రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇచ్చింది. చట్టం అంటరానితనాన్ని నేరంగా ప్రకటించింది. కాలం మారిందని, సమాజం అభివృద్ధి చెందిందని చెప్పుకుం టున్నాం. కానీ, ఆధునిక భారతంలో కుల దురహంకారం ఇంకా తన పాత కోరలను దాచుకోలేదు. కులం పేరుతో మనిషిని తక్కువ చేయడం, అతని హక్కులను నిరాకరించడం, అతని ప్రేమను శాసించడం, ఎదురు తిరిగితే దాడి చేయడం, చివరకు అతని నిలువ నీడను కూడా నేలమట్టం చేయడం-కుల పెత్తందారి తనానికి మారిన రూపాలు. కులపెత్తందారుల ధైర్యం కేవలం వారి సామాజిక ఆధిపత్యం వల్లే కాదు. బాధితులు బలహీ నులని భావించి, తమకు రాజకీయ పలుకుబడి ఉందనే నమ్మకంతో, చట్టం తమను ఏమీ చేయదనే ధీమాతో వారు మరింత రెచ్చిపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలు. ఎందుకంటే, ఒక దళిత యువకుడు పండుగ ఊరేగింపులో పాల్గొన్నందుకు కత్తికి గురవుతున్నాడు. మరోచోట ఒక దళిత యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అతని కుటుంబం ఇల్లు కూల్చివేతకు గురవుతోంది. ఘటనలు వేర్వేరు అయినా వాటి వెనుక కనిపిస్తున్న సామాజిక ఆధిపత్య భావనను విస్మరించలేం. కులం తమకంటే దిగువన ఉన్నవారిని నియంత్రించడానికి హక్కు ఇస్తుందని భావించే మానసికతే ఇలాంటి దౌర్జన్యాలకు బలం చేకూరుస్తోంది.
నల్గొండ జిల్లాలో ఈ నెల 22న వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దళిత యువకుడిపై కత్తితో దాడి జరిగిన ఘటన ఈ ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది. మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన పోతేపాక సాయిపై కొందరు పెత్తందారి కులాలకు చెందిన వ్యక్తులు అతనిపై దాడిచేశారు. గొంతుకోసేందుకు ప్రయత్నిం చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కుల ఆధిపత్య మనస్తత్వం మరో తీవ్ర రూపంలో జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో బయటపడింది. జిల్లా కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో కులవివక్ష వేళ్లూనుకుని ఉంది. గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగముని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈనేశ్వరిని ప్రేమించి ఈ నెల 9న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. ఇది అంగీకరించిన యువతి బంధువులు ట్రాక్టర్లు, గడ్డపారలతో అతని ఇల్లు కూల్చివేశారు.ఇది కేవలం ఒక ఇంటి గోడలు కూల్చిన ఘటనగా చూడా ల్సిన విషయం కాదు. కులపెత్తందారితనం ఒక మనిషి ప్రేమను అంగీకరిం చక పోవడం నుంచి అతని ఇంటిని కూల్చే స్థాయికి చేరితే, అది ఒక కుటుంబంపై దాడి మాత్రమే కాదు-రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వంపై కూడా సవాలే.
రేపల్లెలో దళిత కుటుంబాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం, వారిపై అగ్రవర్ణాల పెత్తనం, దేవాలయ ప్రవేశంలో వివక్ష కొనసాగడం అక్కడి సామాజిక పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. కులం పేరుతో దేవాలయంలోకి అనుమతించక పోవడం, సామాజికంగా దూరంగా ఉంచడం, అంతరకుల వివాహాన్ని వ్యతిరేకించడం-ఇవన్నీ ఒకే ఆధిపత్య భావజాలానికి వేర్వేరు రూపాలుగా కనిపిస్తున్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. పైగా ఇలాంటి ఘటనల్లో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, బాధితులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కుల ఆధారిత దాడులపై మౌనం వహించకుండా బాధితుల పక్షాన నిలిచి, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనే నమ్మకాన్ని కల్పించాలి. ప్రజల ఓట్లు కోరే సమయంలో ప్రతి పౌరుడూ సమానమే అయితే, దాడులు జరిగినప్పుడు కూడా ప్రతి పౌరుడి ప్రాణం, గౌరవం, హక్కులు సమానంగానే కనిపించాలి. కుల దురహంకారం మాటల్లో ఉన్నా, దాడిగా మారినా, ఇల్లు కూల్చివేతగా మారినా దాని మూలం ఒకటే-ఆధిపత్యం.
దాన్ని ఎదుర్కోవాల్సింది కేవలం బాధితులే కాదు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ, ప్రజాప్రతినిధులు, పౌర సమాజం మొత్తం. ప్రతి దాడిపై నిష్పాక్షిక దర్యాప్తు, బాధితులకు రక్షణ, నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉండాలి. కుల వివక్షను కేవలం గ్రామీణ ప్రాంతాల సమస్యగా పక్కన పెట్టడం కూడా సరికాదు. విద్య, ఉపాధి, పట్టణ జీవితం పెరిగినా మనుషుల మధ్య కుల గోడలు పూర్తిగా కూలిపోలేదనే విషయాన్ని ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తు న్నాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించడం, బాధిత కుటుంబాలకు పునరావాసం అందించడం, సామాజిక బహిష్కరణకు గురయ్యే వారిని ఆదుకోవడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యవస్థలో మరింత సమర్థంగా అమలుకావాలి. కులం పేరుతో ఒకరి ప్రాణాన్ని, గౌరవాన్ని, ప్రేమను, ఇంటిని శాసించే హక్కు ఎవరికీ లేదు. కులపెత్తందారితనం ముందు రాజ్యాంగం ఓడిపోకూడదు. దళితుడు భయంతో బతకాల్సిన పరిస్థితి ఉన్నంతకాలం మనం సాధించిన సామాజిక పురోగతిపై ప్రశ్నలు తప్పవు.
టి.స్కైలాబ్‌బాబు, 9177549646



