Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిలీన ఘట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు

విలీన ఘట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు

- Advertisement -

నిజాం పాలనను గొప్పగా చూపించడం 
అమరులను అవమానించడమే
ఆ పోరాట స్ఫూర్తితో రైతు సమస్యలపై పోరాటం
అఖిల భారత రైతు సంఘం మహాసభలో 
ప్రత్యేక కార్యాచరణ : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం సరికాదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆపరేషన్‌ పోలో’ వల్లే హైదరాబాద్‌ సంస్థానం విలీనమైందని కొందరు చెబుతున్నారని, అయితే అంతకుముందే తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం నిజాం పాలనను తీవ్రంగా బలహీనపరిచిందని చెప్పారు. ప్రజా పోరాటం కారణంగా నిజాం పాలన దాదాపు సాగిలపడిన పరిస్థితుల్లో భారత సైన్యం ఐదు రోజుల్లో హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకుందని వివరించారు. ​నిజాం ఫ్యూడల్‌ ప్రభువు మాత్రమేనని, ఆయనను మత ప్రాతిపదికన చూడటం సరికాదన్నారు. దేశంలోని వివిధ సంస్థానాల్లోని పాలకులు ఏ మతానికి చెందిన వారైనా ఫ్యూడల్‌ వ్యవస్థను, జమీందారీ విధానాన్ని కాపాడుతూ రైతాంగాన్ని దోపిడీ చేశారని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిజాం పాలనను గొప్పగా చూపించే ప్రయత్నాలు చేయడం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను అవమానించడమేనన్నారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్‌ పాత్ర లేదని స్పష్టం చేశారు. కానీ ఐలమ్మ, బంధగి, సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన సుమారు నాలుగు వేల మంది యోధులను తమవారీగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కుల, మత, భాషా భేదాలకు అతీతంగా సాగిన పోరాటాన్ని హిందువులు–ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించడం కూడా సరికాదన్నారు.

నేటికీ కొనసాగుతున్న రైతు సమస్యలు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందుకు తెచ్చిన భూమి, కూలీ, సామాజిక న్యాయం, సాగునీరు, అభివృద్ధి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయని బీవీ రాఘవులు అన్నారు. భూముల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.​ ధరణి సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరించాలని కోరారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, గ్రామసభల్లో భూ సమస్యలను ప్రజల ముందుంచి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రైతుల సమస్యలపై ఉద్యమాలను కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. నవంబర్‌లో నల్లగొండలో నిర్వహించనున్న అఖిలభారత రైతు మహాసభలో రైతు సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్న వెంకులు, రాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -