Homeఎడిట్ పేజిదోపిడీలో బ్రిటీష్ రికార్డును అధిగమించిన బీజేపీ

దోపిడీలో బ్రిటీష్ రికార్డును అధిగమించిన బీజేపీ

- Advertisement -

ఈ దేశాన్ని దోచుకుపోవడానికి బ్రిటీష్ వారికి ఎందుకు రెండు వందల ఏండ్లు పట్టిందో అర్థం కాదు. ఇప్పుడు బీజేపీని చూడండి- కేవలం పన్నెండేళ్లలో దేశాన్ని బికారిగా మార్చేసింది. ఒక ఆఫ్రికా సామెత ఉంది- ‘‘గాడిద నిన్ను తన్నిందని నువ్వు మళ్లీ దాన్ని తన్నావనుకో – అప్పుడు ఇద్దరూ గాడిదలే అయ్యారు కదా?’’ అన్నది ఆ సామెత! మొఘలుల, బ్రిటీషు వారి దోపిడీని నిందించే ఈ అరెస్సెస్ బీజేపీ ప్రభుత్వం – వారి రికార్డులన్నింటినీ అధిగమిస్తే ఈ దేశ ప్రజలు ఏమనుకోవాలి ? మొఘలులు ఈ దేశాన్ని దోచారు అని ప్రచారం చేశారు కదా? వారు కనీసం తాజ్‌మహల్, లాల్ ఖిలా, కుతుబ్ మినార్ మిగిల్చిపోయారు. బ్రిటీష్ వాడు ఈ దేశాన్ని దోచేశారు అని ప్రచారం చేశారు కదా? వారు కనీసం దేశవ్యాప్తంగా రైల్వే లైన్లు, రోడ్లు, సివిల్ సర్వీసులు, ఇంగ్లీషు చదువులూ ఇచ్చిపోయారు. కాంగ్రెస్ వారు ఈ దేశాన్ని దోచేశారు అని ప్రచారం చేశారు కదా? వారు కనీసం ఐఐటి, ఎ.ఐ.ఐ.యం.యస్, ఇస్రో, డ్యామ్‌లు, పరిశ్రమలు వంటివి మిగిల్చారు. ఆరెస్సెస్, బీజేపీలు కలిసి ఈ దేశాన్ని అడ్డంగా దోచేశారు. కాని వీరు ఇచ్చింది గానీ, మిగిల్చింది గానీ ఏమీ లేదు. అంధభక్తుల్ని తయారు చేశారు. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు పెంచారు. అవినీతి పరులను తనలో కలుపుకుంటూ – బీజేపీ అతి పెద్ద ధనిక పార్టీగా అవతరించింది.

స్వయంగా మోడియే ఒక సభలో తన బీజేపీ కార్యకర్తలతో ఇలా చెప్పుకున్నాడు – ‘‘మీరు నన్ను ఒక రాముడిగా భావిస్తున్నారు కదా? అయితే మిమ్మల్ని మీరు ఆంజనేయులుగా భావించుకోండి’’ అని!
అప్పుడు ఒక సభ్యుడు లేచి ‘‘ప్రభూ! మమ్మల్ని ఇక సీతామాతను వెతకడానికి పంపిస్తారా?’’ అని అడిగాడు భక్తి ప్రపత్తులతో అంతే! సభలోని వారంతా గొల్లుమని నవ్వారు. మోడీ ముఖం మాడ్చుకున్నాడు. బీజేపీ, ఆరెస్సెస్ ల కుటుంబాలు దేశభక్తుల కుటుంబాలనీ, నీతిమంతుల కుటుంబాలని తెగ ప్రచారం చేసుకుంటున్నారు కదా? మరి ఇదంతా ఏమిటి బాబూ? కొన్ని ఉదాహరణలు మాత్రమే చూద్దాం!

శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యాపం స్కామ్
సువేందు అధికారి – శారదా స్కామ్
నారాయణ్ రాణే – భూ కుంభకోణం
హిమంత బిశ్వశర్మ – శారదా స్కామ్
రఘువర్ దర్ – టి షర్టు స్కామ్
ప్రఫుల్ పటేల్ – ఎయిర్ ఇండియా కుంభకోణం
బి.ఎస్. బొమ్మై – పే- సి.యం.
అజిత్ పవార్ – ఇరిగేషన్ స్కామ్
పెమా ఖండూ – రూ.రెండు వేల కోట్ల కుంభకోణం
హసన్ ముష్తిఫ్‌ -రూ.15 వందల కోట్ల కుంభకోణం
జనార్ధన్ రెడ్డి – రూ.35 వేల కోట్ల కుంభకోణం.

వీటి గురించి అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ దేశ ప్రజలకు వివరణలు ఇచ్చారా? కనీసం క్షమాపణలు కోరారా? ఇదిలా ఉంటే- బీహార్ కిన్నర్ సంక్షేమ బోర్డు తొలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినట్లు.. సమాచారం! ఆ ఆలయంలో మోడీ బంగారు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. దీని కోసం ఐదెకరాల భూమిని, రూ.112 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది! ఇది ఒక్కటే మిగిలిపోయింది మరి? మోడీ ఇంతవరకు వేయని డ్రామాలలో !! బీహార్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? పేదరికం ఎంత తీవ్రుంగా ఉంది? వైద్య రంగం ఎంత ఘోరంగా ఉంది?వాష్ రూమ్స్ లేని బాలికల పాఠ శాలలెన్ని? బేరీజు వేసుకునే పని లేదు. అవినీతి గురించి ఇక చెప్పనక్కరలేదు. మతంలోను, మూఢ నమ్మకాలలోనూ జనాన్ని నిరంతరం ముంచుతూ, మోసం చేస్తూ, ఓట్ చోరికి పాల్పడుతూ ఈ బీజేపీ ప్రభుత్వం, ఆలయాలు తప్ప ఏం కడుతూ ఉంది? ‘‘తను, తన తల్లికి పుట్టలేదు – ఆ భగవంతుడే నేరుగా తనను ఈ భూమి మీదికి పంపించాడు’’ అని ప్రకటించుకున్నవారికి ఆలయం లేకపోతే ఏం బావుంటుందీ- అని బీహార్ వాళ్లు అనుకుని ఉంటారు. అందుకే ఇప్పుడు నరేంద్రమోడీకి కట్టాల్సిన ఆలయం గురించి ఆలోచిస్తున్నారు.

అయితే, ఇక్కడ ఒక్క విషయం – దేశమంటే బీహార్ కిన్నార్ సంక్షేమ బోర్డు మాత్రమే కాదు. దేశమంతటా జెన్.జి మేల్కొంది. ఇంకా ఎక్కువ చేస్తే విగ్రహానికి బదులు స్వయంగా నరేంద్ర మోడీనే పట్టుకు పోయి ఆ గుళ్లో ప్రతిష్టించగలరు. అప్పుడు తెలుస్తుంది అయ్యగారికి – ‘తనను తల్లి కన్నదా? లేక స్వయంగా భగవంతుడే తనను ఈ భూమి మీదికి పంపించాడా?’- అన్నది! రూ.6695 కోట్లతో నిర్మించిన పూణే- ముంబై ఎక్స్ ప్రెస్‌వే రెండవ టన్నెల్ వర్షాలకు ఇటీవల కూలిపోతే- జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన ప్రతిపక్షాలను మహారాష్ట్ర సి.యం ఫడ్నవీస్ ఏమన్నాడంటే- ‘‘కుక్కలు కూడా పట్టించుకోని వ్యక్తులు సోషల్ మీడియాలో మా మీద అరుస్తారా?’’ అని అన్నాడు. అంటే ప్రశ్నించిన ప్రతిపక్షాలను కుక్కలకన్నా హీనమని అన్నట్టే కదా? తమను తాము సంస్కారవంతులమని, దేశభక్తులమని డప్పు కొట్టుకుని తిరిగే వారు -తమ సంస్కారం గురించి అత్మవిమర్శ చేసుకోరా? వర్షాలకు టన్నెల్ కూలిపోతే, ప్రజలకు సమాధానం చెప్పుకోరా? అదంతా ప్రజల సొమ్ము కాదా? ముంబై హైకోర్టుకు సంబంధించిన జస్టిస్ మాధవ్ జమ్ దార్ ధైర్యంగా దేశ పరిస్థితుల మీద ఇలా వ్యాఖ్యానించాడు- ‘‘ప్రస్తుత భారత ప్రభుత్వం ఈ భారతీయ, ప్రజల్ని బానిసలుగా చేయాలని చూస్తోంది. ఎందుకంటే ఎవరూ నిరసన తెలుపగూడదు. ఉద్యమించగూడదు.

ఏమిటి ఇదంతా? ఎన్నెన్నో పేపర్ లీక్‌‌లు జరుగుతున్నాయి. వాటిని నిరసించే వారిపై ప్రభుత్వం కేసులు పెడుతూ ఉంది. ఇది పౌర హక్కుల్ని కాలరాయడం కాదా?’’ -గుజరాత్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో దళిత విద్యార్థుల పట్ల 54 శాతం వి‌వక్ష ఉన్నట్లు నవ్ సర్జన్ సర్వే వెల్లడించింది. పాఠశాల గదుల్లో దళిత విద్యార్థుల్ని వేరు చేసి, వారిని విడిగా కూర్చో బెడుతున్నట్లు సర్వే సమాచారమిచ్చింది. మధ్యాహ్న భోజనం వడ్డించడం లోనూ, చివరకు మరుగుదొడ్ల వాడకంలోనూ వివక్ష పాటిస్తున్నట్లు వెల్లడయింది. తోటి విద్యార్థులతో కలిసి ఉదయపు ప్రార్థనల్లో పాల్గొనడంలో కూడా వివక్ష పాటిస్తున్నారు. ఇది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇంకా అవసరమా? పాలకుల మైండ్ సెట్ మారదా?

హిందుత్వ అంటేనే అజ్ఞానానికి పరాకాష్ట!
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్దమాన్ జిల్లా రాణిగంజ్‌లో ఉన్న తొమ్మిది అడుగుల రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని, అక్కడి బీజేపీ ప్రభుత్వ గూండాలు కూల్చేశారు. ఈ చర్య పట్ల బెంగాల్‌లోని సాహిత్య, సాం‌స్కృతిక, కళారంగాల బుద్ధిజీవులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఆ చర్యను నిరసించారు. రాహుల్ సాంకృత్యాయన్ నిరంతర యాత్రికుడు, పరిశోధకుడు, నవలాకారుడు, తత్త్వవేత్త, ప్రాచీన బౌద్ధ గ్రంథాల పరిష్కర్త, బహుభాషా వేత్త, మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ ఈ దేశప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మహోన్నతుడి విగ్రహం ధ్వంసం చేయడం బీజేపీ ప్రభుత్వాల దుశ్చర్యల్లో ఒకటి. హిందుత్వ ఎజెండాతో బెంగాల్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ గూండాలు చేసిన నిర్వాకం ఇది. ప్రభుత్వ పెద్దల అసహనానికి పరాకాష్ట! గాంధీ చరఖాతో మనకు స్వాతంత్ర్యం లభించిందని మనందరం చదువుకుంటూ పెరిగాం. ఇక, ఇప్పుడు బుల్డోజర్‌తోనే శాంతి చేకూరుతుందని, నేటి ప్రభుత్వ పెద్దలు రాబోయే తరాలను బోధించాలని చూస్తున్న ట్టుంది?

‘‘జీవితాంతం నేను బ్రిటీషు వారికి బానిసగానైనా ఉంటా – కానీ, దళితులు, వెనకబడిన వర్గాలు, ముస్లింలతో సమానంగా పంచుకునే స్వాతంత్ర్యం నాకు వద్దు-’’అని అన్నవాడు ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్. ఆయన ఆలోచనే అలా ఉంటే, ఇక ఆయన వారసులైన నేటి దేశనాయకుల ఆలోచనలూ, చర్యలు వేరుగా ఎందుకుంటాయ్? చంద్రశేఖర్ ఆజాద్‌ను సజీవంగా గాని, మృతుడిగా ‌గాని తెచ్చి అప్పగిస్తే – రూ.5 వేల బహుమతి ఇస్తామని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బహుమతిని గెల్చుకున్నది మరెవరో కాదు వీరభద్ర తివారీ అనే బ్రాహ్మణోత్తముడు! మనవారి దేశభక్తి, విశాల దృక్పథం ఇలా ఉంటుందన్నమాట! నేటి ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, యం.ఎ. (ఎంటైర్ పొలిటికల్ సైన్స్) ఢిల్లీ యూనివర్సిటీ-ప్రవర్తన గురించి తృణమూల్ కాంగ్రెస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది – ‘‘అతడు పార్లమెంట్‌కు రాడు కానీ, ఎన్నికల ర్యాలీలలో సందులలో, గొందులలో కూడా కనిపిస్తాడు. అతడి ప్రవర్తన ప్రధానమంత్రిగా లేదు. ప్రచార మంత్రిగా ఉంది’’ అని! ఈ అభిప్రాయంతో ఈ దేశ ప్రజలు ఏకీభవిస్తున్నారు.

‘ఉద్యమాల నుంచే భవిష్యత్తు నాయకత్వం రూపుదిద్దు కుంటుంద’న్న ఆత్మవిశ్వాసాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు వెలిబుచ్చాడు. ‘‘స్వాతంత్ర్య పోరాటం నుంచి వచ్చిన నేతలే తొలిదశలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. కానీ, ఇప్పుడు కార్పొరేట్‌స్వామ్యం నడుస్తూ ఉంది. ఫలితంగా విద్యార్థులను రాజకీయాలకు దూరం చేశారు. విద్యార్థి సంఘాల్ని నిర్ల‌క్ష్యం చేశారు. మరోవైపు రాజకీయ నాయకుల వారసులే మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు తప్పించి, కొత్త రక్తం, కొత్త ఊపిరి రాజకీయ రంగంలోకి రావడం లేదు. బాగా స్థిరపడ్డ రాజకీయ నాయకులే. వారి కొడుకుల్ని, బిడ్డల్ని నాయకులుగా జనం మీద రుద్దుతున్నారు. వీరు జన నాయకులుగా ఎలా ఎదగగలరూ? ఈ పరిస్థితి మారాలి! పెద్దనోట్ల రద్దు తర్వాత, బీజేపీ ప్రతి జిల్లాలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించుకుంది. కానీ, 94 వేల ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేయించి, కొనసాగించాల్సింది పోయి- వాటినన్నింటినీ బీజేపీ మూసేయించింది. భవిష్యత్తులోకి దారులు వేయడమంటే ఇదేనా?’’ అని ప్రశ్నించారు – అభిజిత్ దీప్కె, సిజెపి నాయకుడు.
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -