ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే ప్రాజెక్టులకు మరమ్మతులు
అక్టోబర్‌లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారానికి రిపేర్లు
రీ డిజైన్ పేరుతో రాష్ర్టానికి నష్టం చేశారు
ఏపీకి నీళ్లు వదులుతున్నామనేది అవాస్తవం
కృష్ణా, గోదావరిలో ఎక్కువనీళ్లు వాడుకుంది మనమే
లోటు వర్షపాతంతో సాగుపై ప్రభావం
రైతాంగానికి అండగా ఉంటాం : అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ర్టంలో ఎల్‌నినో కష్టాలకు కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలు కూడా తోడయ్యాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని వివరించారు. కేసీఆర్ స్వీయ ఇంజినీరింగ్ నైపుణ్యం ఫలితంగా కుంగింది ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదనీ, సుందిళ్ల, అన్నారం పునాదుల పటిష్టతపైనా సందేహాలు ఉన్నాయన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన నివేదికలో ఆ బరాజ్‌ల వద్ద గేట్లు తెరిచే ఉంచాలనీ, నీటిని నిల్వ చేయొద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతు పనుల్ని అక్టోబర్‌లో చేపడతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) కాళేశ్వరం రీడిజైన్ చేయకుండా, తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేపట్టి ఉంటే, ఎల్‌నినో కష్టాల నుంచి రాష్ర్టం బయటపడి ఉండేదని స్పష్టంచేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయనీ, ప్రాణహితలో మాత్రమే నీళ్లు ఉన్నాయని వివరించారు. కేసీఆర్ రీ డిజైన్ వల్ల తుమ్మిడిహట్టి నుంచి ఆ నీటిని ఎత్తిపోసుకొనే అవకాశాలను కోల్పోయామన్నారు. ‘ఎల్‌నినో ప్రభావాలు-పరిష్కార చర్యలు’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. చర్చను మంత్రి ప్రారంభించారు.
అనంతరం బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులు కూడా ఈ అంశంపై మాట్లాడారు. అనంతరం మంత్రి సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. ఎల్‌నినో కష్టాలు ఉన్నా, రాష్ర్ట ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు. ప్రస్తుత కరువు తీవ్రతకు పదేండ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు ప్రధాన కారణమని విమర్శించారు. ఎల్‌నినో ప్రమాదాన్ని ముందే పసిగట్టి, రాష్ర్ట రైతాంగాన్ని పంటల మార్పిడికి ప్రోత్సహించామన్నారు. ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై రైతు నేస్తం వేదికల ద్వారా ఖచ్చితమైన సమాచారం అందిస్తున్నామన్నారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిమట్టాలను గత ఏడాదితో పోలుస్తూ సభకు వివరించారు.జలాశయాల్లో కనిపించే మొత్తం నీరు సాగుకు అందుబాటులో ఉన్నట్టు కాదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని 44,034 చెరువుల్లో 40 శాతం పావు సామర్థ్యం కన్నా తక్కువగా నిండాయనీ, వాస్తవాలను ముందే ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నామని బీఆర్ఎస్ దుష్ర్పచారం చేస్తున్నదనీ, వాస్తవానికి కృష్ణా, గోదావరి జలాల్లో అధికభాగం తెలంగాణనే వాడుకుంటున్నదని వివరించారు. అలాగని ఆయా నదుల్లో రాష్ర్టానికి రావల్సిన నీటి వాటాలు వదులుకోబోమని స్పష్టంచేశారు. ప్రజల ప్రాణ భద్రతను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వినియోగించలేమని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్ధరణ చేపడతామన్నారు. పాలమూరు–రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్ఎస్ ప్రచారం అవాస్తవమనీ, కేవలం పంప్‌హౌస్‌లు నిర్మిస్తే ఎత్తిపోతల పథకం పూర్తయినట్టు కాదని స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డిలో కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, పునరావాస పనులు అసంపూర్తిగా ఉన్నాయనీ, చట్టబద్ధ అనుమతులు, మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసి ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంతో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం :
మంత్రి పొంగులేటి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 17 జిల్లాల్లో లోటువర్షపాతం ఏర్పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొన్ని మండలాల్లో ఒకేసారి క్లౌడ్ బరెస్ట్ జరిగినట్టు ఒక నెలలో పడాల్సిన వర్షం ఒక గంటలో కురిస్తే రికార్డులలో వర్షపాతం నమోదైనా వాస్తవానికి ఆ నీరు ప్రజలకు ఉపయోగపడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో రైతులు ఏ పంటలు సాగు చేయాలి, ఉన్న నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో మండలాలు, ప్రధాన గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించామని అన్నారు. క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నష్టనివారణ చర్యలు చేపట్టారని చెప్పారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారనీ, 33 లక్షల పంప్సెట్లు పనిచేస్తున్నాయని అన్నారు. పశుసంపదపైనా ప్రత్యేక దృష్టిసారించామని వివరించారు. కేంద్రం నుంచి అన్ని రంగాల్లో సహకారం అవసరమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఇదేనని అన్నారు.
తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి : రాష్ట్ర బీజేపీ నాయకులకు విజ్ఞప్తి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహనలేని
రీ ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేసిందనీ, ఫలితంగా రాష్ర్టంలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. బీజేపీ నేతలు రాష్ర్ట ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాకుండా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వరకు, పాలమూరు–రంగారెడ్డి నుంచి రాజీవ్ భీమా, జవహర్ నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి పథకాల స్థితిగతులను శాసనసభ ముందుంచారు.



