Homeఎడిట్ పేజివ్యవస్థ నిర్లక్ష్యానికి బలైన పసిప్రాణాలు

వ్యవస్థ నిర్లక్ష్యానికి బలైన పసిప్రాణాలు

- Advertisement -

వారిలో ఒకరు పెద్దయ్యాక డాక్టర్‌ కావొచ్చు. మరొకరు యాక్టర్‌, లాయర్‌ కావొచ్చు. ఇంకొకరు ఇంజినీర్‌ కావొచ్చు. మరొకరు శాస్త్రవేత్త కావొచ్చు. ఏమో.. వీరిలో ఎవరైనా రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా అయ్యేవారేమో! న్యూటన్‌ పెద్దయ్యాక శాస్త్రవేత్త అవుతాడని ఎవరూహిం చారు? హైదరాబాద్‌లో పుట్టిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ అవుతారని ఎవరికి తెలుసు? పేపర్‌బాయ్‌గా పనిచేసిన ఏపీజే అబ్దుల్‌ కలాం ఇస్రో శాస్త్రవేత్తగా, ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా ఎదుగుతారని ఎవరైనా ఊహించారా? చెన్నైలోని చిన్న రెండుగదుల ఇంట్లో పెరిగిన సుందర్‌ పిచాయ్‌ ఒకరోజు గూగుల్‌ సీఈఓ అవుతారని అప్పట్లో ఎవరికి తెలుసు? అలాంటి బంగారు భవిష్యత్తును మోసు కొచ్చిన ఐదుగురు నవజాత శిశువులు ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వ్యవస్థ నిర్లక్ష్యానికి బలయ్యారు. పుట్టి కొన్నిరోజులు కూడా గడవకముందే వారి జీవి తాలు ముగిశాయి.

మరో పదిహేడుమంది శిశువులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారిక సమాచారం. పసికందుల కేరింతలతో సందడిగా ఉండాల్సిన శిశువుల వార్డు ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. తల్లిదండ్రుల కళ్లముందే వారి బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం అవసరమే. అయితే ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో ప్రభుత్వ బాధ్యత పూర్తయినట్టుగా భావించలేం. డబ్బు ఇవ్వడం నష్టానికి పరిహారం కావచ్చు.. కానీ నిర్లక్ష్యానికి సమాధానం కాదు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? బాధ్యులు ఎవరు? ఇవే తేలాల్సిన అసలు ప్రశ్నలు.

పిల్లలనే చులకన భావమా?
ఇక్కడ మరో ప్రశ్న కూడా ప్రజల్లో చర్చకు వచ్చింది. సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయిన ఘటనల్లో నేతలు హుటాహుటిన వెళ్లి పరామర్శిస్తారు. కుటుం బాలను ఆదుకుంటామని హామీలు ఇస్తారు. ఎక్స్‌గ్రేషియాలు ప్రకటి స్తారు. కానీ రోజుల వయస్సున్న ఈ పసికందుల విషయంలో మాత్రం అదే స్థాయి స్పందన కనిపించ లేదనే విమర్శలు వచ్చాయి. చిన్నారులకు ఓటు హక్కు లేదు కాబట్టేనా వారి ప్రాణాలకు రాజకీయ ప్రాధాన్యం లేదన్న చులకన భావం ఏర్పడిందా? అన్న ప్రశ్న కూడా వినిపించింది.“కొందరికి అడక్కుం డానే ఉచిత హామీలిస్తున్న నేతలు.. చిన్నారులకు ఓటు హక్కులేదు కదా!” అనే ‘కిక్‌’ సినిమా డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ స్థానికంగా కొందరు చేసిన వ్యాఖ్యలు ఈ విషాదం ఎంతటి ప్రశ్నను లేవనెత్తిందో సూచిస్తు న్నాయి. ఇది కేవలం ఒక వ్యంగ్య వ్యాఖ్యగా తీసిపారే యాల్సిన విషయం కాదు. ప్రజా స్వామ్యంలో ఓటు వేయగల వయస్సు ఉన్నా లేకపోయినా ప్రతి పౌరుడి ప్రాణానికి సమాన విలువ ఉండాలి. ముఖ్యంగా రక్షణ కోసం పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థపై ఆధారపడిన నవజాత శిశువుల విషయంలో బాధ్యత మరింత ఎక్కువగా ఉండాలి.

ప్రైవేటు ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరిగితే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తాం. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తాం. మరి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వమే యజమాని. ప్రభుత్వమే నిర్వహణాధికారి. ప్రభుత్వమే పర్యవేక్షకుడు. కాబట్టి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి, దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.ఏసీ ఎందుకు చెడిపోయింది? షార్ట్‌సర్క్యూట్‌ ఎలా జరిగింది? వైరింగ్‌ సక్రమంగా ఉందా? విద్యుత్‌ హెచ్చుతగ్గులు ఏమైనా కారణమా? పరికరాల నిర్వహణ ఎలా జరుగుతోంది? ఫైర్‌ సేఫ్టీ ఏర్పా ట్లు పనిచేస్తున్నాయా? శాశ్వత ఎలక్ట్రిషియన్లు, సాంకేతిక సిబ్బంది సరిపడా ఉన్నారా? ఆస్పత్రిలోని కీలక విభాగాలను అధికారులు ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారు? ఇవన్నీ సమగ్ర దర్యాప్తులో తేలాలి.

ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా?
ఆదిలాబాద్‌ ఘటన ఒక్కటే కాదు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ఇతర భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఇతర ఆస్పత్రుల్లో షార్ట్‌సర్క్యూట్‌ ఘటనలు గతంలోనూ నమోదయ్యాయి. 2025లో గుల్జార్‌హౌజ్‌ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రతి ఘటన తర్వాత విచారణలు, తనిఖీలు, భద్రతా చర్యల ప్రకటనలు రావడం జరుగుతోంది. కానీ ఒక ఘటన నుంచి మరో ఘటన వరకు వ్యవస్థలో శాశ్వత మార్పు ఎంత వచ్చింది? అన్నది మాత్రం ప్రశ్నగానే మిగులుతోంది.ఒకసారి ప్రమాదం జరిగితే విచారణ.. తర్వాత ఎక్స్‌గ్రేషియా.. కొంతకాలానికి మళ్లీ మామూలు పరిస్థితి.. ఇదే పద్ధతి కొనసాగితే ప్రమాదాలు ఆగవు. గత ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్‌, ఫైర్‌ సేఫ్టీ, అత్యవసర మార్గాలు, పరికరాల నిర్వహణ, సిబ్బంది కొరత తదితర అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలి. లోపాలున్న చోట తక్షణమే సరిదిద్దాలి.

గర్భస్థ శిశువుకూ హక్కులున్నాయి
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టాలు, కమిషన్లు ఉన్నాయి. పిల్లల ప్రాణం, ఆరోగ్యం, రక్షణ వంటి అంశాలను నిర్లక్ష్యం చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విచారణలు, పరి హారం, బాధ్యతపై చర్యలు చేపట్టారు. అలాంటి ఘటనల నుంచి వ్యవస్థ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబాలకు డబ్బు ఇవ్వడం కంటే.. ప్రమాదం జరగకుండా చూడడమే ప్రభుత్వానికి ఉన్న అసలు బాధ్యత. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఘటన ప్రకృతి వైపరీత్యం కాదు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, ఏసీ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ, అసలు కారణాలు సమగ్ర దర్యాప్తులో తేలాలి. అవసరమైతే న్యాయ విచారణకు ఆదేశించాలి. బాధ్యులు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఎక్స్‌‌గ్రేషియాతో బాధ్యత ముగియదు
రిమ్స్‌లో సిబ్బంది, మౌలిక వసతులు, నిధుల కొరత వంటి సమస్యలు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించాలి. శిశువుల వార్డును వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఒక్కటే సరిపోదు. అప్పటివరకు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న శిశువుల వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ పెట్టాలి. మృతుల కుటుంబాలకు అవసరమైన ఆర్థిక, మానసిక భరోసా కల్పించాలి. అంతకంటే ముఖ్యంగా.. ఈ ఘటనను మరో సాధారణ ప్రమాదంగా మిగలనివ్వకూడదు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం తక్షణ బాధ్యత మాత్రమే, అసలు బాధ్యత లోపాలను గుర్తించి సరిదిద్దడం, తప్పిదాలకు జవాబుదారులను తేల్చడం, మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా వ్యవస్థను పటిష్టం చేయడం. ఈ ఘటనపై జరిగే విచారణ ఒక నివేదికతో ముగిసిపోకుండా, దాని ఆధారంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను సమీక్షించే చర్యలకు దారితీయాలి. రిమ్స్‌ ఘటన నుంచి పాలకులు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఇదే.

కొలిపాక నాందేవ్‌‌, 9490099387

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -