ప్రజల చెల్లింపులపై కొత్త భారానికి రంగం సిద్ధం
మోడీ సర్కారు డిజిటల్ మోడల్‌కు ఇదేనా కొత్త దిశ?
డిజిటల్ ఇండియా అంటూ కేంద్రం ప్రచారం
ఎండీఆర్ పేరుతో వినియోగదారులపై పరోక్ష వడ్డన!
కేంద్రం నిర్ణయంపై ఆర్థిక నిపుణులు విస్మయం
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా.. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ.. ఆర్థిక సాధికారత అంటూ ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు యూపీఐ వ్యవస్థలో ఛార్జీల చర్చను తెరపైకి తెచ్చింది. ప్రజల రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిన యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే నిర్ణయం.. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలకు ఉచితంగా, సులభంగా అందుబాటులో ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో.. నిర్వహణ ఖర్చుల పేరుతో కొత్త ఆర్థిక నమూనాను తీసుకురావడం ఎందుకు? ప్రజలపై పరోక్ష భారం పడనుందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. కేంద్రం తాజా నిర్ణయంపై ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘నాలుగు శాతమే’ అంటూ ప్రభావాన్ని తగ్గించి చూపే ప్రయత్నం
రూ.2,000లోపు లావాదేవీలు 96 శాతం ఉన్నాయని, కేవలం 4 శాతం వ్యాపారి లావాదేవీలకే ఎండీఆర్ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది. అయితే లావాదేవీల సంఖ్యను మాత్రమే చూపిస్తూ సమస్యను చిన్నదిగా చూపడం సరైన విధానం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొత్తం వ్యాపారి లావాదేవీల విలువలో 67 శాతం రూ.2,000కు మించిన లావాదేవీల నుంచే వస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వైద్య ఖర్చులు, పాఠశాల ఫీజులు, ఇంటి అద్దెలు, నెలవారీ సరుకులు, మొబైల్ ఫోన్ కొనుగోళ్లు వంటి సాధారణ అవసరాల్లోనూ రూ.2,000కు మించిన చెల్లింపులు ఉంటాయి. అందువల్ల ఎండీఆర్ ప్రభావం కొద్దిమంది సంపన్నులకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదని వారు చెప్తున్నారు.
వ్యాపారుల ఖర్చులు..
ప్రజలపై పరోక్ష భారం?
ఎండీఆర్ ఛార్జీలను వినియోగదారులపై మోపకూడదని ప్రభుత్వం చేప్తోంది. అయితే వ్యాపారుల ఖర్చులు పెరిగినప్పుడు వాటిని ఇతర మార్గాల్లో భర్తీ చేసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇప్పటికే వివిధ డిజిటల్ సేవల్లో కన్వీనియెన్స్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, ఇతర రుసుముల పేరుతో వినియోగదారులపై ఖర్చులు పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఖర్చులు పరోక్షంగా వినియోగదారులకు చేరకుండా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ ఉందా? అన్నదే కీలకంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే ముందు, దాని ప్రభావాలపై ప్రభుత్వం సమగ్రంగా వివరాలు వెల్లడించాలని మేధావులు సూచిస్తున్నారు.
యూపీఐ నిర్వహణ ఖర్చుల పేరుతో ఛార్జీలా?
2021–22 నుంచి 2024–25 వరకు నాలుగేండ్లలో యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాల మొత్తం రూ.8,730 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే ఏడాదికి సగటున సుమారు రూ.2,183 కోట్లు అన్నమాట. యూపీఐ ద్వారా కోట్లాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు, ఆర్థిక సంస్థలు ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో వ్యవస్థ నిర్వహణ ఖర్చులను మాత్రమే ముందుకు తెచ్చి ఛార్జీలను సమర్థించడం సరిపోతుందా? అనే ప్రశ్న నెలకొంటోంది. 2025–26లో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్ల మిగులు మొత్తాన్ని బదిలీ చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులు, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని నిపుణులు అంటున్నారు.
గత హామీలకు భిన్ననమైన నిర్ణయాలు
గతేడాది జూన్‌లో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆ సమయంలో అలాంటి వార్తలను నిరాధారమైనవిగా వివరించింది. ఇప్పుడు ఎండీఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టే నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిలో మార్పునకు కారణాలేమిటి? గతంలో ఇచ్చిన హామీలకు ప్రస్తుత నిర్ణయాలకు మధ్య తేడా ఎందుకు ఏర్పడింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తన విధానానికే విరుద్ధంగా కేంద్రం అడుగులు
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ నగదు వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. అయితే యూపీఐపై ఛార్జీలు ఉండవచ్చన్న భావన ప్రజలు, వ్యాపారులను తిరిగి నగదు వైపు మళ్లించేలా చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చిన్న వ్యాపారాలు, గృహ సేవలు, ప్రయివేటు ట్యూషన్లు, నిర్మాణ రంగం వంటి విభాగాల్లో నగదు వినియోగం ఇప్పటికీ కొనసాగుతోంది. డిజిటల్ చెల్లింపులు ఖర్చుతో కూడుకున్నవిగా మారవచ్చన్న భావన ఏర్పడితే.. నగదు చెల్లింపులకే ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తరించాలనే ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధమైన పరిణామంగా మారే అవకాశం ఉంది.
ఉచిత యూపీఐకి ఛార్జీల ఉచ్చు
యూపీఐలో రూ.2,000కు మించిన ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించే నిర్ణయం చర్చకు దారితీసింది. కస్టమర్లపై నేరుగా ఛార్జీ విధించబోమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. వ్యాపారులపై అదనపు ఖర్చు పడినప్పుడు దాని పరోక్ష ప్రభావం వినియోగదారులపై పడకుండా ఎలా అడ్డుకుంటారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం వ్యాపారులు ఎండీఆర్‌ను కస్టమర్లపై మోపకూడదని అంటోంది. ఆ ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయో లేదో నిర్ధారించడం మరో సవాల్. ప్రతి దుకాణం, సేవా సంస్థ, వ్యాపారి వద్ద ఛార్జీల అమలును పర్యవేక్షించేందుకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందా? అనే ప్రశ్నలకు కేంద్రమే సమాధానం చెప్పాలి.
‘డిజిటల్ ఇండియా’ ప్రచారానికి..
ఆచరణకు మధ్య అంతరం
యూపీఐ విస్తరణను మోడీ ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా’ విజయంగా ప్రచారం చేస్తోంది. కోట్లాది మంది ప్రజలు వినియోగిస్తున్న వ్యవస్థను మరింత సులభంగా, అందుబాటులో ఉండేలా చేయాల్సిన సమయంలో, ఛార్జీలపై అనిశ్చితిని సృష్టించే నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల లక్ష్యాలు సాధించాలంటే ప్రజల విశ్వాసం, వ్యాపారుల భాగస్వామ్యం, వ్యవస్థపై నమ్మకం కీలకం. ఈ అంశాలను దెబ్బతీసే అవకాశం ఉన్న విధానాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



