిజాం లొంగిపోయిన
తర్వాత కూడా సైనిక చర్యలు
ఆపరేషన్ పోలో అనంతరం నిజాం లొంగిపోయినప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమంపై సైనిక చర్యలు కొనసాగాయని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట కాలంలో పేదలకు పంచిన భూములను తిరిగి భూస్వాముల ఆధీనంలోకి తీసుకెళ్లడంతోపాటు కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేయడమే సైనిక చర్యల లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు.
అమరవీరులకు నివాళులు
సెమినార్‌కు ముందు నకిరేకల్‌లో అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పించారు. బస్టాండ్ నుంచి ఫంక్షన్‌హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులు కర్రె పాపయ్య సతీమణి కర్రె రాములమ్మను, బోళ్ల జానకి రెడ్డి సతీమణి బోళ్ల లక్ష్మమ్మను, సామ చిన్న మల్లారెడ్డి సతీమణి సామ లక్ష్మమ్మను సన్మానించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ హాషం, నాయకులు జిట్టా నగేష్, ఔశెట్టి వెంకటయ్య, చింతపల్లి భయ్యన్న, పెంచర్ల సైదులు, బొజ్జ చిన్న వెంకులు, రాచకొండ వెంకన్న, చిలకాని మల్లయ్య, జిట్టా సరోజ, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, సీనియర్ నాయకులు, వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రజా పోరాటాల ఫలితాలను విస్మరిస్తున్నారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
ప్రజా పోరాటాల ఫలితాలను విస్మరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 విలీన ఘటనను రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ పేర్లతో ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నిజాం పాలనలో పటేళ్లు, పట్వారీలు, దొరలు, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు జరిగాయని చెప్పారు. దొడ్డి కొమురయ్య అమరత్వం, చిట్యాల ఐలమ్మ పోరాటం వంటి ఘటనలతో ఉద్యమం సాయుధ రైతాంగ పోరాటంగా మారిందన్నారు. 1946–1951 మధ్య సాగిన పోరాటంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామని, మూడు వేలకుపైగా గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పడ్డాయని వివరించారు.


