భువనగిరి కలెక్టరేట్ ఎదుట సర్పంచులు, కౌన్సిలర్ల ధర్నా
అన్ని గ్రామాలకూ సమదృష్టితో నిధులుకేటాయించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి.జహంగీర్
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
సీపీఐ(ఎం) సర్పంచులు, కౌన్సిలర్లు ఉన్నచోట నిధులు విడుదల చేయడంలో ఎమ్మెల్యేలు వివక్ష చూపడం తగదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ అన్నారు. నిధులు విడుదల చేయడంలో వివక్షను నిరసిస్తూ శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జహంగీర్ మాట్లాడుతూ.. ప్రధానంగా జిల్లాలో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు ఉన్నచోట నిధుల కేటాయింపులో ఎమ్మెల్యేలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గ్రామాలకు నిధులు కేటాయిస్తూ.. సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు ఉన్న చోట్ల నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి యొక్క సమతుల్యం దెబ్బతింటోందన్నారు. జిల్లా అధికారులకు కూడా ఏదైనా వినతిపత్రం ఇస్తే జవాబుదారీతనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామన్నపేట నుంచి పల్లెపహాడ్ వరకు ప్రధానమైన రోడ్డు.. సుమారు 30 నుంచి గ్రామాలకు లింకు ఉన్న కీలకమైన రోడ్డు పూర్తిగా గుంతల మాయమై అధ్వానంగా మారినా స్థానిక శాసనసభ్యులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
దుబ్బాక గ్రామంలో ట్యాంక్ కు మెట్లు లేక ఇబ్బంది అవుతున్నా పట్టించుకునే స్థితి లేదన్నారు. సుంకిశాల గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని, అనాజిపురం గ్రామంలో డ్రయినేజీ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందని, చౌటుప్పల మున్సిపల్ 16వ వార్డులో నాగులకుంట పనులు ఇప్పటికీ ముందుకు సాగడం లేదన్నారు. ఆలేరు మండలంలో తూర్పుగూడెం గ్రామంలో నిధుల విడుదలలో ఎమ్మెల్యే స్పందన లేదని, ఇప్పటికైనా శాసనసభ్యులు తమ నిధులను సమదృష్టితో ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దయ్యాల నర్సింహా, వలిగొండ మండల కార్యదర్శి సిరుపంగి స్వామి, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, చీమలకొండూర్ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, ఆలేరు మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, సుంకిశాల సర్పంచ్ పైళ్ల సంధ్యరాణి, అనాజిపురం సర్పంచ్ సురేష్, చౌటుప్పల్ 16వ కౌన్సిలర్ బత్తుల జయమ్మ, వెంకటాపురం సర్పంచ్ కలమ్మ-యాదయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లాడియా రాజు, ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి ఈర్ల రాహుల్ పాల్గొన్నారు.


