Saturday, September 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రతిపక్ష‍మే 
 ప్రభుత్వ టార్గెట్‌

ప్రతిపక్ష‍మే 
 ప్రభుత్వ టార్గెట్‌

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ఫార్ములా ఈ కార్‌ కేసులో కోర్టుకు హాజరు
అక్టోబర్‌ 30కి 
విచారణ వాయిదా

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
​కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడంపైనే దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేసులో శుక్రవారం ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు కూడా హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 30కి వాయిదా వేసింది.అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌, తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమమని చెప్పారున్న. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే రేసును నిర్వహించామని తెలిపారు. పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంపైనా విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కోర్టుకు హాజరయ్యానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని చెప్పారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ముందుకు ఎన్నికల మ్యానిఫెస్టోను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు.

​‘కేసీఆర్‌ కుటుంబం రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు కానీ, ఆ రూ.లక్ష కోట్లలో రూ.వెయ్యి కోట్లు మాకు ఇవ్వండి.. మిగిలిన రూ.99 వేల కోట్లతో రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చండి’ అని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ 67 ఎకరాల్లోనే ఉందని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పారని, గతంలో 1,000 ఎకరాల ఫామ్‌హౌస్‌ అని చేసిన ఆరోపణల్లో మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎర్రవల్లిలో 15–20 ఏండ్ల కిందట భూములు కొనుగోలు చేశారని, అప్పట్లో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండేదని తెలిపారు. రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులు కొల్లగొట్టారంటూ చేస్తున్న ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.

22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో జరుగుతున్న వ్యవహారంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇతర అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. కేటీఆర్‌ ‌న్యాయవాది కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేసులో కేటీఆర్‌ వ్యక్తిగత హాజరు తప్పనిసరి కాకపోయినా కోర్టు గౌరవంతో స్వయంగా ఆయన హాజరైనట్టు తెలిపారు. కాగా, కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కంపెనీ ప్రతినిధులకు ఇప్పటివరకు సమన్లు అందలేదు. వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమన్లు జారీ చేయాలని ప్రాసిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ నిర్వహణీయతపై గురువారం కోర్టు రిటర్న్‌ చేయగా, శుక్రవారం మళ్లీ సమర్పించారు. కంపెనీ ప్రతినిధులకు ఈ-మెయిల్‌ ద్వారా సమన్లు పంపేందుకు కోర్టు అనుమతిస్తుందా, లేక ప్రత్యక్షంగా సమన్లు ఎలా అందజేయాలన్న దానిపై తదుపరి నిర్ణయం వెలువడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -